[spt-posts-ticker]

వైరస్‌ల తీరే వేరు!

కోవిడ్‌’ నేపథ్యంలో వినిపిస్తున్న మాటలివి. 
అయితే, వీటిలో వాస్తవం కొంతేనని హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్రా చెబుతున్నారు. వాతావరణానికి, కోవిడ్‌కు సంబంధం ఉన్నట్టు ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. వైరస్‌ నుంచి రక్షణకంటూ చాలామంది మాస్కులు ధరిస్తున్నారని.. ఆరోగ్యవంతులకు ఇవి అవసరం లేదని, దగ్గు, జలుబు వంటివి ఉన్న వారు మాస్కులు తొడుక్కోవడం వల్ల ఆయా సమస్యలకు కారణమైన సూక్ష్మజీవులు ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడవచ్చునని తెలిపారు. కోవిడ్‌–19 విషయంలో మాత్రం వ్యాధి సోకిన వారు లేదా లక్షణాలున్న వారు, రోగులకు వైద్య సాయం అందిస్తున్న వారు మాత్రమే మాస్కులు తొడుక్కోవడం మేలని సూచించారు.

తెలివిమీరిన వైరస్‌లు
కోవిడ్‌ కొత్తది కాకపోయినా, చాలాకాలంగా దీనిపై పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటికీ తగిన చికిత్స లేకపోవడానికి వైరస్‌ల తీరుతెన్నులు కారణమని డాక్టర్‌ రాకేశ్‌మిశ్రా తెలిపారు. బ్యాక్టీరియా కంటే తక్కువ సైజుండే వైరస్‌లకు సొంతంగా పునరుత్పత్తి చేసే సామర్థ్యం ఉండదని, అందుకే ఇది పరాన్నజీవి మాదిరిగా ఇతరుల శరీర కణాల్లోకి చొరబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందన్నారు. కోవిడ్‌ వంటివి తరచూ రూపురేఖలను మార్చుకుంటాయని, ఫలితంగా వాటిని మన రోగ నిరోధక వ్యవస్థ గుర్తించలేదన్నారు. అందువల్లే కొన్నేళ్లుగా కోవిడ్‌ కుటుంబంలోని సార్స్, మెర్స్‌ వైరస్‌ల గురించి తెలిసినా చికిత్సను అభివృద్ధి చేయలేకపోయామని వివరించారు. అయితే వైరస్‌లు ఎలా సోకుతాయి? ఎలా వ్యాపిస్తాయన్న అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండటం వల్ల కోవిడ్‌–19ను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నామన్నారు.

‘కోవిడ్‌’ వేడికి చస్తుందా?
కోవిడ్‌ వేడి వాతావరణంలో బతకలేదనేందుకు శాస్త్రీయ ఆధారాల్లేవని రాకేశ్‌ మిశ్రా తెలిపారు. సాధారణ వ్యక్తులు కోవిడ్‌ నుంచి రక్షణ కోసమని మాస్కులు తొడుక్కోవడం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్, సార్స్, మెర్స్‌ వంటి వైరస్‌ సమస్యలన్నింటికీ ఒకే మందు కనుక్కోవడం అసాధ్యం కాదని, ఆ దిశగా ప్రయత్నాలు జరగాలన్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నందున భారత్‌లో కోవిడ్‌ పెద్ద ఆరోగ్య సమస్యగా మారే అవకాశాల్లేవన్నారు. చైనాలో 90 వేలమందికి సోకి, మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయినా.. మరణించిన వారిలో 80ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా ఉండటం గమనించాలన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *