[spt-posts-ticker]

స్వైన్‌ ఫ్లూ నివారణకు పటిష్ఠ చర్యలు

స్వైన్‌ ఫ్లూ నివారణకు పటిష్ఠ చర్యలు
చైతన్య, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాం
మార్చికల్లా 14 కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ యంత్రాలు
హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం

 

హైదరాబాద్‌: స్వైన్‌ ఫ్లూ నివారణకు రాష్ట్ర సర్కారు పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టుకు నివేదించారు. హైదరాబాద్‌లో ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు మూడు ప్రయోగశాలలు ఉన్నాయని, అదనంగా 14 కేంద్రాల్లో సంబంధిత యంత్రాలను మార్చికల్లా ఏర్పాటుచేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 253 నమూనాలను పరీక్షిస్తే 26, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1200 కేసుల్లో 161 మందికి స్వైన్‌ ఫ్లూ ఉన్నట్లు తేలిందని చెప్పారు. వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వైన్‌ ఫ్లూ, డెంగీ వంటి వ్యాధుల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ డా.కరుణ, మరో ఇద్దరు వేసిన పిటిషన్లతో పాటు న్యాయవాది ఆర్‌.భాస్కర్‌ రాసిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యాలుగా పరిగణిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నివేదికను సమర్పించారు. హైదరాబాద్‌లో నెలకు 1500 పరీక్షలు నిర్వహించే సామర్థ్యంగల మూడు ల్యాబ్‌లున్నాయని అందులో పేర్కొన్నారు. నారాయణగూడ కేంద్రంలో జనవరిలో 764, ఫిబ్రవరిలో 556, నల్లకుంటలో ఫిబ్రవరిలో 1, గాంధీ ల్యాబ్‌లో జనవరిలో 35, ఫిబ్రవరిలో 97 పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అనుమానితుల నుంచి నమూనాలను సేకరించామని, ఈ కేసులను రాష్ట్ర ప్రత్యేక విభాగం పర్యవేక్షిస్తోందని తెలిపారు. స్వైన్‌ఫ్లూ నివారణపై జిల్లా వైద్యాధికారులు ఆర్‌ఎంపీలకు, ప్రైవేటు ఆస్పత్రి వైద్యులకు, విద్యార్థులకు వర్క్‌షాపులు నిర్వహించినట్లు చెప్పారు. నివేదికను పరిశీలించిన ధర్మాసనం కరోనా(కోవిడ్‌ 19) నివారణకు తీసుకుంటున్న చర్యలపై నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను మార్చి ఆరుకి వాయిదా వేసింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *