బోస్టన్: డెంగీ, హెచ్ఐవీ, కొవిడ్-19.. ఇలాంటి వైరస్లెన్నో ప్రస్తుతం ప్రజారోగ్యానికి సవాలు విసురుతున్నాయి. మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాయి. వాటిని విడివిడిగా ఎదుర్కొనే మెరుగైన విధానాల రూపకల్పన కోసం శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు శ్రమిస్తూనే ఉన్నారు. అయితే- అన్ని రకాల వైరస్లపై ప్రభావవంతంగా పనిచేయగల సరికొత్త టీకా అభివృద్ధి దిశగా తాము కీలక ముందడుగు వేశామంటున్నారు అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి (ఎంజీహెచ్) పరిశోధకులు. క్షీరదాలకు వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో ‘ఆర్గోనాట్(ఏజీవో)-4’ ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తాయని వారు గుర్తించారు. ఏజీవో-4 స్థాయులు తక్కువగా ఉన్నవారికి వైరస్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. కాబట్టి ఈ ప్రోటీన్ స్థాయులను పెంచే టీకాలను అందించడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయొచ్చునని, ఎలాంటి వైరస్నైనాసరే ఎదుర్కోగల సత్తాను అందించవచ్చునని పరిశోధకులు వివరించారు.