[spt-posts-ticker]

ప్రాణవాయువు కోసం అల్లాడిన రోగి

 

ఆదిలాబాద్‌ : రిమ్స్‌లో క్షయ వ్యాధి పీడితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డు పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ వార్డులో రాత్రివేళల్లో సిబ్బంది అసలు ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. రిమ్స్‌లో ఒక మూలకు ఏర్పాటు చేసిన వార్డులో రాత్రి సమయంలో రోగులు ఉండటానికి భయాందోళనలకు గురవుతున్నారు. రోగి పరిస్థితి విషమించితే ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడుతున్నారు.

రిమ్స్‌లోని క్షయ(టీబీ) వార్డు నిర్వహణ తీరు అధ్వానంగా మారింది. అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నా రాత్రివేళల్లో వార్డులో పెద్దగా రోగులు ఉండరు. అత్యవసర రోగులు మాత్రమే ఉంటారు. గురువారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఈ వార్డును ‘న్యూస్‌టుడే’ సందర్శించగా అందులో కేవలం ఒకే ఒక రోగి ఉన్నాడు. భుక్తాపూర్‌కు చెందిన రోగి ఒక్కడే అతని తల్లితో ఉన్నాడు. అంతకు ముందు అతనికి సిలిండర్‌ నుంచి అమర్చిన ప్రాణవాయువు ఆ సమయంలో సరఫరా నిలిచిపోయి ఆందోళనకు గురవుతూ ఉన్నాడు. వార్డులో సిబ్బంది ఎవరూ లేకపోవటంతో అతనికి తోడుగా ఉన్న వృద్ధురాలైన తల్లి ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలియక మానసిక వేదనకు గురవుతోంది. ఇక్కడి పరిస్థితిని అత్యవసర(సీఓటీ) విభాగంలో ఒక స్టాఫ్‌నర్సుకు ‘న్యూస్‌టుడే’ చెప్పగా తానే అక్కడ విధులు నిర్వహించి వచ్చానని, సీఓటీలోనూ తాను విధులు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. టీబీ వార్డు వద్ద పేషెంట్‌ కేర్‌ ఉంటారని తెలిపింది. అక్కడ సిబ్బంది ఎవరూ లేరని చెబితే భోజనానికి వెళ్లి ఉంటాడన్న సమాధానం చెప్పి ఊరుకున్నారు. అత్యవసర విభాగంలో విధులు నిర్వహిస్తున్న వార్డు బాయ్‌కు ఈ విషయం చెప్పగా ఆయన వెళ్లి రోగికి ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఆ సంఘటనను పరిశీలిస్తే రోగుల పట్ల సిబ్బంది ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అవగతమవుతోంది.

క్షయ వార్డు ఇది

రిమ్స్‌లోని ఓపీ విభాగం వెనుక గతేడాది నిర్మించిన క్షయ(టీబీ) వార్డు ఇది. ఇందులో ఇరవై పడకలు ఉండి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కానీ రాత్రివేళల్లో ఇక్కడ సిబ్బంది మచ్చుకు కూడా కన్పించడం లేదు. తమ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళ్లిపోతుంటారు. అక్కడున్న రోగులకు పరిస్థితి విషమిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళనకు గురవటం పరిపాటిగా మారింది.

వార్డులో బిక్కుబిక్కు మంటూ…

రిమ్స్‌ క్షయ(టీబీ) వార్డులో గురువారం రాత్రి రోగి ఒక్కరే ఉన్నారు. పట్టణంలోని భుక్తాపూర్‌కు చెందిన ఈయన క్షయతో బాధపడుతూ రిమ్స్‌కు వెళ్తే ఈ వార్డులో చేర్చారు. ఇక్కడ ఇరవై వరకు పడకలున్నా రోగులెవరూ లేకపోవటంతో ఒక్కడే ఉన్నాడు. రాత్రి పదకొండు గంటలకు ‘న్యూస్‌టుడే’ వార్డుకు వెళ్లగా రోగితో పాటు ఆయన తల్లి మాత్రమే ఉన్నారు. వార్డులో రిమ్స్‌కు సంబంధించిన ఏ ఒక్క సిబ్బంది లేరు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉందని ఆయనకు గురువారం సాయంత్రం ఆక్సిజన్‌ పెట్టారు. పది గంటల ప్రాంతంలో సిలిండర్‌ నుంచి ఆక్సిజన్‌(ప్రాణవాయువు) సరఫరా నిలిచిపోయింది. ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయిందన్న విషయం సిబ్బంది దృష్టికి తీసుకెళదామంటే అక్కడ ఎవరూ లేరు. అలాగే అతను బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *