- ఖాతాల్లో జమకానున్న నగదు
- బ్యాంకుల్లోకి రూ.1100 కోట్లు
- బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): కరోనా రక్కసి దెబ్బకు ఉపాధి కోల్పోయి సతమతమవుతున్న పేదలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది. లాక్డౌన్ కారణంగా పనులు- రాబడి లేక ఇబ్బంది పడుతున్న బడుగులకు ఆర్థిక సాయం అందించనుంది. రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి 1500 రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేయనుంది. ఈ ఆర్థిక సాయం పంపిణీ మంగళవారం నుంచే మొదలు కానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 1,112 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. కరోనా- లాక్డౌన్ వల్ల పేదలు ఇబ్బంది పడకుండా రేషన్ కార్డు దారులకు 12 కిలోల బియ్యం, రూ.1500 నగదు ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కష్టకాలంలో ఆర్థికసాయం అందిస్తామన్న ముఖ్యమంత్రి మాట ప్రకారం& పేదలకు ఆర్థిక సాయం అందబోతున్నది.
ఈ మేరకు మొత్తం రూ.1,112 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు బదిలీ చేసింది’ అని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం ట్విటర్లో తెలిపారు. ఈకార్యక్రమం కింద తెలంగాణలోని 74 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. వీరి బ్యాంకు ఖాతాల్లో రూ.1500 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా పౌర సరఫరాల శాఖ ఇప్పటికే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల సమాచారాన్ని సేకరించింది. మంగళవారం నుంచి నగదు బదిలీ చేయడం ద్వారా ముఖ్యమంత్రి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నారని కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు.