[spt-posts-ticker]

వైద్యుల వేతనాలపై హైకోర్టు ఆందోళన

చెన్నై, (ఆరోగ్యజ్యోతి): కరోనా మహమ్మారిని అదుపుచేసేందుకు వైద్యసేవలందిస్తున్న సేవకులకు సరైన వేతనాలు లేవని మద్రాసు హైకోర్టు విచా రం వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ఉచిత వైద్యసదుపాయం కల్పించాలని, కరోనాను నిరోధించేందుకు రాష్ట్ర, కేంద్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని, కరోనా బాధితులకు చికిత్స చేసే వైద్యులకు, నర్సులకు దేహమంతా కప్పేలా రక్షణ దుస్తుల సదుపాయం కల్పించాలని సీనియర్‌ న్యాయవాది మిల్టన్‌ రెండు పిటిషన్ల ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్లు హైకోర్టు న్యాయమూర్తులు ఎదుట విచారణకు రాగా ప్రభుత్వ తరఫు న్యాయవాది అరవింద పాండ్యన్‌ తన వాదన వినిపిస్తూ కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యల కోసం 37,648 రక్షణ దుస్తులు సిద్ధంగా ఉన్నాయని, 14 వేలకు పైగా కరోనా పరీక్షా పరికరాలు కూడా ఉన్నాయని తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఆకలితో అలమటించకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా వెయ్యి రూపాయల నగదు, ఏప్రిల్‌ కోటా బియ్యం, పప్పు దినుసులు, వంటనూనె వంటి సరకులు ఉచితంగా పంపిణీ చేసిందన్నారు. ప్రభుత్వ తరఫు వాదనలను నమోదు చేసుకున్న న్యాయమూర్తులు మాట్లాడుతూ దేశమంతటా కరోనా వైరస్‌ సోకిన రోగులకు ప్రాణాలకు తెగించి చికిత్సలందిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులకు తరచూ కరోనా పరీక్షలు జరిపి తగు వ్యాధి నిరోధక చికిత్సలందించాలని ఆదేశించారు. మానవ మనుగడనే దెబ్బతీస్తున్న కరోనా వైర్‌సకు వ్యతిరేకంగా రోజంతా పోరాడే శక్తిసామర్థ్యాలున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు వారి సేవలకు తగినంత వేతనాలు లభించకపోవడం పట్ల విచారిస్తున్నామని తెలిపారు.

దేశమంతా కరోనా వైరస్‌ వ్యాప్తితో ఏర్పడిన క్లిష్టపరిస్థితులల్లో కరోనా వైరస్‌ సోకిన లక్షణాలు కలిగిన రోగులతో చికిత్సలందిస్తున్న వైద్యులు, నర్సులు, వైద్య సహాయకులు పరిశుభ్రతను కల్పిస్తున్న పారిశుద్ధ్యకార్మికులు, ప్రజలకు రక్షణగా నిలిచిన పోలీసులను మనసారా అభినందిస్తున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇక ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్సలందిస్తున్న వైద్యులకు, నర్సులకు వారి సేవలను గుర్తించి వేతనాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతాయనే నమ్మకం ఉందని న్యాయమూర్తులు తెలిపి కేసు తదుపరి విచారణను వాయిదా వేశారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *