[spt-posts-ticker]

బోదకాలు నివారణ మందుల పంపిణీ

7.33లక్షల మందికి అందించేలా ప్రణాళిక

నేటి నుంచి 12వ తేదీ వరకూ స్పెషల్‌డ్రైవ్‌

రాష్ట్రంలో ప్రభావిత గ్రామాలు 4,851

మొత్తం వ్యాధిగ్రస్తులు 64,994 మంది

ఈ ఏడాది కొత్తగా 55 కేసుల నమోదు

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో బోదకాలు వ్యాధి నివారణకు ‘మాస్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ పేరుతో మందులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా బోదకాలు ప్రభావిత గ్రామాలు 4,851 వరకూ ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇటీవల గుర్తించారు. 2018లో 47 కేసులు నమోదుకాగా, 2019లో కొత్తగా 55 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 4,851 గ్రామాల్లో బోదకాలు మరింత వ్యాప్తి చెందకుండా సోమవారం నుంచి 12 వరకు అల్బెండోజోల్‌, డీఈసీ మందులను పంపిణీ చేయనున్నారు. మొత్తం 7,33,106 మందికి ఈ మందులను ఉచితంగా ఇవ్వనున్నారు. క్యూలెక్స్‌ దోమ కాటు కారణంగా బోదకాలు వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులను కుట్టిన దోమ ఇతరులను కుడితే వారికీ వ్యాధి సోకుతుంది. వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తగా సర్కార్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 191 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 1320 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో మందుల పంపిణీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 29,325 మంది డ్రగ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ను రంగంలోకి దింపనున్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో  64,944 మంది బోదకాలు రోగులున్నారు. అత్యధికంగా జగిత్యాలలో 9,027, సిద్దిపేటలో 8,121, సూర్యాపేటలో 5,492, మహబూబాబాద్‌లో 4,115, జనగాంలో 3,557,  ఖమ్మంలో 3,335 మంది బాధితులు ఉన్నారు. రాష్ట్రంలో అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 23, హైదరాబాద్‌లో 33 మంది బాధితులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *