హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):ప్రాణాలను పణంగాపెట్టి కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న డాక్టర్లపై దాడి చేయటం సరికాదని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం గాంధీ దవాఖానను ఆయన సందర్శించి దాడి ఘటనపై సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్, ఆర్‌ఎంవోతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైద్యసిబ్బంది సేవలకు వెలకట్టలేమని, అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చర్యలు తీసుకోవాలని గోపాలపురం ఏసీపీ వెంకటరమణను ఆదేశించారు.దవాఖాన బయట ఉన్న యాచకులు, అనాథలను షెల్టర్హోమ్స్కు తరలించి భోజన వసతి కల్పించాలని నార్త్‌జోన్, సెంట్రల్‌జోన్ డీసీపీలకు సూచించారు. దీంతో 150 మందిని లాలాపేటలోని పునరావాస కేంద్రానికి తరలించారు. వైద్యసిబ్బందిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ ఎంపీ, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. దాడుల సంస్కృతి మానుకోవాలని సూచించారు.
పూర్తివేతనం, బోనస్ అభినందనీయం: ఉద్యోగ సంఘాలు
వైద్యులు, సిబ్బందిపై దాడి చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ ఓ ప్రకటనలో కోరింది. నిజామాబాద్‌లో విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించినవారిని కూడా శిక్షించాలని సూచించింది. కరోనా బాధితులకు చికిత్స చేయడంతోపాటు నిరంతరం సేవలందిస్తున్న వైద్యులకు సీఎం కేసీఆర్ అండగా పూర్తివేతనంతోపాటు బోనస్ ఇస్తామనడంపై సంఘం నేతలు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత, తెలంగాణ హెల్త్, మెడికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ బరిగెల రమేశ్, కన్వీనర్ పుట్ల శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి, చీఫ్ అడ్వయిజర్ జూపల్లి రాజేందర్, కో ఆర్డినేటర్ నరహరి, కో చైర్మన్ షబ్బీర్‌అహ్మద్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి ధన్యవాదాలు తెలిపారు.
పూర్తివేతనంపై పోలీసుల హర్షం
పోలీస్ సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనాన్ని ఇస్తున్నట్టు ప్రకటించడంపై సీఎం కేసీఆర్‌కు పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో డీజీపీ మహేందర్‌రెడ్డి నాయకత్వంలో కీలకంగా పనిచేస్తున్న సిబ్బంది కృషికి తగిన ప్రోత్సాహకాలను సైతం ప్రకటిస్తామనడంపైనా ఆయన గురువారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం పోలీసులపై ఉంచిన భరోసాతో సిబ్బంది బాధ్యత పెరిగిందని, కరోనా కట్టడిలో మరింత శ్రమిస్తామని చెప్పారు.
వైద్యారోగ్య జేఏసీ కృతజ్ఞతలు
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని తెలంగాణ వైద్యారోగ్య జేఏసీ చైర్మన్ డాక్టర్ బొంగు రమేశ్, కన్వీనర్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ ఉద్యోగులకు పూర్తి వేతనంతోపాటు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి, వైద్యశాఖ మంత్రి ఈటలకు గురువారం ఓ ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణాలుపణంగా పెట్టి వైద్యసేవలు అందిస్తున్న వైద్యులకు, స్టాఫ్ నర్సులకు, పారా మెడికల్ సిబ్బందికి జేఏసీ సెక్రటరీ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి, చీఫ్ అడ్వైజర్ జూపల్లి రాజేందర్, కోఆర్డినేటర్ డాక్టర్ నరహరి, కోచైర్మన్ షబ్బీర్ అహ్మద్ తదితరులతో కలిసి కృతజ్ఞతలు చెప్పారు.