[spt-posts-ticker]

వలసొచ్చినోళ్లతోనే వైరస్‌ వ్యాప్తి- నేటినుంచి ఆదిలాబాద్ రిమ్స్‌లో నేటినుంచి కరోనా పరీక్షలు

– జీహెచ్‌ఎంసీలోనే 37 మంది,వలస వచ్చినవారు మరో 14 మంది

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి) : కొవిడ్‌-19 వైరస్‌ను అత్యంత సమర్థంగా ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వానికి అనుకోని అడ్డంకులు ఎదురవుతున్నాయి. తొలుత విదేశాలకు వెళ్లి వచ్చినవారిలో అతి తక్కువ కేసులే నమోదయ్యాయి. ఇక కరోనా నుంచి బయటపడగలమని యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి లో ఢిల్లీ మర్కజ్‌ వెళ్లి వచ్చినవారి ద్వారా వైరస్‌ విస్తృతం గా వ్యాపించింది. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 75శాతం మర్కజ్‌కు సంబంధించినవే. దీన్ని అధిగమించేందుకు కంటైన్మెంట్‌ జోన్లతో పకడ్బందీ చర్యలు చేపట్టింది. పరిస్థితి అదుపులోకి వస్తున్న సమయంలో.. లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వలస కార్మికులు కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు.

87 చెక్‌పోస్టుల్లో తనిఖీలు

పలు రాష్ర్టాలనుంచి అధికసంఖ్యలో వలస కార్మికులు రాష్ట్రంలోకి వస్తుండటంతో వారిలో కరోనా లక్షణాలు గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వలస వచ్చేవారిని పరీక్షించేందుకు వైద్యశాఖ 275 బృందాలను నియమించింది. ఇందులో వెయ్యిమందికిపైగా ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. వీరంతా రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో నిర్ణయించిన 87 చెక్‌ పోస్టుల పరిధిలో ఉండి.. ఇక్కడకు వచ్చేవారికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నారు. వైరస్‌ లక్షణాలుంటే దవాఖానకు తరలిస్తారు. లేదంటే హోంక్వారంటైన్‌ చేస్తారు. ఇండ్లలో తగిన వసతులు లేనివారిని ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచాలని నిర్ణయించారు. ఇతర రాష్ర్టాల నుంచి వలసవచ్చిన వారిలో ఇప్పటివరకు 25 మందికి కరోనా పాజటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 12, జగిత్యాలలో ఇద్దరికి నిర్ధారణ కాగా, రెండ్రోజుల కిందట వరకు నమోదైన 11 పాజిటివ్‌ కేసుల్లో యాదాద్రి, మంచిర్యాల జిల్లాలకు చెందినవారున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,326 కేసులు

తెలంగాణలో మంగళవారం కొత్తగా 51 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 37 మంది ఉండగా, మరో 14 మంది వలస వచ్చినవారున్నారు. మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 1,326కు చేరింది. తాజాగా ఇద్దరు మృతిచెందడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 32కు చేరుకున్నది. మృతుల్లో హైపర్‌టెన్షన్‌తో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్‌లోని మూసాబౌలికి చెందిన 61 ఏండ్ల, డయాబెటిస్‌, బీపీతో బాధపడుతున్న జియాగూడకు చెందిన 65 ఏండ్ల వృద్ధు డు ఉన్నట్టు ప్రజారోగ్యశాఖ బులెటిన్‌ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌గా కొత్తగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, మొత్తం కేసులు 2,051కి చేరాయి.

కరోనా యోధులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌

కరోనాపై యుద్ధంచేస్తున్న వైద్యారోగ్యశాఖతోపాటు పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇతర శాఖల సిబ్బంది కి ప్రభుత్వం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను  ఇవ్వాలని నిర్ణయించింది. ఆయాశాఖల్లో పనిచేస్తున్న రెండున్నర లక్షలమంది అందజేసేందుకు వైద్యశాఖ అన్ని జిల్లాలకు 74 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను పంపింది. ఇవి రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదం చేస్తాయి.

రిమ్స్‌లో నేటినుంచి కరోనా పరీక్షలు

ఆదిలాబాద్‌ రిమ్స్‌ దవాఖానలో కరోనా నిర్దారణ పరీక్షలు చేసేందుకు ఐసీఎమ్మార్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌) అనుమతించింది. దీంతో బుధవారం నుంచి రిమ్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా అనుమానిత లక్షణాలున్నవారి శాంపిళ్లను సేకరించి రిమ్స్‌కు పంపాలని జిల్లా అధికారులకు ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ జీ శ్రీనివాసరావు లేఖ రాశారు.

రాష్ట్రంలో కేసుల వివరాలు

వివరాలు మంగళవారం మొత్తం
పాజిటివ్‌కేసులు 51 1,326
కోలుకున్న/డిశ్చార్జి అయినవారు 21 822
మరణాలు 2 32
చికిత్స పొందుతున్నవారు 472
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *