[spt-posts-ticker]

సర్కారు దవాఖానాలు.. ప్రైవేటు సేవలు

అనుబంధంగా వైద్య కళాశాలల ఏర్పాటుకు అవకాశం

హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి): జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, పిల్లల వైద్యనిపుణులు, ఆర్థోపెడిక్స్‌ తదితర స్పెషలిస్టులకు తీవ్ర కొరత నెలకొంది. సమస్యను తీర్చడానికి ప్రభుత్వ ఆసుపత్రులకు అనుబంధంగా ప్రైవేటు వైద్య కళాశాలలను ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకొచ్చే పేదలకు స్పెషలిస్టు వైద్యం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వసతులను ప్రైవేటు వైద్యకళాశాలలు వినియోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాలని, స్థానికంగా వైద్యకళాశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని రాయితీ ధరలో సమకూర్చాలని కూడా రాష్ట్రాలకు సూచించారు. సంబంధిత మార్గదర్శకాలను త్వరలో రూపొందిస్తామన్నారు.  సాధారణంగా ఒక వైద్యకళాశాలను నెలకొల్పాలంటే అనుబంధంగా 300 పడకల ఆసుపత్రి ఉండాలి. దీని నిర్మాణం, నిర్వహణకు రూ.350 కోట్ల వరకు వ్యయమవుతుంది. ఈ ఖర్చును తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వారికి అవకాశం కల్పించనుంది. అంటే కేంద్ర ప్రతిపాదనతో ప్రయివేటు వైద్య కళాశాలలకు ఆసుపత్రులు నిర్మించాల్సిన అవసరం తప్పుతుంది.

ఆరోగ్యమిషన్‌కు తగ్గిన నిధులు
జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం)కు 2019-20లో రూ.33789.60 కోట్లు కేటాయించగా, 2020-21కి రూ.33,400 కోట్లు కేటాయించారు. దీంతో దాదాపు రూ.389 కోట్లు తగ్గాయి. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపులకు కూడా గతేడాది కంటే సుమారు రూ.140 కోట్ల మేరకు తగ్గాయి. ఆ మేరకు రాష్ట్రాలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌కు రూ.3200 కోట్ల నుంచి రూ.6200 కోట్లకు నిధులు పెంచారు. అయితే ఈ పథకం రాష్ట్రంలో అమల్లో లేకపోవడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో పీజీ సీట్లకు నిధులను రూ.4686 కోట్లను కేటాయించడం వల్ల రాష్ట్రానికి కొంతమేరకు నిధులు వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలో గత రెండేళ్లలో సుమారు 100కి పైగా పీజీ సీట్లు కొత్తగా వచ్చాయి ఆ మేరకు ఆ సీట్లకు సుమారు రూ.300 కోట్ల వరకు నిధులను అదనంగా రప్పించుకోవడానికి, తద్వారా సర్కారు వైద్యకళాశాలల్లో ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
‘ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన’ కింద దేశంలో 20 వేలకు పైగా ఆస్పత్రులు ఉన్నాయి. ఇలాంటివి లేని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆస్పత్రులను పీపీపీ విధానంలో నెలకొల్పడానికి సర్దుబాటు వ్యయ నిధి కింద నిధులు సమకూరుస్తారు.
*  దేశంలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు: రూ.69,000 కోట్లు
*  దీనిలో ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజనకు: రూ.6400 కోట్లు
*  వైద్య పరిశోధనలకు: రూ.2100 కోట్లు
*  కొన్ని నిర్దిష్ట వైద్య పరికరాల దిగుమతులపై ఆరోగ్య సెస్సు: 5%

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *