అంతస్తులు 13.. పడకలు 1500
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి) : తొమ్మిదెకరాల విస్తీర్ణం.. పదమూడు అంతస్తుల్లో భవనం.. ఆరు లిఫ్ట్‌లు.. 50 పడకలతో ఐసీయూ.. ఒక్కో అంతస్తులో 36 గదులు.. 468 గదుల్లో 1500 పడకలతో కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఉస్మానియా ఆస్పత్రికి అనుబంధంగా‘కోవిడ్–19’ పేరుతో గచ్చిబౌలి స్టేడియంలో మరో అత్యాధునిక ఆస్పత్రిని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. 20 రోజులుగా ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బిహార్‌లకు చెందిన సుమారు వెయ్యి మంది కూలీలు రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నారు. ఇప్పటికే సివిల్ వర్క్స్ సహా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరో అంతస్తులో పడకలను ఏర్పాటు కూడా చేసింది.ఒక్కో పడక మధ్య 8 నుంచి 12 మీటర్ల దూరం ఉండేలా చూసింది. వాటి పక్కనే సహాయకులు కూర్చునేందుకు అవసరమైన కుర్చీతో పాటు వెంట తెచ్చుకున్న వస్తువులు భద్రపరుచుకునేందుకు అవసరమైన లాకర్ కూడా ఏర్పాటు చేశారు. ఒక అంతస్తులో కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు ఉంటే.. పైఅంతస్తులో పాజిటివ్ కేసులు ఉంటాయి. ప్రతి అంతస్తులో రెండు నర్సింగ్ స్టేషన్లు, రోగులను పరీక్షించడానికి ప్రత్యేక గది సిద్ధం చేశారు. ఐసోలేషన్ కేంద్రంలో చికిత్సలు అందించేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న 77 మంది వైద్యులు, 115 మంది స్టాఫ్ నర్సులను డిప్యుటేషన్‌పై ఇక్కడ నియమించారు. ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు ఇప్పటికే ఉత్తర్వులను కూడా జారీ అయ్యాయి. అవసరమైతే ఉస్మానియా ఆస్పత్రిలో పని చేస్తున్న జనరల్ మెడిసిన్, అనస్థీషియన్ వైద్యుల సేవలను తాత్కాలికంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు.
ప్రస్తుతానికి కరోనా సేవలే..
ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న సమయం(డిసెంబర్ 31)లో చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ విస్తరించింది. ఆ తర్వాత క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తించింది. మార్చి 2న తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. విదేశీయుల నుంచి మాత్రమే వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం భావించింది. ఆ మేరకు విమానాశ్రయాలను కట్టడి చేసింది. మార్చి 24 వరకు విదేశాల నుంచి 74 వేల మంది శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, వీరిలో 25,937 మందిని క్వారంటైన్లో ఉంచింది. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని గుర్తించి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 30 మందికే కరోనా వైరస్ సోకింది. వీరి నుంచి మరో 20 మంది కుటుంబ సభ్యులకు వైరస్ సోకింది. మార్చి 13 నుంచి 15 వరకు డిల్లీలోని జరిగిన మర్కజ్ ప్రార్థనలకు తెలంగాణ నుంచి 1089 మంది హాజరైనట్లు గుర్తించారు. వీరికి సన్నిహితంగా మరో 3015 మంది ఉన్నట్లు గుర్తించింది.
వీరిలో 172 మందిలో కరోనా వైరస్ వెలుగు చూసింది. వీరి నుంచి మరో వంద మందికిపైగా కుటుంబ సభ్యులకు వైరస్ విస్తరించింది. ఇలా ఇప్పటి వరకు తెలంగాణలో 471 కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే 12 మంది మృత్యువాతపడ్డారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు వైరస్ సోకడంతో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ సహా కింగ్‌కోఠి, ఛాతీ ఆస్పత్రి, ఫీవర్, సరోజినీదేవి, నేచర్‌క్యూర్, యునానీ, ఇతర ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 4,177 పడకలను, 600కుపైగా పడకలను ఏర్పాటు చేసింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ పడకలను సిద్ధం చేసింది. ప్రస్తుతం వైరస్ రెండో దశలోనే ఉంది. భవిష్యత్తులో కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. భవిష్యత్తులో రాబోయే కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియంలోని ఖాళీగా ఉన్న 13 అంతస్తుల భవనాన్ని కోవిడ్–19 పేరుతో అత్యాధునిక ఐసోలేషన్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు దీటుగా దీనిని తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతానికి ఇక్కడ కరోనా బాధితులకు చికిత్సలు అందించనున్నారు. ఆ తర్వాత దీన్ని పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం.
దివంతగ నేత వైఎస్సార్ శంకుస్థాపన చేసిన భవనం..
2007లో జరిగిన 4వ మిలిటరీ వరల్డ్ గేమ్స్‌ను పురస్కరించుకుని దివంగత నేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజి పేరుతో 13 అంతస్తుల భవన నిర్మాణం కోసం 2006 అక్టోబర్ 3న శంకుస్థాపన చేశారు. మిలిటరీ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన వారికి అప్పట్లో ఆ భవనంలోనే వసతి కల్పించారు. ఆ తర్వాత అదే భవనంలో రాష్ట్రస్థా యి క్రీడాకారులకు వసతి కల్పించి ఆయా అంశాల్లో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. వైఎస్సార్ మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ భవనాన్నే కాదు క్రీడాంశాల్లో శిక్షణను పెద్దగా పట్టించుకోలేదు. శాట్స్‌కు ఎంపికైన వారికి ఒక అంతస్తులోనే వసతి కల్పించేవారు. మిగిలిన అంతస్తుల్లోని గదులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తుండటం, రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం, ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోవడం, అదనంగా మరికొన్ని ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి రావడంతో.. ఖాళీగా ఉన్న ఈ భవనాన్ని ప్రభుత్వం ఇటీవల స్వాధీనం చేసుకుంది. కోవిడ్– 19 పేరుతో పూర్తిస్థాయి ఆస్పత్రిగా తీర్చిదిద్దుతోంది.