మహబూబాబాద్ యువకుని మృతి
భద్రాద్రి,రఘునాథపాలెం, (ఆరోగ్యజ్యోతి) : పసరు వైద్యాన్ని నమ్మి యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన రఘునాథపాలెంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్ కథనం ప్రకారం… సుతారి పనులు చేసే మహబూబాబాద్ జిల్లా బేతోలు గ్రామానికి చెందిన మోటపల్లి మహేశ్(26) మద్యానికి బానిసయ్యాడు. పసరు వైద్యంతో మద్యం మానేయవచ్చని తెలుసుకున్నాడు. భార్య ఉమ, బంధువులతో కలిసి రఘునాథపాలెం గ్రీన్కాలనీలో చలువాది కిరణ్ అనే వ్యక్తి వద్దకు మంగళవారం వచ్చాడు. ఆకుపసరు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన అతనిని బంధువులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. మహేశ్‌కు ఐదేళ్ల బాబు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మరో ఇద్దరికి అస్వస్థత: మహేశ్‌తోపాటు ఆకుపసరు తాగిన మరో ఇద్దరు సైతం అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. అయితే వారి పూర్తి వివరాలు తెలియరాలేదు. తాను 2014 నుంచి ఈ విధంగా పసరు వైద్యం చేస్తున్నానని, ఏనాడూ ఇలా జరగలేదని కిరణ్ తెలిపినట్లు పోలీసులు వివరించారు.