మేడారం(శివనగర్), (ఆరోగ్యజ్యోతి): మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లక్షలాది మంది భక్తులకు వైద్యం అందించి శభాష్ అనిపించుకుంది. జాతరలో తల్లుల గద్దెల పక్కనే 50 పడకల ఆసుపత్రితో పాటు జాతరకు వచ్చే దారిలో ఆత్మకూరు నుంచి తాడ్వాయి వరకు 42 ఎన్రూట్ వైద్యశిబిరాలు, జాతర ప్రాంతంలో 18 తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రధాన గద్దెల వద్ద క్యూలెన్లో భక్తులకు వైద్య సేవలను అందించారు. సుమారు 120మంది వైద్యులు, 600మంది వైద్య సిబ్బంది 24గంటలు భక్తులకు వైద్య సేవలను అందించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి, సీకేఎం, జీఎంహెచ్, చాతీ ఆసుపత్రి, ప్రాంతీయ నేత్ర వైద్యశాల నుంచి ప్రతి రోజు 15మంది వైద్యనిపుణులు సేవలు అందించారు. ఈ నెల 1వ తేది నుంచి 8వ తేదీ వరకు జాతరలోని ప్రధాన ఆసుపత్రిలో మొత్తం లక్షా 25 వేల మందికి వైద్య సేవలను అందించారు. 1200 మందిని ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యం అందించారు. 300మందికి మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేశారు. ఇవి గాక 18 తాత్కాలిక వైద్య శిబిరాల ద్వారా 32,583మందికి ఓపీ వైద్యసేవలను అందించారు. చెన్నైకి చెందిన ఓ గర్భిణీ ఆడ శిశువుకు జన్మనివ్వగా, పుణేకు చెందిన గర్భిణీ మగ శిశువుకు మేడారం ఆసుపత్రిలోనే వైద్యులు పురుడు పోశారు. వివిధ కారణాలతో జాతరలో 8మంది మృతి చెందగా 15 మంది తేలుకాటుకు గురైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ సంఖ్య వందల్లోనే ఉన్నట్లు క్షేత్రస్థాయి అనుభవాన్ని బట్టి తెలుస్తోంది. నలుగురు పాముకాటుకు గురికాగా.. కడుపు నొప్పి, ప్రమాదాల్లో గాయపడిన వారు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]