సీఆర్ ప్రాంగణంలో నిరుపేదల దవాఖానా
మియాపూర్: ప్రస్తుతం వైద్యం ఖరీదైన అంశంగా మారింది. చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా రూ.వేలల్లోనే వైద్యఖర్చులు భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో 17ఏళ్లుగా రూ.30కే నెలవారీ ఓపీతో ఉచితంగా వైద్యసేవలు అందిస్తోంది కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్ ప్రాంగణంలోని వైద్యకేంద్రం. ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. సాధారణ రుగ్మతలతో పాటు మహిళలు, పిల్లలకు సంబంధించిన వైద్యసేవలు అందిస్తున్నారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సహకారంతో ఇక్కడ నేత్ర సమస్యలకు ప్రాథమిక వైద్యపరీక్షల సౌకర్యం అందుబాటులోకి తెచ్చినట్లు వైద్యకేంద్రం కన్వీనర్ డాక్టర్ కూనమనేని రజని తెలిపారు. ఇక్కడకు ఎక్కువగా పేద కుటుంబాలకు చెందిన వారు వస్తారని, అవసరమైతే తక్కువ ఖర్చుతో వారు మెరుగైన వైద్యసేవలు పొందేలా ఎంపిక చేసిన కొన్ని ఆస్పత్రులకు పంపుతున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో ఈ వైద్య కేంద్రాన్ని విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీపీఐ నేత, సీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు కె.నారాయణ పేర్కొన్నారు. అదనపు గదుల నిర్మాణం అనంతరం దంత, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వంటి సేవలు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలన్నదే ఫౌండేషన్ లక్ష్యమన్నారు.