హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): సీజనల్ వ్యాధుల నివారణకోసం పురపాలకశాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ ను ఆదివారం పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు లాంఛనంగా ప్రారంభించారు. తన నివాసంలో ఉన్న పూల కుండీల్లో పేరుకుపోయిన నీటిని తొలిగించారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా నీరు పేరుకుపోయిందా అని పరిశీలించారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారుల సలహామేరకు యాంటీ లార్వా మందులను చల్లారు. ప్రస్తుతం ప్రజలందరికీ ఆరోగ్యంపైన ప్రత్యేక స్పృహ ఏర్పడిన నేపథ్యంలో రానున్న వర్షాకాలం నాటికి దోమల వల్ల కలిగే డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఇప్పటినుంచే ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్ని పురపాలికలు పూర్తిస్థాయిలో సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మున్సిపాలిటీలు చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు మద్దతుగా నిలువాలని కోరారు. రానున్న పది వారాలపాటు వారానికి పది నిమిషాల చొప్పున ప్రతి ఒక్కరూ తమ ఇండ్లు, పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారిస్తే సీజనల్ వ్యాధులను ఎదుర్కొనే అవకాశం ఉన్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు.
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం: స్పీకర్ పోచారం
మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదివారం స్పీకర్ హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంలో పూలకుండీల్లో చెత్తను, నిల్వ ఉన్న నీటిని తొలిగించి పరిసరాలను శుభ్రం చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు పంచాయత్‌రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన ఇంటి ఆవరణలో కుండీలను శుభ్రంచేశారు. నిలిచి ఉన్న నీటిని తొలగించారు. చెత్తాచెదారం తీసేసి నీళ్లు పోశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మంలోని తన నివాసంలో ఇంటిపనుల్లో పాల్గొన్నారు. ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు కరీంనగర్‌లోని తన నివాసంలో చెత్తాచెదారాన్ని తొలిగించి శుభ్రంచేశారు. నిర్మల్‌లోని తన నివాసంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో ఉన్న బావిలో బ్లీచింగ్ పౌడర్ వేసి పాత టైర్లలో, పూల కుండీల్లో, ఖాళీ స్థలాల్లో నిల్వ ఉన్న నీటిని తొలిగించారు. హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంలో క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రతి ఆదివారం పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొని ఉన్న పూల కుండీలు, తొట్లను శుభ్రంచేశారు.