నిజాంపట్నం, : నిజాంపట్నంలోని సామాజిక వైద్యశాలలో వైద్యుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని సామాజిక వైద్యశాలల జిల్లా సమన్వయకర్త ఈశ్వరప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానిక వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యశాలలో ప్రస్తుతం దంత, మత్తు విభాగ వైద్య నిపుణులు మాత్రమే ఉన్నారని చెప్పారు. గర్భిణులు, చిన్నపిల్లల వైద్యులు వారంలో రెండ్రోజుల పాటు ఇక్కడ సేవలు అందించేందుకు ఇతర ప్రాంతాల్లో పనిచేసేవారిని డిప్యుటేషన్‌పై నియమించామన్నారు. త్వరలో జనరల్ ఫిజీషియన్‌ను కూడా నియమిస్తామన్నారు. ఇక్కడ వైద్యుల కొరత పరిష్కరించాలని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ఆదేశించారన్నారు. తీరప్రాంతం కావడంతో 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిజాంపట్నం, తెనాలి ప్రాంతాల్లో వైద్యశాలలకు అవసరమైన పక్కాభవనాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. జిల్లాలో సామాజిక వైద్యశాలల్లో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామన్నారు. ఎక్కడా మందుల కొరత లేదని స్పష్టం చేశారు. అనంతరం వైద్యశాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో వైద్యులు ఉదయ్‌కుమార్, శైలజ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.