హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): : నగరంలో నడవాలంటేనే పౌరులు వణకాల్సిన పరిస్థితి. ఎటు నుంచి ఏ శునకం దాడిచేస్తుందో తెలియదు. అమీర్‌పేటలో మంగళవారం ఏకంగా 50 మంది కుక్కకాటుకు గురవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. శునకాల నియంత్రణ చర్యల్లో అంకెల గారడీ ప్రదర్శిస్తూ బల్దియా అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో రేబిస్ వ్యాధి మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క నారాయణగూడలోని ఐపీఎంకే చికిత్స కోసం రోజూ 250మంది వస్తుంటారు. ఐపీఎంలో 2011లో 35 రేబిస్ కేసులు నమోదవగా 15మంది చనిపోయారు. 2017లో 21 కేసులకు 14మంది, 2018లో 30 కేసులకు 9మంది చనిపోయారు. ప్రస్తుతం గ్రేటర్లో 12లక్షల వరకు శునకాలు ఉన్నాయని అంచనా. వీధి కుక్కల నియంత్రణకు ఏటా రూ.8 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు బల్దియా చెబుతోంది.
విధాన లోపాలతో..
వాస్తవానికి సిబ్బంది ప్రతిరోజూ వీధుల్లో తిరుగుతూ అనుమానాస్పద కుక్కలను పట్టుకోవాలి. వాటికి పిల్లలు పుట్టకుండా ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) శస్త్రచికిత్సలు, రేబిస్ నిరోధక టీకా (ఏఆర్వీ) ఇవ్వాలి. నగరంలో అలా జరగట్లేదు. వీఐపీలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సిబ్బందితో పని చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. రాజధానిలో 5 చోట్ల శస్త్రచికిత్సల కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు నలుగురు వైద్యులు పనిచేస్తున్నట్లు, వారు సుమారు 50 శునకాలకు ఆపరేషన్లు చేసినట్లు చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే ఈ సంఖ్య 10 నుంచి 20కి మించదని.. ఆమేరకు రుసుము చెల్లించి, మిగిలిన మొత్తాన్ని కొందరు అధికారులు పంచుకుంటారనే విమర్శలున్నాయి. శునకాలను పస్తులుంచి, ఆహారం అందించినట్లు బిల్లులు తీసుకుంటుండటం ఆ మధ్య విజిలెన్స్ తనిఖీల్లో వెలుగు చూసింది. చనిపోయినవాటిని చెత్తలో పడేసి, వాటిని గుంతలు తీసి పాతిపెట్టినట్లు బిల్లులు తీసుకుంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా వీధికుక్కల నియంత్రణ చర్యల్లో జైపూర్ మొదటిదన్నది జంతు పరిరక్షణ నిపుణుల మాట. అక్కడ అన్ని రకాల శునకాలకు ప్రతి మూడేళ్లకు రేబిస్ నిరోధక ఏఆర్వీ టీకాలు తప్పనిసరిగా ఇస్తారని డాక్టర్ శశికళ ‘ఈనాడు’కు తెలిపారు.