[spt-posts-ticker]

ప్రభుత్వాసుపత్రుల్లో అగ్నిమాపక కేంద్రాలు

నాలుగు దవాఖానాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు

హైదరాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్తగా అగ్నిమాపక కేంద్రాలను నెలకొల్పాలని సర్కారు నిర్ణయించింది. స్థలాన్ని వైద్యఆరోగ్యశాఖ సమకూర్చుతుండగా.. మానవ వనరులు, నిర్వహణ బాధ్యతను అగ్నిమాపక శాఖనే తీసుకోనుంది. తొలిదశలో ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జే, నిమ్స్‌ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా నెలకొల్పడానికి సన్నాహాలు మొదలయ్యాయి. అవసరమైన పరికరాల కొనుగోలుతో పాటు మానవ వనరులకు అవగాహన కల్పించడంపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. వైద్యులు, నర్సులు, ఇతర భద్రతా, పారిశుద్ధ్య సిబ్బందికి శిక్షణ కూడా నిర్వహిస్తోంది. ఇటీవల అగ్నిమాపక శాఖ అధికారుల సమావేశంలో 1000కి పైగా పడకలున్న ప్రధాన ఆసుపత్రుల్లోనే ప్రత్యేకంగా అగ్నిమాపక కేంద్రాలను నెలకొల్పే అంశం ప్రస్తావనకొచ్చింది. నగరం నడిబొడ్డున ఉన్న నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా, ఎంఎన్‌జే, నిలోఫర్‌ వంటి ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంటే.. అక్కడికి చేరుకోవడానికి కనీసం గంటకు పైగా సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఆసుపత్రిలో నిబంధనలకు అనుగుణంగా ఎన్ని ఏర్పాట్లు చేసినా.. బహుళ అంతస్తుల భవంతిలో, ఇంత పెద్దసంఖ్యలో పడకలున్న చోట అగ్నిప్రమాద నష్టం తీవ్రస్థాయిలో ఉండే అవకాశం ఉంటుందనే ఆందోళన వ్యక్తమైంది. ఈ అంచనాలను దృష్టిలో ఉంచుకొని ఆయా ఆసుపత్రుల్లోనే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాల్సిందిగా సంబంధిత అధికారులు వైద్యఆరోగ్యశాఖను కోరినట్లుగా తెలిసింది. అగ్నిమాపక శాఖ చేసిన ప్రతిపాదనలపై వైద్యఆరోగ్యశాఖ సానుకూలంగా స్పందించింది. హైదరాబాద్‌లో నాలుగు ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్థలాన్ని సమకూర్చడానికి ప్రభుత్వ అనుమతి కోరుతూ తాజాగా ప్రతిపాదనలు రూపొందించింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *