[spt-posts-ticker]

విద్యకు కరోనా దెబ్బ

హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి): పదో తరగతి పరీక్షలు మార్చిలో జరగాలి! డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు ఏప్రిల్‌లో జరగాలి! లాక్‌డౌన్‌ పొడిగింపుతో ఈ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సిలబస్‌ కూడా పూర్తికాలేదు. అంతేనా.. రాష్ట్రస్థాయితోపాటు జాతీయ స్థాయిలో జరగాల్సిన పలు వార్షిక, ప్రవేశ పరీక్షలూ వాయిదాపడ్డాయి. లాక్‌డౌన్‌ ఎత్తి వేసిన తర్వాత ఈ పరీక్షల షెడ్యూలు ప్రకటించాలి. పరీక్షలు నిర్వహించాలి. ఫలితాలు విడుదల చేయాలి. ఆ తర్వాత, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. వెరసి, కరోనా కల్లోలం కారణంగా నెల రోజులుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడడం, లాక్‌డౌన్‌ పొడిగింపుతో ఆ ప్రభావం ఈ విద్యా సంవత్సరం ముగింపు, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంపై పడింది. ఏటా మార్చి నుంచి జూలై వరకు విద్యా రంగానికి ఎంతో కీలకం. సరిగ్గా ఆ సమయంలోనే కరోనా కల్లోలం ప్రారంభం కావడం విద్యా వ్యవస్థకు పెను శాపంగా మారింది. ఇక, నూతన విద్యా సంవత్సరానికి ముఖ్యమైన ఎంసెట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ వంటి ప్రవేశ పరీక్షలూ వాయిదా పడ్డాయి. ఇంకా, పది పరీక్షలను నిర్వహించి ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. ఇందుకు 45 రోజుల సమయం పడుతుంది. ఇంటర్‌ పరీక్షలు జరిగినా మూల్యాంకనం ప్రారంభం కాలేదు. ఇందుకు కనీసం 30 రోజులు అవసరం. అంటే, మే ప్రారంభం నుంచే పనులను ప్రారంభిస్తే జూన్‌ ఆఖరులోపు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇంటర్‌ ఫలితాలను వెల్లడించనిదే ఎంసెట్‌ ప్రారంభం కాదు. మరోవైపు జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలను మేలోనే నిర్వహిస్తామని ఇప్పటికే ఆయా సంస్థలు ప్రకటించాయి. ఇంటర్‌ ఫలితాలతోనే జేఈఈ మెయిన్‌, నీట్‌ కౌన్సెలింగ్‌ ఆధారపడి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా పరీక్షలన్నీ మేలోనే పూర్తి చేసి జూన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఆయా సంస్థలు ప్రణాళికలు రూపొందించాయి. ఇదంతా, కరోనా అదుపులోకి వస్తే జరిగే పరిణామాలు మాత్రమే. అయితే, పరీక్షలు జరుగుతాయా? జరిగితే ఎప్పుడు? అన్న గందరగోళంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *