ఖమ్మం, టేకులపల్లి, (ఆరోగ్యజ్యోతి): భారంగా మారిన అధిక సంతానంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దంపతులు ఒకవైపు. బిడ్డలు లేక మాతృత్వం కోసం ఎదురు చూస్తున్న దంపతులు మరోవైపు. ఇరువర్గాల అవసరాలను ఆసరాగా చేసుకున్న ఓ ఆర్ఎంపీ మధ్యవర్తిత్వం నడిపి ఇరువైపులా ఆశ కల్పించాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిరుపేద దంపతులకు నాలుగో సంతానంగా అప్పుడే పుట్టిన మగ బిడ్డను ఆర్ఎంపీ సహకారంతో కొత్తగూడెంలో విక్రయించారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్, ఐసీపీయూ అధికారులు మగశిశువు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి శిశువును వారికి అప్పగించారు. మూడు నెలల క్రితం టేకులపల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా గత పది రోజుల క్రితం మళ్లీ అదే శిశువును ఆ ఆర్ఎంపీ సహకారంతోనే ఈ సారి బెంగళూరులో విక్రయించారు. సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్, ఐసీపీయూ సిబ్బంది రెండు రోజుల క్రితం శిశువు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఆరా తీశారు. శిశువు లేకపోవడంతో మందలించారు. శుక్రవారం వరకు శిశువును అప్పగిస్తామని తల్లిదండ్రులు ఐసీడీఎస్ సిబ్బందికి తెలియజేశారు. గడువు సమీపించినప్పటికీ శిశువును అప్పగించకపోవడంతో ఐసీడీఎస్ సిబ్బంది టేకులపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. తమకు పోలీసులు సహకరించలేదని ఐసీడీఎస్ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.