హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి):రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ.46 కోట్లతో వెంటిలేటర్లు, డిఫిబ్రిలేటర్లు, సక్షన్ ఆపరేటర్లు, సీటీ స్కాన్ తదితర వైద్య పరికరాలను కొత్తగా సమకూర్చుకోవడానికి తెలంగాణ సర్కారు అనుమతించింది. ఆసుపత్రి అభివృద్ధి నిధులతో పాటు ఆరోగ్యశ్రీ నిల్వ నిధుల నుంచి కొనుగోలు చేసుకోవడానికి పచ్చజెండా ఊపింది. ఇప్పటికే ఆసుపత్రుల వారీగా అవసరమైన పరికరాల జాబితాను ఆయా దవాఖానాల నుంచే వైద్యఆరోగ్యశాఖ స్వీకరించింది. తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) వద్ద ధర ఒప్పంద జాబితాలో ఉన్న వైద్య పరికరాలకు సత్వరమే టెండరు ప్రక్రియను ప్రారంభించడానికి ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒప్పంద జాబితాలో లేని పరికరాల కొనుగోలుకు ప్రత్యామ్నాయ విధానంపై దృష్టిపెట్టారు. నిమ్స్‌తో, తమిళనాడు సర్కారుతో ఇప్పటికే వైద్య పరికరాలకు సంబంధించిన ధర ఒప్పందం చేసుకున్న వాటిని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియను 100 రోజుల్లో పూర్తిచేసి, సర్కారు దవాఖానాల్లో నూతన వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
కరోనాపై అప్రమత్తత
పలు దేశాల్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెద్దసంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో.. దేశంలో అప్రమత్తత కొనసాగించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది. ఇక నుంచి నేపాల్, జపాన్, దక్షిణ కొరియా, ఇరాన్ తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకూ విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహించాలని సూచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ అనుమానితుల్లో పరీక్షలు నిర్వహించడం, అనుమానితులను ఒంటరి గదుల్లో ఉంచి పరిశీలించడం, తదితర ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి లవ్ అగర్వాల్ ఈ వారాంతంలో హైదరాబాద్‌కు రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఆదివారమైనా సరే కరోనాపై సమీక్షకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వార్డులు, మాస్కులు, ఇతర వైద్య సామగ్రి అవసరాలపై ఉన్నతాధికారులతో వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి గురువారం ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రానికి మరో 15 వేల మాస్కులు అవసరమవుతాయని ఆరోగ్యశాఖ అంచనా వేసింది. సరఫరాదారులు చేతులెత్తేశారు. కనీసం కరోనా వార్డుల్లో పనిచేసే వైద్యసిబ్బందికైనా మాస్కుల కొరత లేకుండా ఎలా చేయాలనే అంశాన్ని వైద్యశాఖ తీవ్రంగా పరిశీలిస్తోంది.
వైద్య పరికరాలకు రూ.46 కోట్లు
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]