[spt-posts-ticker]

లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు విడుదల

ఢిల్లీ: అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలన్ని నిలిపివేయాలని కేంద్రం స్పష్టమైన నిబంధనలు విడుదల చేసింది. ఎన్డీఎం‌ఏ ఉత్తర్వులతో పాటు మార్గదర్శకాలు కూడా కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. రక్షణ, కేంద్ర పారామిలటరీ బలగాలు, ట్రెజరీ, ఇంధన, గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, తపాలా సేవలు, జాతీయ సమాచార వ్యవస్థ, ముందస్తు హెచ్చరికల కేంద్రాలు, విపత్తు నిర్వహణ మినహా అన్ని కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ స్వతంత్ర వ్యవస్థలన్ని అన్ని మూసివేస్తారు. రాష్ట్రాల్లో పోలీసు, హోం గార్డ్స్, పౌర రక్షణ, అగ్నిమాపక, అత్యవసర సేవలు, జైళ్లు, జిల్లా పరిపాలన, ట్రెజరీ, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం నిర్వహణ, నీటి సరఫరా మినహా అన్ని సేవలు బంద్ అవుతాయి.

ఆసుపత్రి, అనుబంధ వ్యవస్థల నిర్వహణ, ఔషధ దుకాణాలు, వైద్య పరికరాల దుకాణాలు, ల్యాబ్‌లు, అంబులెన్స్ లు, వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి మినహాయింపునిచ్చారు. రేషన్ దుకాణాలు, ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం దుకాణాలకు మినహాయింపునిచ్చారు. అవకాశం ఉన్నంత వరకు స్థానిక పాలన యంత్రాంగం నిత్య అవసరాలను ఇళ్లకు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. బ్యాంక్ లు, బీమా కార్యాలయాలు, ఏటీఎం లు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ, కేబుల్ సేవలకు మినహాయింపునిచ్చారు. ఆహార పదార్థాలు, ఔషధాలు, వైద్య పరికరాలు ఈ కామర్స్ ద్వారా సరఫరా చేసే వారికి మినహాయింపునిచ్చారు. పెట్రోల్ పంపు, గ్యాస్ కేంద్రాలకు మినహాయింపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉన్న విద్యుత్ రంగ సేవల్లో పనిచేసే వారికి మినహాయింపునిచ్చారు. కోల్డ్ స్టోరేజ్ లు, గిడ్డంగులకు, ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీ లకు, నిత్యావసరాల తయారీ యూనిట్లకు మినహాయింపునిచ్చారు. ఇతర ఉత్పత్తుల సంస్థలు విధిగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర రవాణా సేవలు మినహా మిగిలినవన్ని నిలిపివేశారు. అన్ని విద్యా, పరిశోధన, శిక్షణ సంస్థలన్నీ మూసివేయాల్సిందే.

అన్ని మత సంబంధిత స్థలాలు, మత పరమైన కార్యక్రమాలకు ఎటువంటి మినహాయింపులు లేవు. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలన్ని రద్దు చేశారు. ఫిబ్రవరి 15 తరువాత విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా అధికారుల సూచన మేరకు వ్యవహరించాల్సిందే. ఉల్లంఘించిన వారిపై ఐపీసి సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులు. అధికారులు సూచించిన విధంగా ఇంటికి కానీ లేదా నిర్బంధ కేంద్రాలకు కానీ పరిమితం కావాల్సిందే. ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు చేసే సూచనలను పౌరులు పాటించాలి. సామాజిక దూరం కొనసాగించాల్సిందే. అన్ని సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. ఉద్యోగులకు కోవిడ్-19 వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానికంగా ఈ నిబంధనలను అమలు చేసే వారు మినహాయింపులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని వ్యవహరించాలి. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారు విపత్తు నిర్వహణ చట్టం-2005 ఐపిసి 188 ప్రకారం శిక్షార్హులు. ఈ అర్ధరాత్రి నుంచి నిబంధనలన్నీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయి. 21 రోజుల పాటు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. జిల్లా న్యాయాధికారి కమాండర్ గా వ్యవహరిస్తూ నిబంధనలన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూడాలి. ఉల్లంఘనలకు కమాండర్ లే బాధ్యులు అవుతారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ఉత్తర్వులను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *