[spt-posts-ticker]

మహిళా డాక్టర్‌ వికృత చేష్టలు

గర్భిణులను గిల్లుతూ.. గిచ్చుతూ.. రిపోర్టులను విసిరేస్తూ  బెదిరింపులు

ప్రసూతి కోసం వస్తే చీదరింపులు 

ప్రైవేట్‌కు వెళ్లాలని ఒత్తిడి

నారాయణఖేడ్‌ నుంచి వచ్చిన ఓ గర్భిణికి చేదు అనుభవం

భయంతో బీదర్‌ వెళ్లిన గర్భిణి 

వైద్యురాలిపై చర్యలకు బాధితుల డిమాండ్‌

సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి ఎంసీహెచ్‌లో ఘటన

సంగారెడ్డి :  గర్బిణులకు కాన్పు సమయంలో దేవతలా కనిపించాల్సిన ఓ మహిళ వైద్యురాలు (గైనకాలజిస్ట్‌) మరోలా కనబడుతుంది. పవిత్రమైన వైద్యవృత్తిలో ఉంటూ సాటి మహిళలను (గర్భిణులను) గిచ్చుతూ.. గిల్లుతూ.. ఆపై దూషిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నది. కొంతకాలంగా ఆ డాక్టరమ్మ చేష్టలకు గర్భిణులు శారీరకంగా, మానసికంగా వేదనకు గురవుతున్నారు. తొలికాన్పును తల్లిదండ్రులు జరిపించాలన్న ఆనవాయితీ నిండు గర్భిణులకు శాపంగా మారింది. తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకోలేక పెద్దాసుపత్రికి వస్తే తిరిగి ప్రైవేటుకే వెళ్లాలని వత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. గర్భిణులు, బాలింతలు చివరికి వైద్యసిబ్బందిని కూడా మనోవేదనకు గురి చేసేలా ఆ డాక్టరమ్మ ప్రవర్తిస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు.. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో నిత్యం జరుగుతున్నది.

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..

మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ఒక్కరిద్దరి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల సర్కారు దవఖానాకు ప్రసవం కోసం వచ్చేందుకు గర్భిణులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. నారాయణఖేడ్‌ పట్టణం నుంచి కాన్పు కోసం సంగారెడ్డి పెద్దాసుపత్రికి వచ్చిన ఓ గర్భిణికి చేదు అనుభవం ఎదురైంది. గర్భిణి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… నారాయణఖేడ్‌కు చెందిన గాన్ల శ్రీవిద్య కాన్పు కోసం నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి డాక్టర్లు సంగారెడ్డికి వెళ్లాలని సూచించారు. దీంతో శనివారం ఉదయం మొదటి కాన్ను కోసం శ్రీవిద్య సంగారెడ్డిలోని ఎంసీహెచ్‌లో అడ్మిట్‌ అయింది. టెస్టులు చేసిన అనంతరం డాక్టర్‌ ఏ-నెగిటివ్‌ బ్లడ్‌ అవసరపడవచ్చని సిద్దం చేసుకోవాలని గర్భిణి కుటుబ సభ్యులకు సూచించారు. అదేరోజూ రాత్రి కుటుబ సభ్యులు డెలివరీ డేట్‌ అయిపోయినప్పటికి కాన్పు కాకపోవడానికి గల కారణాలను అడిగేందుకు వైద్యురిలి దగ్గరికి వెళ్లారు.

ఆ డాక్టరమ్మ ఒక్కసారిగా ఎందుకు వచ్చారూ.. మా ప్రాణాలు తీయడానికా.. ప్రైవేట్‌కు వెళ్లండి అంటూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ వైద్యురాలి వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగారు. కాన్పుకోసం వస్తే బయబ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అదేరోజూ కాన్పుకోసం వచ్చిన ఒక్కరిద్దరి గర్భిణులను అదే డాక్టరమ్మా ప్రసవ సమయంలో గిల్లి, గిచ్చి, దూషిస్తూ నీచంగా ప్రవర్తించిందని వారు చెప్పుకొచ్చారు. చివరకు గర్భిణి శ్రీవిద్య సంగారెడ్డిలో కాన్పు చేయించుకునేందుకు ఇష్టపడలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆవేదనతో శ్రీవిద్యను ప్రసవం కోసం బీదర్‌ తీసుకెళ్లారు. గర్భిణుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న ఆ డాక్టరమ్మపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

గర్భిణులకు చీదరింపులు

సంగారెడ్డిలోని ఎంసీహెచ్‌లో డాక్టర్లు గర్భిణులను, బాలింతలను వేదింపులకు గురి చేస్తూ సత్కరిస్తున్నారు. కర్మకాలి కాన్పుకోసం వస్తే చివాట్లు, చీదరింపులతో వేదిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెకప్‌ కోసం వచ్చిన గర్భిణులపై కేస్‌షీట్లు నేరుగా మోకంపై కొట్టి ఎక్కడి వాళ్లు అక్కడే ప్రసవం చేయించుకోవాలని, లేకపోతే ప్రైవేట్‌కు వెళ్లాలని సూచిస్తున్నారని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ డాక్టరమ్మపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆ డాక్టరమ్మపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

వాస్తవమని తేలితే బదిలీ చేస్తాం.. డాక్టర్‌ కె.సంగారెడ్డి, సూపరింటెండెంట్‌

గర్భిణులు, బాలింతలపై దురుసుగా ప్రవర్తించినట్లు తన దృష్టికి వచ్చింది. విచారణలో వాస్తవమని తేలితే ఆ డాక్టరమ్మను బదిలీ చేస్తాము. కాన్పు కోసం వచ్చిన గర్భిణులకు కూడా ఓర్పు, సహనం అవసరం. సాధారణ ప్రసవం కోసం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *