[spt-posts-ticker]

మరో నలుగురికి కరోనా పాజిటివ్‌

కరీంనగర్‌ :కరోనా కలవరం కరీంనగర్‌లో కొనసాగుతూనే ఉంది. గురువారం ఒక్క రోజేే జిల్లాకు చెందిన నలుగురికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రాత్రి వేళ ప్రకటించింది. దీంతో జిల్లాలో  ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 17కు పెరిగింది. ఇందులో ఇండోనేసియన్లు 10 మంది మినహాయిస్తే మిగతా ఏడుగురు మాత్రం జిల్లాకు చెందిన వారే అవడం విస్మయాన్ని కలిగిస్తోంది. దిల్లీలో మతపరమైన కార్యక్రమానికి వెళ్లిన వారిలో ముగ్గురిలోనూ ఈ వ్యాధి ఉన్నట్లు వెల్లడవడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. జిల్లా నుంచి మొత్తంగా 19 మంది దిల్లీకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే హుటాహుటిన వారిని గుర్తించి ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు. ఇలా గుర్తించిన అనుమానితుల నమూనాలను హైద్రాబాద్‌కు పంపించగా ఇందులో ముగ్గురికి పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 11 మందికి నెగెటివ్‌ రావడంతో అధికారులు ఊపిరి పీˆల్చుకున్నారు. మరో ఐదుగురి ఫలితాలు రావాల్సి ఉండటంతో ఇంకా ఒకింత ఆందోళన తప్పడం లేదు. ఇక గత నెల 14వ తేదీన ఇండోనేసియన్లు కరీంనగర్‌లో సంచరించడం అదే సమయంలో వారితో దగ్గరగా ఉన్న యువకుడితోపాటు అతని తల్లికి, సోదరికి కరోనా సోకింది. తాజాగా ఈ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న మరో యువకుడికి కూడా కరోనా పాజిటివ్‌ లక్షణాలున్నట్లు తేలడంతో గురువారం ఒక్క రోజే నాలుగు కేసులు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.

పెరుగుతున్న అప్రమత్తత..!
కరీంనగర్‌ పట్టణంతోపాటు దిల్లీకి వెళ్లిన వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న హుజురాబాద్‌లోనూ మరింత అప్రమత్తత కనిపిస్తోంది. కాగా తాజాగా వెల్లడించిన పాజిటివ్‌ కేసుల్లో ఒకు కరీంనగర్‌ వాసిగా తెలుస్తోంది. మిగతా ముగ్గురు దిల్లీకి వెళ్లిన వారి విషయంలోనే అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. కాగా హుజురాబాద్‌ నుంచి ఐసోలేషన్‌కు తీసుకొచ్చిన వారిలో రెండు కుటుంబాలకు చెందిన వారి కుటుంబీకుల్ని కరీంనగర్‌లోని ఐసోలేషన్‌ కేంద్రాలకు 108లో తీసుకురావడంతో ఒకవేళ హుజురాబాద్‌కు చెందిన వారిలో ఎవరికైనా వ్యాధి నిర్ధారణ అయ్యిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిన దృష్ట్యా కరీంనగర్‌, హుజురాబాద్‌లోనూ మరింత కట్టుదిట్టమైన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. దిల్లీకి వెళ్లి వచ్చిన వారు ఎవరిని కలిశారు..? వారి కుటుంబీకుల వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఎంతలేదన్నా ఒకొక్కరు కనీసం 10 మందిని అయినా కలిసే వీలుండటంతో వారెవరనే విషయమై ఆరా తీస్తున్నారు. గురువారం కరీంనగర్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఐసోలేషన్‌ వార్డుకు పంపించారు. దిల్లీకి వెళ్లివచ్చిన ఇతని కదలికలపై దృష్టిని సారించి అతనితోపాటు అతని కుటుంబీకుల్ని వైద్య పరీక్షల నిమిత్తం జిల్లాసుపత్రికి తీసుకెళ్లారు.

మరికొన్నాళ్లు పొడిగింపు…
నగరంలో సుమారు 3 డివిజన్లను రెడ్‌జోన్‌గా ప్రకటిస్తూ ఎవరిని కూడా ఇళ్లనుంచి కదలకుండా తగు చర్యల్ని తీసుకున్నారు. తాజాగా మరికొన్ని కేసులు పాజిటివ్‌గా తేలడంతో ఈ రెడ్‌జోన్‌తోపాటు కరీంనగర్‌పై ప్రత్యేకమైన దృష్టిని పెడుతున్నారు. రెడ్‌జోన్‌ను ఎత్తివేసే దిశగా గురువారం ఉదయం చర్యలు తీసుకున్న పోలీసులు ఆయా మార్గాల్లో ఉన్న భారీ కేడ్‌లను తొలగించారు. మరికొద్దిసేపటికి నిర్ణయాన్ని వాయిదా వేసుకుని ఎప్పటిలాగానే రెడ్‌జోన్‌ను కొనసాగిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.  ఇక నగరంలోనూ గతం కన్నా భిన్నంగా మరిన్ని ఆంక్షలు అన్ని చోట్ల కనిపించే వీలుంది. ఈ దిశగా పోలీసులు అవసరమైన చర్యలకు కార్యాచరణను రూపొందిస్తున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *