[spt-posts-ticker]

శరీరంలో రక్తం లేక నీరసం … వ్యాపిస్తున్న వ్యాదులు రాష్ట్ర సగటుకన్నా జిల్లాలో రక్తహీనత అధికం

 

తెనాలి, (ఆరోగ్యజ్యోతి):  జిల్లాలో రక్తహీనత సమస్య అధికంగా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో 6 నుంచి 59 నెలల మధ్య ఉన్న చిన్నారుల్లో సమస్య 59శాతంగా ఉంటే జిల్లాలో అది 68శాతంగా నమోదైంది. మహిళల్లోనూ ఈ శాతం ఎక్కువగా ఉంది. దీన్ని అధిగమించేందుకు కేంద్రం ప్రకటించిన ‘రక్తహీనత రహిత భారత్‌’ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. అంగన్‌వాడీలు, పాఠశాలలు, వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల  ప్రకారం 49ఏళ్లలోపు ఉన్న వారిలో రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న సుమారు 20లక్షల మందికి పరీక్షలు చేశారు. అనంతరం అవసరమైన వారికి మందులు అందించాలని నిర్ణయించారు.

రక్తంలో హిమోగ్లోబిన్‌ తగ్గడం, ఐరన్‌ లోపించడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం, మలేరియా, నులిపురుగులతో ఇబ్బంది పడటం, దీర్ఘకాలిక వ్యాధులు, జన్యుపరమైన సమస్యలతో అధికశాతం మంది రక్తహీనత ఎదుర్కొంటున్నారు. కొన్ని వ్యాధుల కారణంగా విపరీతమైన రక్తస్రావంతో ఎర్రరక్తకణాలు తగ్గుతాయి. ‘బి’ విటమిన్‌ లోపం, బి12, ఫోలిక్‌యాసిడ్‌ తగ్గడం వల్ల కూడా సమస్య ఉంటుంది.

ఇబ్బందులు: కౌమారం నుంచే రక్తహీనతతో బాధపడుతూ గర్భిణి అయ్యాక కూడా పట్టించుకోకపోతే నెలల నిండకుండానే కాన్పు జరిగి ఒక్కోసారి తల్లిప్రాణానికి ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉంది.  శిశువులు తక్కువ బరువుతో పుడతారు. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్లతో మరణాలు సంభవిస్తాయి. పోలెట్‌, విటమిన్‌ ‘ఏ’ లోపాలు సమస్య తీవ్రతను పెంచుతున్నాయి. దీనివల్ల అలసట, చురుగ్గా లేకపోవడం, ఏకాగ్రత లోపించడం, గుండెదడ, ఒత్తిడి, అసహనం వంటి సమస్యలు తలెత్తుతాయి.
సమస్య నివారణకు పలుశాఖల భాగస్వామ్యం: రక్తహీనత సమస్య ఉన్న వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించేందుకు  వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టనుంది. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, నులిపురుగుల నివారణ మందులు అందించనున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్‌ శాఖలు ఇందులో భాగస్వాములవుతాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే రక్తహీనత నివారణకు పోషకాహారం అందిస్తున్నారని, 2022 నాటికి సమస్యను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నరసరావుపేట జిల్లా ఉప వైద్యాధికారిణి బి.రోహిణిరత్నశ్రీ తెలిపారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *