[spt-posts-ticker]

ముందే వచ్చిన వేసవి!

 

ఈ ఏడాది చలి తీవ్రత రెండు రోజులే
జనవరిలోనే ఎండాకాలం అనుభవం
సాధారణాన్ని మించి 3.4 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత
ఖమ్మంలో రికార్డు స్థాయిలో వేడిమి

హైదరాబాద్‌: చలికి జడిసి దుప్పటి తన్నే రోజులకు ఇక సెలవు. శివరాత్రి జాగారంతో శివ శివా అంటూ పోవాల్సిన చలి ముందే పారిపోయినట్లుంది. చల్లని పవనాల రాక తగ్గిపోవడంతో రాష్ట్రంలో శీతాకాలం కేవలం రెండు రోజులే తీవ్రత చూపింది. గత డిసెంబరు 28, 29వ తేదీలే ఈ కాలానికి చలి రోజులు. 2018లో 13 రోజులపాటు శీతల గాలుల తీవ్రత నమోదైంది. మారుతున్న వాతావరణంతో ఉష్ణోగ్రత నమోదయ్యే దినాలు రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణంగా హైదరాబాద్‌లో 10-11 డిగ్రీల కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. ఈ శీతాకాలంలో మాత్రం నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత 14.5 డిగ్రీలే (డిసెంబర్‌ 29) కావడం విశేషం. ప్రస్తుతం వాతావరణంలో కర్బన సమ్మేళన వాయువుల శాతం ప్రభావం చూపుతున్నాయి. దీనికితోడు బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులతో రాత్రిపూట వాతావరణంలో వేడి తగ్గడం లేదు. చీకటి పడగానే వేడంతా ఉపరితలంపైకి చేరాల్సి ఉండగా తిరిగి భూమిని చేరుతుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయని వాతావరణ శాఖాధికారి రాజారావు ‘ఈనాడు’కు తెలిపారు.  రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు వేసవి ప్రారంభ రోజుల స్థాయికి చేరుకున్నాయి. గతేడాది వేసవిలో రాష్ట్రంలో సాధారణం కన్నా సగటున 1-1.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాదీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మంగళవారం వాతావరణ శాఖ విడుదల చేసిన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో పదేళ్ల స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 2016 జనవరి 30న 33.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదుకాగా మంగళవారం 33.8 డిగ్రీలు నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 34.9, నిజామాబాద్‌ 34.4, భద్రాచలం 34.2తోపాటు రామగుండం, హైదరాబాద్‌, హన్మకొండలలో 33 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. రామగుండంలో సాధారణం కన్నా 5.2 డిగ్రీలు ఎక్కువగా 21.5, భద్రాచలంలో 4.7 డిగ్రీలు ఎక్కువగా 23 డిగ్రీలు, హైదరాబాద్‌లో 4.1 డిగ్రీలు ఎక్కువగా 20.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యాయి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *