[spt-posts-ticker]

అత్యవసర ఔషధ నిల్వలపై నిఘా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు

ఈనాడు,  హైదరాబాద్‌: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. 58 రకాల అత్యవసర ఔషధాల నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. వాటిలో యాంటీ బయాటిక్స్‌, విటమిన్‌, మధుమేహం, అధిక రక్తపోటుకు వినియోగించే ఔషధాలు ఉన్నాయి. ఈ ఔషధాల లభ్యతపై రోజూవారీగా నివేదిక అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి తనిఖీలు చేపట్టారు. అతి ముఖ్యమైన ఈ ఔషధాలను నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయకుండా, కృత్రిమ కొరత సృష్టించకుండా నిఘా పెంచామని ఔషధ నియంత్రణ సంస్థ సంయుక్త సంచాలకులు బి.వెంకటేశ్వర్లు తెలిపారు.

గాంధీ, ఫీవర్‌ ఆసుపత్రుల్లో 15 మంది
ప్రస్తుతం గాంధీ, ఫీవర్‌ ఆసుపత్రుల్లో 15 మంది అనుమానితులు విడి గదుల్లో ఉన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 232 నమూనాలను సేకరించగా.. 215 నమూనాల్లో వైరస్‌ లేదని తేలింది. ఒక్కరిలో మాత్రమే నిర్ధారణ అయింది. మరో 16 నమూనాల ఫలితం రావలసి ఉంది. ప్రస్తుతం ఐసోలేషన్‌ వార్డులో 8 మంది ఉన్నారు. వారందరి నుంచి నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నారు.

కొత్తగా ఇద్దరు ఐఏఎస్‌లు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలకు హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి, పరిశ్రమల శాఖ కమిషనర్‌ మాణిక్‌రాజ్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవిలను కూడా సర్కారు అదనంగా కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈ ఐఏఎస్‌లంతా పాల్గొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ విమాన ప్రయాణికుల్లో థర్మల్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇక నుంచి దేశీయ ప్రయాణికుల్లోనూ నిర్వహించేందుకు అనుమతివ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రాష్ట్రానికి 50,000 ఎన్‌-95 మాస్కులు అవసరమని, తక్షణమే పంపించాలని వైద్యమంత్రి ఈటల కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల కేంద్రమంత్రి హర్షవర్థన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. భారీ సభలు, సమావేశాలు, పెద్దసంఖ్యలో జనం గుమిగూడడం వంటి వాటిని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

సత్వర స్పందన బృందాలు
అనుమానితుల సమాచారం తెలియగానే స్పందించేందుకు వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలను నియమించింది. అనుమానిత వ్యక్తిని ఆసుపత్రిలో విడిగా ఉంచడంతో పాటు ఆ వ్యక్తికి అనుబంధంగా ఉన్న ఇతరుల సమాచారాన్ని కూడా సేకరించడం ప్రధాన విధి.

మాస్కుల ధరలపై తనిఖీలు
ఔషధ దుకాణదారులు మాస్కులు, శానిటైజర్ల ధరలను అనూహ్యంగా పెంచేశారని ఫిర్యాదులు రావడంతో అధికారులు శుక్రవారం పలు దుకాణాలపై దాడులుచేసి కేసులు నమోదు చేశారు.

కేరళలో అధికార బృందం పరిశీలన
కరోనా నివారణ చర్యలపై అధ్యయనానికి కేరళ వెళ్లిన రాష్ట్ర అధికారుల బృందం శుక్రవారం ఆ రాష్ట్ర వైద్యమంత్రి, వైద్యశాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. త్రివేండ్రం జనరల్‌ ఆసుపత్రికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. విమానాశ్రయంలో పరీక్షల తీరుతెన్నులను, సమాచార సేకరణ విధానాలను తెలుసుకున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *