[spt-posts-ticker]

యువ దంపతుల ఆలోచన..

హైదరాబాద్: ఈ యువ దంపతుల ఆలోచన ఎంతో మందికి ఊరటనిస్తోంది. కరోనా భయంతో కాలు బయటపెట్టని వారి ఇళ్లలోకి తాజా కూరగాయలను అందించేలా చేసింది. ఫామ్‌ టు హోం డెలివరీ అంటూ కొత్త ప్రయత్నానికి నాందిపలికింది. పదుల సంఖ్యలో కూరగాయల ప్యాకెట్ల డెలివరీతో మొదలై నేడు వేల సంఖ్యలోకి చేరింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేసి వ్యవసాయంపై మమకారంతో ఇంటిబాట పట్టిన యువ దంపతులు దుష్యంత్‌ రెడ్డి, లయరెడ్డి నేడు ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఒక్కో ప్యాకెట్‌లో 15 రకాల కూరగాయలు..

రూ.300 విలువ చేసే ఈ కాంబో ప్యాకెట్‌లో 15 రకాల తాజా కూరగాయలు ఉంటున్నాయి. వారి తోటలో పండిన కూరగాయలతోపాటు ఇతర రైతుల నుంచి సేకరించిన కూరగాయలను తమ కాంబో ప్యాక్‌లో కలుపుతున్నారు. కిలోచొప్పున ఉల్లిగడ్డ, టమాట, అరకిలో చొప్పున ఆలుగడ్డ, బెండకాయ, దొండకాయ, క్యారెట్‌, కాకరకాయ, కీరా, బీరకాయ, పచ్చిమిర్చి, చిక్కుడు కాయ, ఆరు పాలకూర కట్టలు, రెండేసి కొత్తిమీర, పుదీన కట్టలు, ఒక సొరకాయ, మూడు నుంచి నాలుగు మునగకాయలు ఒక్కో ప్యాక్‌లో ఉన్నాయి. పెద్దపెద్ద సూపర్‌ మార్కెట్లకు వెళ్లి కొనుగోలు చేస్తే రూ.600 వరకు ధర అవుతుంది. కానీ తాము కేవలం సామాజిక స్ఫూర్తితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వీరు చెబుతున్నారు.

తోటలోనే తోడునీడగా..

అమెరికాలో మూడేళ్లపాటు జాబ్‌ చేసి వచ్చారు దుష్యంత్‌రెడ్డి. ఇక కోయంబత్తూరులోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం లయారెడ్డిది. సిద్దిపేట పట్టణానికి చెందిన వీరిద్దరూ 2018లో పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రుల మీద ప్రేమతో విదేశాల నుంచి వచ్చిన దుష్యంత్‌కు వ్యవసాయం అంటే ఆసక్తి ఏర్పడింది. పెళ్లయ్యాక భార్య లయ కూడా తోడుగా నిలవడంతో ఇద్దరూ కలిసి 30 ఎకరాల భూమిని సాగుచేస్తున్నారు.

సిద్దిపేట టు హైదరాబాద్‌..

హైదరాబాద్‌కు కూరగాయలను హోం డెలివరీ చేస్తామనే వీరి ఆలోచనకు మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహం అందించారు. స్థానిక కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర దక్కడంతోపాటు హైదరాబాద్‌ వాసుల ఇంటికే కూరగాయలు చేరతాయనే ప్రయత్నాన్ని ఆయన ప్రశంసించారు. సిద్దిపేట మార్కెట్‌ యార్డులో వీరికి ఒక షెడ్డును కేటాయించేలా చేశారు. హైదరాబాద్‌కు వెళ్లే ఆటోలకు పాసులు ఇప్పించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *