- శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ వెల్లడి
న్యూఢిల్లీ(ఆరోగ్యజ్యోతి): కరోనాకు 2021 కంటే ముందుగా వ్యాక్సిన్ సిద్ధమయ్యే అవకాశంలేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ -19ను కట్టడి చేసే వ్యాక్సిన్ ఆగస్టు 15వ తేదీ లోపు అందుబాటులోకి రావాలని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆదేశాలివ్వడంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పై విధంగా స్పందించింది. మరోవైపు, వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తికావడానికి కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. కొవాగ్జిన్, జైకోవ్-డీతో పాటు కరోనా చికిత్సకు ప్రయోగాలు జరుపుకుంటున్న ఏ వ్యాక్సిన్ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశంలేదని తెలిపింది. ‘కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఆరు భారతీయ ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొవాగ్జిన్, జైకోవ్-డీ వ్యాక్సిన్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 140 వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉన్నాయి. ఇందులో 11 వ్యాక్సిన్లు హ్యూమన్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి. అయితే, ఇందులో ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదు’ అని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓ ప్రకటనలో వెల్లడించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) నుంచి హ్యూమన్ ట్రయల్స్ కోసం కొవాగ్జిన్, జైకోవ్-డీకు అనుమతులు లభిస్తే, అది కరోనా అంతమయ్యే క్రతువుకు ఆరంభ సూచకమని మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
ప్రణాళిక ప్రకారం అన్ని జరిగితేనే..
వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఏ వ్యాక్సిన్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నా ట్రయల్స్ నిర్వహించడం ముఖ్యమని, దీనికి కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం అన్ని జరిగితేనే ఇది సాధ్యమని వెల్లడించారు. ఐసీఎంఆర్ తాజా ప్రకటన నేపథ్యంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. కరోనా టీకా ఇప్పట్లో వచ్చే అవకాశంలేదని పరోక్షంగా వివరించారు.