ఈఎన్టీ నిపుణులు కావాలి: కేంద్రం
న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే 918 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. వీటిలో 80 శాతం మందికి రోగ తీవ్రత స్వల్పంగానే ఉందని తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కేసులు 8,447కు చేరాయని తెలిపారు. కరోనాతో 273 మంది మృతిచెందగా, ఇప్పటిదాకా 716 మంది కోలుకున్నారని చెప్పారు.శనివారం సాయంత్రం నుంచి కొత్తగా 31 మరణాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. 151 పరీక్షా కేంద్రాల్లో 1.87 లక్షల మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించామని వివరించారు. కరోనాను ఎదుర్కోవడంలో దేశం సంసిద్ధత గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ‘‘దేశంలో ప్రస్తుతం కొవిడ్-19 కేసులు 8,356 ఉన్నాయి. వాటిలో కేవలం ఐదు శాతం మందికే ఆస్పత్రిలో చికిత్స, ఆక్సిజన్ సపోర్ట్ అవసరం. దీనికి 1,671 పడకలు అవసరం కాగా… లక్షకు పైనే పడకలు అందుబాటులో ఉన్నాయ’’ని తెలిపారు. దేశవ్యాప్తంగా 601 కొవిడ్ ఆస్పత్రులు ఉన్నాయని, 9 వేల పడకలతో 51 ఆస్పత్రులను సాయుధ దళాలు సిద్ధం చేస్తున్నాయని చెప్పారు. ఆదివారం మహారాష్ట్రలో కొత్తగా 221 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 1,982కు పెరిగాయి. మరో 22 మంది మరణించడంతో మృతుల సంఖ్య 149కి చేరింది. మధ్యప్రదేశ్లో 36, గుజరాత్లో 22, ఢిల్లీలో 19మంది మృత్యువాతపడ్డారు. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో ఢిల్లీ (1,069), తమిళనాడు (969) ఉన్నాయి.
ఈఎన్టీ నిపుణులు కావాలి: కేంద్రం
కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తుల నుంచి వైద్య పరీక్షల కోసం నమూనాలు సేకరించడానికి ఈఎన్టీ నిపుణులు, రెసిడెంట్ డాక్టర్ల సేవలను వినియోగించుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. గొంతు, స్వాబ్ నమూనాల సేకరణకు అర్హులైన సిబ్బంది అవసరం చాలా ఉందని తెలిపింది. కరోనా హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను ఇంటింటికి వెళ్లి అందజేసేందుకు రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పీఎస్ శ్రీవాస్తవ తెలిపారు.