[spt-posts-ticker]

వ‌ర్ష‌పు జ‌ల్లులు … వ్యాధులు కొల్ల‌లు

 పగటి వేళల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు… సాయంత్రానికి మేఘాలు ఆవరించి వర్షం కురవడం- ప్రస్తుత సీజన్లో పరిపాటిగా మారింది. వర్షం కురిస్తే వాతావరణం చల్లనౌతున్నందుకు హర్షమేగానీ, ఈ తరుణంలోనే రకరకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా అతిసార, డెంగ్యూ, మలేరియా, జపనీస్‌ ఎన్‌కెఫలైటిస్‌, జాండీిస్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. చిన్న పిల్లలు న్యుమోనియా, బ్రాంకైటిస్‌ బారిన పడుతుంటారు. ఈ సీజన్లో పరిశుభ్రమైన తాగు నీరు ఎక్కడా లభించకపోవడం, ఉన్న కొద్దిపాటి నీటివనరులూ వర్షాల వల్ల కలుషితం కావడం. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తా చెదారం, వ్యర్థాలు అన్నీ నీటిలోనే కలవడం.. ఈ నీటిలో రకరకాల దోమలు, సూక్ష్మక్రిములు అసంఖ్యాకంగా ఉత్పత్తయి వ్యాధులకు కారణమౌతున్నాయి. ప్రతి ఏటా ఈ సీజన్లో వ్యాధులు వస్తున్నా.. అవగాహనా లోపంతో వాటికి బలైపోతున్నవారూ చాలామంది ఉన్నారు. ఈ సీజన్లో వచ్చే కొన్ని వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన చికిత్సలు, రాకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలపై  తెలుసుకుందాం!

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షాల సీజన్లో తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులను దూరంగా ఉంచొచ్చు.
-నీటిని కాచి చల్లార్చి తాగడం అన్నింటికంటే ముఖ్యమైన అంశం.
– కుండల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీరు తాగకూడదు.
– నీటిలోని క్రిముల్ని తొలగించడానికి క్లోరిన్‌ బిళ్ల వేసి క్లోరినేషన్‌ ద్వారా శుభ్రం చేసి తాగడం అవసరం.
– బయటి ఆహార పదార్థాలు ఈ సీజన్‌లో తినకూడదు.
– తాజాగా వండుకున్న ఆహారాన్ని వేడిగా ఉండగానే తినాలి.
– చల్లారిన ఆహారాన్ని వేడి చేసి, తినకూడదు. దానిని దూరంగా చెత్తకుండీలో వేయాలి.
– మాంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే మాంసాహారం వల్ల వ్యాధులు వ్యాప్తిచెందవు. కానీ ఈగలు, సూక్ష్మజీవులు ముసరడానికి శాకాహారంతో పోలిస్తే మాంసాహారంపై అధికంగా అవకాశం ఉంది.
– సరైన ప్రాసెస్‌, పూర్తిగా ఉడికించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే మాంసాహారాన్నీ తినొచ్చు.
– పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
– నీళ్ల నిల్వకు, దోమలకు ఆవాసాలైన పాత టైర్లు, ఖాళీ కొబ్బరిచిప్పలు వంటి వాటిని తొలగించాలి.
– వీలైనంత వరకూ ఇంటికీ, పడకలకూ దోమతెరలు వాడడం అవసరం.
– చేతులను శుభ్రంగా కడుక్కోవడం వల్ల చాలా రకాల జబ్బులను, ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులను నివారించవచ్చు.
వర్షాల సీజన్‌ అంటే అప్రమత్తంగా ఉండాల్సిందే. నీటివనరులు కలుషితమైపోవడం, దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు వృద్ధి చెందే కాలం కూడా ఇదే. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే హాస్పిటల్‌లో చేరాల్సిందే. పారిశుధ్య లోపంతో ఉన్న నగర, పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్లో వచ్చే కొన్ని వ్యాధులను పరిశీలిస్తే…
చికున్‌ గున్యా
చికున్‌ గున్యా జ్వరంవస్తే కాళ్లు, చేతులు, ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు బాగా వేధిస్తాయి. అందుకే చికున్‌ గున్యా రాకముందే జాగ్రత్త వహించాలి. ఇది ఈ సీజన్లోనే దోమ కాటు ద్వారా వస్తుంది. దోమకుట్టిన 3 -7 రోజుల్లో చికున్‌ గున్యా లక్షణాలు కనిపిస్తాయి.
లక్షణాలు
చికున్‌ గున్యా వల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. కాళ్లు, చేతుల కీళ్లు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందరాÄ్భల్లో కీళ్లలో వాపూ వస్తుంది. ఈ కీళ్ల నొప్పులు కొన్ని వారాల నుంచి ఏడాది వరకు ఉంటాయి. తీవ్రమైన తలనొప్పీ ఉంటుంది. వైరస్‌ సోకిన మొదటిరోజుల్లో తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. హై ఫీవర్‌, జాయింట్‌ పెయిన్స్‌ రెండ్రోజుల కంటే ఎక్కువ ఉంటాయి. చాలా అలసటగా ఉంటుంది. కొంతమందిలో స్కిన్‌ ర్యాషెస్‌ కూడా ఉంటాయి. ఎర్రగా, చిన్న చిన్న గాయాల్లా అవి చర్మంపై కనిపిస్తాయి, అరచేతిలో, ముఖంపై ర్యాషెస్‌ రావొచ్చు. లింఫ్‌ నోడ్స్‌ (శోషరస గ్రంథులు)లో వాపు కన్పిస్తుంది. ఈ లింఫ్‌ నోడ్స్‌ మెడ పక్కన, చెవులకు పక్కన, దవడ కింద ఉంటాయి. ఇక్కడ వాపు కనిపించిందంటే. చికిత్సకు ఏమాత్రం ఆలస్యం చేయకూడదు.
చికిత్స- జాగ్రత్తలు
చికెన్‌ గున్యా నివారణకు చికిత్స తీసుకుంటూనే మరికొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ సమయంలో ఫ్లూయిడ్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు తాగలేకపోతే.. సూప్స్‌, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటివి తీసుకోవాలి. భోజనానికీ లిక్విడ్స్‌ తీసుకోవడం అవసరం. అయితే కీళ్ల నొప్పులు మరీ ఎక్కువగా ఉంటే మరీ పుల్లటివి, చల్లటివీ తీసుకోకూడదు. కేవలం వెచ్చని ఆహారాలే తీసుకోవాలి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ ఎముకల బలాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి. అందువల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండే ఆహారాలు తీసుకోవాలి. పాలకూర, మెంతి వంటి ఆకుకూరలను, వెజిటబుల్స్‌ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల చికున్‌ గున్యాని వేగంగా నయం చేయవచ్చు. యాపిల్స్‌, అరటిపండ్లు తేలికగా జీర్ణమై, ఆకలిని పెంచుతాయి. అలాగే విటమిన్‌ సి ఉండే ఆహారాలైన జామ, కివి, స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల.. ఇమ్యునిటీ పెంచుతాయి. చికున్‌ గున్యాతో పోరాడతాయి.
డెంగ్యూ ఫీవర్‌
డెంగ్యూ జ్వరం రావడానికి కారణమయ్యే వైరస్‌ దోమల్లో ఉంటుంది. ఈ దోమలు పగటి సమయాల్లోనే ఎక్కువగా కుడతాయి. చీకటి ప్రదేశాల్లో నక్కి ఉండే ఈ దోమలు పగటి సమయాల్లో చాలా చురుగ్గా ఉంటాయి. కర్టెన్లు, సోఫాలు, బీరువాల వెనుక, వాడని వస్తువుల్లోని ఖాళీ జాగాలను స్థావరాలుగా చేసుకుని ఈ దోమలుంటాయి. ఈ దోమకాటుతో దాని లాలాజలంలో ఉండే వైరస్‌ రక్త ప్రవాహంలో కలిసి, డెంగ్యూకి గురిచేస్తుంది.
లక్షణాలు
విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కళ్లు లాగటం ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు మూడు రోజులపాటు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు నాలుగో రోజు నుంచి జ్వరంతోపాటు తగ్గిపోతాయి. దాంతో జ్వరం పూర్తిగా తగ్గిపోయిందనుకోకూడదు. అసలు సమస్య అప్పటినుంచే మొదలవుతుంది. జ్వరం తగ్గినట్లన్పించినా రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఈ దశలో ప్లేట్‌లెట్స్‌ అందిస్తే వ్యాధి అదుపులోకి వస్తుంది. కానీ జ్వరం తగ్గిందికదా అని నిర్లక్ష్యం చేస్తే వ్యాధి మరింత ముదిరి, రక్తం చిక్కబడి డెంగ్యూ ముదిరిపోయి హెమరేజిక్‌ ఫీవర్‌ దశకు చేరుకుంటుంది. ఈ ప్రభావం అంతర్గత అవయవాల మీద పడి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతింటాయి. దద్దుర్లు, కడుపునొప్పి, ఆయాసం లక్షణాలు కనిపిస్తాయి. అయితే అంతమందికీ ఈ సమస్యలు రాకపోవచ్చు. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రమాదం తప్పదు.
నిర్ధారణ- చికిత్స
డెంగ్యూ జ్వరాన్ని ఎలీజా, ఎల్‌ఎస్‌1 అనే కిట్‌ పద్ధతులతో ఇంటి దగ్గరే పరీక్ష చేసుకుని నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ డెంగ్యూ జ్వరమే అని నిర్ధారణ అయితే వైద్య చికిత్సతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తం చిక్కబడకుండా ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. డెంగ్యూ జ్వరం ముదరనంత వరకూ పారాసిటమాల్‌ టాబ్లెట్స్‌ వాడుతూ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. దీనికి యాంటిబయాటిక్స్‌, స్టిరాయిడ్స్‌ మందులు వాడాల్సిన అవసరం లేదు.
మలేరియా
దోమకాటు వల్ల వ్యాపించే మరో జ్వరం మలేరియా. దీనిని వ్యాపింపజేసే దోమలు రాత్రివేళల్లోనే కుడతాయి. వైవాక్స్‌, పాల్సిఫారం అనే రెండు రకాల ప్యారసైట్స్‌తో వచ్చే మలేరియా జ్వరాలు వస్తుంటాయి.
లక్షణాలు
ఫాల్సిఫారం ప్యారసైట్స్‌ వల్ల వచ్చే మలేరియా జ్వరం విపరీతంగా ఉంటుంది. హై టెంపరేచర్‌, ఒళ్లు నొప్పులు, నీరసం ఉంటాయి. జ్వరం తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. జ్వరం తగ్గించే మాత్రలు వేసుకుంటూ ఉండిపోతే సమస్యలు పెరిగిపోతాయి. కిడ్నీలు ఫెయిలవ్వచ్చు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తవచ్చు. వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మెదడు కణజాలం దెబ్బతిని అయోమయ స్థితి, విపరీతమైన నిద్ర, మూర్ఛ కూడా వస్తుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరుకుని పల్మనరీ ఎడీమాతో ఊపిరి తీసుకోలేని ఇబ్బందీ తలెత్తుతుంది.
చికిత్స, జాగ్రత్తలు
మలేరియా జ్వరం వచ్చినట్లు రక్తపరీక్ష ద్వారా నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షతో మలేరియా ప్యారసైట్‌ రక్త కణాల్ని, ప్లేట్‌లెట్లను ఎంత మేరకు నాశనం చేశాయి? రక్తం గడ్డకట్టే తీవ్రత, కాలేయం, మూత్రపిండాల పనితీరులను వైద్యులు తెలుసుకోగలుగుతారు. వైవాక్స్‌ రకం మలేరియాలో జ్వరం కనిపించిన రోజు మొదలైన ఇన్‌ఫెక్షన్‌ రోగి శరీరంలో 12 నుంచి 18 రోజులపాటు ఉంటుంది. మలేరియా ప్యారసైట్‌ ఎర్రరక్త కణాల్ని వేగంగా నాశనం చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్యారసైట్స్‌ను చంపటం కోసం కచ్ఛితంగా యాంటిబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. నీరసం తగ్గటానికి కొబ్బరినీరు, గ్లూకోజ్‌లతోపాటు తేలికగా జీర్ణమయ్యే ఘనపదార్థాలూ తీసుకోవాలి. ఇక మలేరియా రాకుండా ఉండాలంటే దోమ కాటుకు దూరంగా ఉండడం ఒక్కటే మార్గం.
టైఫాయిడ్‌
సాల్మొనెల్లా టైఫై, పారాటైఫై అనే బ్యాక్టీరియాల నుంచి టైఫాయిడ్‌ వస్తుంది. ఈ బ్యాక్టీరియా ఉండే కలుషిత ఆహారం, నీరు తాగటం వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. తర్వాత రక్తప్రవాహం ద్వారా కాలేయం, స్ప్లీన్‌, ఎముక మజ్జలోని తెల్ల రక్తకణాల్లో తిష్టవేస్తుంది.
లక్షణాలు
కాలేయం, ఎముక మజ్జలోకి ఈ బ్యాక్టీరియా చేరటంతో జ్వరం మొదలవుతుంది. 104 డిగ్రీలకు మించి జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ఆకలి మందగించటం లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో మలబద్ధకం లేదా డయేరియా లక్షణాలూ ఉంటాయి. వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే జీర్ణాశయంలోని పొరలు పలుచబడే పెరొయొటనైటిస్‌ అనే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది.
నిర్ధారణ-చికిత్స
మలం, రక్త పరీక్షల ద్వారా ఈ బ్యాక్టీరియాను తేలికగా గుర్తిసారు. వ్యాధి నిర్ధారణ జరగ్గానే యాంటిబయాటిక్స్‌తో శరీరంలో తిష్టవేసిన ఈ బ్యాక్టీరియాను నాశనం చేయవచ్చు. తేలికగా అరిగే ఆహారంతోపాటు శక్తినిచ్చే ద్రవాలు తీసుకోవాలి. టైఫాయిడ్‌ రాకుండా ఉండాలంటే…శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలి. బయట దొరికే పదార్థాలకు దూరంగా ఉండాలి. పళ్లు, కూరగాయలను పైతొక్క తీసి శుభ్రం చేసుకుని తినాలి.
అతిసార (డయేరియా)
కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వల్ల అతిసారం వ్యాపిస్తుంది. జ్వరం, విరేచనాలు, కడుపునొప్పి, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలు ఈ వ్యాధి సోకినపుడు కనిపిస్తాయి. తగిన చికిత్స సమయంలో అందించకపోతే మూత్రపిండాలు చెడిపోతాయి. డీహైడ్రేషన్‌ వల్ల రోగి చనిపోయే ప్రమాదం ఉంది.
లక్షణాలు
డయేరియా బారినపడినప్పుడు రోగి జీర్ణకోశం, ప్రేవులలోని పోర ఉబ్బుతుంది, ఆ వ్యక్తి తాగిన లేక తిన్న ఆహార పానీయాలు కడుపులో ఉంచుకోలేక ఎప్పటికప్పుడు వాంతులు, పల్చటి విరోచనాలు అవుతాయి.
చికిత్స
తగిన జాగ్రత్తలు తీసుకుంటే సాధారణంగా ఒక రోజులోనే విరోచనాలు తగ్గుముఖం పడుతాయి. రెండోరోజు విరోచనాలు, వాంతులు అవుతుంటే వెంటనే ఆస్పత్రికెళ్లి చికిత్స చేయించాలి. లేకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. కిడ్నీ, ఇతర అవయవాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితిలో రోగిని పరీక్షించి, లవణాలు ఏమేరకు తగ్గిపోయాయి. కిడ్నీ పనితీరు ఎలా ఉంది వంటివన్నీ తెలుసుకొని చికిత్స అందిస్తారు.
జపనీస్‌ ఎన్‌కెఫలైటిస్‌
ఇది ఎక్కువగా పిల్లలలో వస్తుంది. ఇదీ దోమకాటు వల్లే సోకుతుంది. దీన్ని మెదడువాపు వ్యాధి అని కూడా అంటారు. జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. సిట్‌ స్కాన్‌, సిఎస్‌ఎఫ్‌ అనాలసిస్‌ పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స ఏమీ లేదు. సపోర్టివ్‌ కేర్‌ ద్వారానే వ్యాధిని తగ్గించాలి. ఒకవేళ మెదడు వాపు తీవ్రమైతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే తగిన పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకుంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *