- ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు చికిత్స
- మనో ధైర్యంతో సేవలందిస్తున్న గాంధీ, ఛాతీ దవాఖాన డాక్టర్లు
- గాంధీ హాస్పిటల్లో 143 మందికి చికిత్స
- పూర్తిగా కోలుకున్న 19 మంది డిశ్చార్జ్
- కొవిడ్-19 కోరలు చాస్తున్న వేళ.. వైద్యులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు.
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి) : రక్షణ చర్యలు పాటిస్తూ, కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలందిస్తున్నారు. నగరంలోని గాంధీ, ఛాతీ దవాఖాన వైద్యులు కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తూ వారి ప్రాణాలు కాపాడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు.వైద్యుడు దేవుడితో సమానం.. కానీ కరోనా మహమ్మారిలా దూసుకొస్తున్న వేళ వైద్యులు ప్రత్యక్ష దైవంగా మారారు. కరోనా (కొవిడ్-19) బాధితులకు ప్రాణాలకు తెగించి సేవలందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు గాంధీ, ఎర్రగడ్డ ఛాతీ దవాఖాన వైద్యులు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 308 మంది కొవిడ్-19 బాధితులకు చికిత్స అందించగా అందులో కేవలం గాంధీ దవాఖానలోనే 143 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 19 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
పూర్తిస్థాయి కరోనా దవాఖానగా గాంధీ..
సాధారణంగా ప్రతి రోజూ 2000 నుంచి 3000 మంది ఓపీ, సుమారు 1500 మంది ఐపీ రోగులతో రద్దీగా ఉండే గాంధీ దవాఖాన ప్రస్తుతం కొవిడ్ హాస్పిటల్‌గా మారింది. తొలుత గాంధీ దవాఖాననే కొవిడ్ పాజిటివ్ కేసులకు చికిత్స అందించేందుకు ఎంపిక చేశారు. అంతే కాకుండా 8 మంది వైద్యబృందంతో దవాఖానలోని వైరాలజీ విభాగంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్‌ను కూడా తెలుగు రాష్ర్టాలకు కలిపి ఇక్కడే ఏర్పాటు చేశారు. రోజుకు 100కు పైగా నిర్ధారణ పరీక్షలు గాంధీలో జరుపుతున్నారు. అనంతరం ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో పాజిటివ్ కేసులకు చికిత్స ప్రారంభించారు. దీంతో పాటు కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలను సైతం ఉస్మానియా మెడికల్ కళాశాల, సీసీఎంబీలో ప్రారంభించారు. ఏప్రిల్ 6 వరకు గాంధీలో 143 మంది కొవిడ్ పాజిటివ్ కేసులకు చికిత్స అందించగా, వీరిలో 19మంది పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఇక ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో ఇప్పటి వరకు మొత్తం 37 పాజిటివ్ కేసులకు చికిత్స అందించగా 13 మంది డిశ్చార్జ్ అయ్యారు.
1226 మందితో సేవలు
గాంధీ దవాఖానలో కొవిడ్-19 పాజిటివ్ కేసులకు వైద్యులతో సహా మొత్తం 1226 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో 155 మంది వైద్యులతో పాటు మరో 100 మంది ఇతర సిబ్బంది ఉన్నారు.
ఐదురోజుల పాటు..
గాంధీ దవాఖానలోని ప్రతి వైద్యుడికి విధులు నిర్వర్తించిన రోజు తర్వాత 5 రోజుల పాటు సెలవు ఇస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. ప్రతిసారి ఐదురోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ కుటుంబాలకు దూరంగా ఉండి సేవలందిస్తున్నారు. ప్రతి రోజూ వైరస్ ఉన్న రోగికి చికిత్స అందిస్తే వైద్యుడి ప్రాణాలకే ప్రమాదమని ఆయన పేర్కొన్నారు.