[spt-posts-ticker]

పొట్ట కొడుతున్నవైరస్‌

  • వైరస్‌ ధాటికి కీలక రంగాలన్నీ కుదేలు
  • జీవనోపాధి కోల్పోతున్న కోట్లాది పేదలు
  • ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన బాధితులు
  • ఈయూ దేశాల్లో పెరుగుతున్న కేసులు.. చైనాలో తగ్గుముఖం
  • భారత్‌లో మరో వ్యక్తికి వైరస్‌.. 31కి పెరిగిన బాధితులు

న్యూఢిల్లీ/బీజింగ్‌, మార్చి 6: కరోనా వైరస్‌ పేదల కడుపుమీద కొడుతున్నది. వైరస్‌ ప్రభావంతో కీలక రంగాలన్నీ కుదేలవడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవనోపాధి కోల్పోయారు. చైనాలో ప్రజలు ఏకంగా నెలన్నరగా ఇండ్లకే పరిమితమయ్యారు. ప్రభావిత దేశాల్లో నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పర్యాటక రంగం నిషేధాజ్ఞల మధ్య నలుగుతున్నది. ఆతిథ్యరంగం అస్తవ్యస్తంగా మారింది. కనీసం కూలి పని కూడా దొరుకడంలేదు. దీంతో లక్షల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నా యి. ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లోకి కరోనా విస్తరిస్తే పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్నది.

వాటికన్‌, భూటాన్‌లలో తొలి కేసులు

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య శుక్రవారంతో లక్ష దాటింది. 92 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి ఇప్పటివరకు దాదాపు 3,400 మందిని బలితీసుకున్నది. వాటికన్‌ సిటీ, భూటాన్‌లో మొదటి కేసులు నమోదయ్యాయి. భూటాన్‌లో పర్యటిస్తున్న అమెరికావాసి(76)కి పాజిటివ్‌ అని తేలింది. ఆయన తన భార్యతో కలిసి ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు భారత్‌లో పర్యటించి.. 2వ తేదీన భూటాన్‌కు వచ్చినట్టు అధికారులు తెలిపారు. వాటికన్‌ సిటీలో ప్రతి వ్యక్తిని పరీక్షించాలని, అన్ని ఇండ్లను రసాయనాలతో శుభ్రం చేయాలని నిర్ణయించారు.

ఢిల్లీలో మరో కేసు

మనదేశంలో మరో వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో బాధితుల సంఖ్య 31కి పెరిగింది. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఇటీవల థాయ్‌లాండ్‌, మలేషియాలో పర్యటించి వచ్చాడని, అతడికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం అన్ని రాష్ర్టాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో అపోహలను తొలిగించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైవలెన్స్‌ ప్రోగామ్‌ (ఐడీఎస్పీ) నెట్‌వర్క్‌ కింద గురువారం నాటికి 29,607 మందిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు ఆయన లోక్‌సభలో వెల్లడించారు. ఇరాన్‌ నుంచి 300 మంది భారతీయుల రక్తనమూనాలు ఆ దేశ విమానంలో ఢిల్లీకి వస్తున్నా యని, తిరుగు ప్రయాణంలో ఇరాన్‌ దేశీయులను తీసుకెళ్తుందని చెప్పారు. కరోనా కారణంగా హోలీ, మహిళా దినోత్సవ కార్యక్రమాలు పలు రద్దయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 31 వరకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. 27-29 మధ్య జరుగాల్సిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడింది.

ఐరోపా దేశాలవైపు..

కరోనా జన్మస్థానమైన చైనాలో బాధితుల సంఖ్య తగ్గడం ఊరటనిచ్చే అంశం. శుక్రవారం 142 కొత్త కేసులు నమోదయ్యాయి. చైనా తర్వాత తీవ్రంగా ప్రభావితమైన దక్షిణ కొరియాలో సైతం తగ్గుముఖం పడుతున్నది. గురువారం 851 కేసులు నమోదుకాగా, శుక్రవారం 505 కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే..ఐరోపా దేశాల్లో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. దీనికి ఇటలీ కేంద్రంగా మారింది. జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది.

ఇరాన్‌లో మృతుల సంఖ్య 124కు, బాధితుల సంఖ్య 4,747కు పెరిగింది. ప్రజలు నోట్లను వాడొద్దని ప్రభుత్వం పేర్కొంది.

అమెరికాలో 230 కేసులు నమోదయ్యా యి. వాషింగ్టన్‌లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం రూ.30 కోట్లతో ఓ హోటల్‌ను కొనుగోలు చేస్తున్నది. 84 గదులున్న ఆ హోటల్‌ను కరోనా చికిత్స కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది.

కరోనా కరాళనృత్యం చేస్తున్నా కొన్ని దేశాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా అవతల 17రెట్ల వేగంతో విస్తరిస్తున్నా తగిన చికిత్సఏర్పాట్లు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇది మాక్‌ డ్రిల్‌ కాదు.. సీరియస్‌గా తీసుకోండి’ అంటూ ప్రపంచదేశాలను హెచ్చరించింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *