భాస్కరపురం(మచిలీపట్నం),(ఆరోగ్యజ్యోతి: వైద్యుల జీవితం ప్రజాసేవకే అంకితం కావాలని ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డా.పొట్లూరి గంగాధరరావు పేర్కొన్నారు. నగరంలోని వైద్యులకు ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు ఐఎంఏ మెడికల్ హాల్లో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య విజ్ఞాన సదస్సును ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగాధరరావు మాట్లాడుతూ వైద్యులు ప్రజలతో మమేకమై అన్ని వేళలా అందుబాటులో ఉంటూ తరచూ వ్యాధులపట్ల అవగాహన కల్పిస్తూ ఆరోగ్యకర సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. వైద్య విధానంలో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోందని, ఆయుష్ వైద్యసేవలను అల్లోపతిలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటోందని, దీంతో అనేక సమస్యలు వస్తాయని ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.బి.శ్రీనివాసాచార్య చెప్పారు. ఐఎంఏ నగర అధ్యక్షుడు కేవీ.శివప్రసాద్ మాట్లాడుతూ సదస్సు రెండు రోజలపాటు ఉంటుందని, 20 మంది నిపుణులైన వైద్యులు వైద్య రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులపై అవగాహన కల్పిస్తారన్నారు. సదస్సులో పాల్గొన్న వైద్యులందరికీ అనుభవంలో 4 పాయింట్లు కలుస్తాయని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా పలువురు సీనియర్ వైద్యులను సత్కరించారు. ఐఎంఏ నగర కార్యదర్శి వై.బాలసుబ్రహ్మణ్యం, వైద్యులు ఫణికుమార్, శరత్చంద్ర, కిరణ్, వంశీకృష్ణ, శ్రీధర్, సతీష్‌రెడ్డి, రవికాంత్, శ్రీనివాస్, ప్రభురామ్, గోవిందరావు, కేశవకృష్ణ, బదరీనాథ్, గిరీష్, శంకర్ పాల్గొన్నారు.