కామారెడ్డి,(ఆరోగ్యజ్యోతి): ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం పెంచాలని జిల్లా పాలనాధికారి శరత్ పేర్కొన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిని పాలనాధికారి ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. ఆయా విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. ప్రసూతి విభాగంలో ఇద్దరికి కేసీఆర్ కిట్ ఇవ్వడంలో జాప్యం కారణంగా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు కిట్లను పాలనాధికారి అందజేశారు. సాధారణ విభాగం, డయాలసిస్, ఐసీయూ కేంద్రాలను పరిశీలించారు. ఇక్కడ వసతులు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని సూచించారు. రోగులకు బాధ్యతాయుతంగా సేవలందించాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు కల్పిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేసీఆర్ కిట్లపై మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించారు. మహిళలు ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవించేలా చైతన్యమవ్వాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో స్వచ్ఛంద ఆరోగ్యనేస్తం సిబ్బందితో మాట్లాడారు. ఇక్కడ ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకు రావాలన్నారు. గతంలో పనిచేసిన పాలనాధికారి ఆస్పత్రుల్లో ఆరోగ్య నేస్తం పేరిట చక్కటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తాగునీటి వసతిని కల్పించడంలో ఇబ్బందులను అధిగమించాలని పేర్కొన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రుల పర్యవేక్షణాధికారి అజయ్‌కుమార్, ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఆరోగ్యనేస్తం సిబ్బంది విఠల్, వైద్యుడు శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]