[spt-posts-ticker]

మహమ్మారిపై అమెరికా యుద్ధం

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 వైరస్‌పై పోరాడటానికి దేశంలో జాతీయ అత్యయిక పరిస్థితిని విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనేక ఉపశమన చర్యలకు ఉపక్రమించారు. ఈ వైరస్‌పై పోరుకు 5వేల కోట్ల డాలర్లను కేటాయించి, పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అత్యయిక పరిస్థితిని విధించడం వల్ల ఫెడరల్‌ అత్యవసర నిర్వహణ సంస్థ.. రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు సాయం అందిస్తుంది. మహమ్మారిపై పోరుకు చేపడుతున్న చర్యలను సమన్వయం చేయడానికీ వీలు కలుగుతుంది. ఆరోగ్య శాఖ కార్యదర్శికి కొత్త అధికారాలు లభిస్తాయి. వైరస్‌కు స్పందన విషయంలో వైద్యులు, ఆసుపత్రులు, ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి గరిష్ఠ వెసులుబాటు లభిస్తుంది.

జాతీయ అత్యవసర పరిస్థితిని విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షులు చాలా అరుదుగానే ఉపయోగిస్తుంటారు. తాజాగా కరోనా పేట్రేగిపోతున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ చర్యను చేపట్టారు. వైరస్‌ తీవ్రతకు అమెరికాలో ఇప్పటికే 41 మంది బలయ్యారు. దేశంలోని 50 రాష్ట్రాలకుగాను 46 రాష్ట్రాలకు ఇది వ్యాపించింది. 2వేల మందికి ఈ వైరస్‌ సోకింది. ‘‘పరిస్థితి ఇంకా క్షీణించే  ప్రమాదం ఉంది. వచ్చే 8 వారాలు కీలకం కానున్నాయి. వైరస్‌పై పోరు విషయంలో ఫెడరల్‌ ప్రభుత్వ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే ఉద్దేశంతో జాతీయ అత్యయిక పరిస్థితిని విధిస్తున్నా’’ అని ట్రంప్‌ చెప్పారు.

ఆసుపత్రుల సన్నద్ధత
రాష్ట్రాలన్నీ తక్షణమే అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేయాలని ట్రంప్‌ సూచించారు. పౌరుల అవసరాలను తీర్చేలా దేశంలోని ఆసుపత్రులన్నీ అత్యవసర సన్నద్ధత ప్రణాళికను అమల్లోకి తీసుకురావాలని కోరారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఉన్న అన్ని అవరోధాలనూ తొలగిస్తామని చెప్పారు. కీలక ప్రాంతాల్లో సంచార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఔషధ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. దీనివల్ల.. ప్రజలు తమ కార్లు దిగకుండానే నమూనాలు ఇవ్వవచ్చని చెప్పారు.
కరోనా వ్యాప్తిని నెమ్మదింపచేయడమే ప్రస్తుతమున్న సమర్థ ఆయుధమని ట్రంప్‌ తెలిపారు. ప్రజలు అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలనూ తీసుకోవాలని కోరారు.

పరీక్ష చేయించుకున్నా: ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఫలితం రావాల్సి ఉంది. ఈ విషయాన్ని శనివారం ఆయన స్వయంగా వెల్లడించారు. కొవిడ్‌-19 లక్షణాలు తమలో ఉన్నాయా? లేవా? అనేది ప్రజలు తెలుసుకునేందుకు గూగుల్‌ ఓ వెబ్‌సైట్‌ను రూపొందిస్తోందని ట్రంప్‌ ప్రకటించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *