[spt-posts-ticker]

పోషకాహాహాకారం

 ఐసీడీఎస్‌లో అస్తవ్యస్తం

● స్తంభించిన బాలామృతం

● అరకొరగా పాలు సరఫరా

● పడకేసిన క్షేత్ర పర్యవేక్షణ

 

న్యూస్‌టుడే, అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌): రక్తహీనత… పౌష్టికాహార లోపంతో పేద కుటుంబాలు సతమతం అవుతున్నాయి. నిరుపేద బాల, బాలికలు.. గర్భిణి/ బాలింతల్లో రక్తహీనత నియంత్రణ, పౌష్టికాహారాన్ని పెంపొందించాలనే కృతనిశ్చయంతో నెలకొల్పిన అంగన్‌వాడీ కేంద్రాలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో అత్యధిక అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, బాలింత, గర్భిణులకు అందజేసే పాలు నిల్వలు లేవు. పసిపిల్లలకు పంపిణీ చేసే బాలామృతం పౌష్టికాహారం ప్యాకెట్లు రాలేదు. వీటి సరఫరా తీవ్ర అస్తవ్యస్తంగా తయారైంది. ఎప్పుడు సరఫరా చేస్తారో… లబ్ధిదారులకు ఎప్పుడు ఇస్తారో అనే దానిపై ఒక పద్ధతి అంటూ లేదు. ప్రస్తుతం జిల్లాలో ఈ నెలకు సంబంధించి బాలామృతం సరఫరా కాలేదు. పాలు మాత్రం కొన్ని ప్రాజెక్టులకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏ ప్రాజెక్టులకు వచ్చాయో కూడా స్పష్టత లేదు. ఇతర పౌష్టికాహారం విషయంలోనూ ఇదే తరహా నెలకొంది. ఇక అమృత హస్తం పథకం పూర్తిగా పడకేసింది. ఒక్క పూట కడుపు నిండా భోజనం పగటి కలగానే మిగిలింది. క్షేత్ర స్థాయిలో సీడీపీవో, సూపర్‌వైజర్ల పర్యవేక్షణ పూర్తిగా అటకెక్కింది. కొద్దిమంది మాత్రమే అంకితభావంతో పని చేస్తున్నారు. చాలా మంది వచ్చామా… వెళ్లామా అనే రీతిలో పని చేస్తున్నారు.

పౌష్టికాహారం ఎలా?

విజయ వజ్ర పాలు సరఫరా అవుతోంది. గర్భిణి, బాలింతలకు అయితే రోజూ 200 మి.లీ, పిల్లలకు 100 మి.లీ ప్రకారం పంపిణీ చేయాలి. బాలామృతం అయితే మూడేళ్లలోపు పిల్లలకు నెలకు 2.5 కిలోలు కలిగిన పౌష్టికాహార ప్యాకెట్‌ ఇవ్వాలి. కోడిగుడ్లు అయితే… 3 ఏళ్లలోపు వారికి నెలకు ఎనిమిది, 3-6 ఏళ్లలోపు పిల్లలకు 16 గుడ్లు, గర్భిణి/బాలింతలకు 25 గుడ్ల ప్రకారం ఇవ్వాలి.

సరఫరా ఏం కాలేదంటే…

బాలామృతం ఉత్పత్తులను ప్రతి నెలా ఆఖరులో ప్రాజెక్టుల్లో నిల్వ చేయాలి. ప్రతి నెలా ఒకటి నుంచి ఐదో తేదీలోపు పిల్లలకు పంపిణీ చేయాలి. ప్రస్తుతం ఇది అమలు కాలేదు. ప్రతి నెలా 1.33 లక్షల ప్యాకెట్లు అవసరం. గత నెలలోనూ అరకొరగానే స్టాక్‌ వచ్చింది. కొంత మందికే పంపిణీ సాగింది. ఇక.. పాలు కూడా అంతే. ప్రతి నెలా 3.06 లక్షల లీటర్ల పాలు అవసరం. కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే సరఫరా అయ్యాయి. చాలా ప్రాజెక్టులకు అసలు రాలేదు. కోడిగడ్లు పరిస్థితి కూడా అంతే. కొన్ని ప్రాజెక్టులకే వెళ్లాయి. నెలకు 40.54 లక్షల కోడిగుడ్లు అవసరం. ఏ ప్రాజెక్టుకు ఏమేం సరఫరా అయ్యాయి. ఏం రావాల్సి ఉందనే వివరాలేవీ ఇక్కడి పీడీ కార్యాలయంలో లేవు. అసలు ప్రాజెక్టుల నుంచి సేకరించలేదు. సీడీపీవోలు కూడా ఇక్కడికి పంపలేదు. క్షేత్ర స్థాయి అధికారులు, పీడీ కార్యాలయం మధ్య సమన్వయం, సఖ్యత అసలు లేదు.

ఉన్నతాధికారులకు నివేదించాం

కొన్ని ప్రాంతాలకు వచ్చాయి. పాలు, బాలామృతం సరఫరాలో సమస్య ఉంది. త్వరలోనే అన్ని ప్రాజెక్టులకు వస్తాయి. ఇక్కడి సరఫరా విషయాన్ని రాష్ట్ర అధికారులకు కూడా తెలియజేశాం. అసలు ఏయే ప్రాజెక్టుకు ఏమేమీ వచ్చాయనే వివరాలు సేకరిస్తాం. వీటిని కలెక్టర్‌కు నివేదిస్తాం. – చిన్మయదేవి, పీడీ, ఐసీడీఎస్‌

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *