[spt-posts-ticker]

ఆధునిక వైద్య విజ్ఞానంతోనే సంతాన సౌఫ‌ల్యం

సంతానలేమి సమస్యకు సరైన పరిష్కారాన్ని ఆధునిక వైద్య శాస్త్ర పరిశోధనల ఫలితాలే అందించాయి. కొంతమంది చెబుతున్నట్టు సంతానసాఫల్యమనే ఈ సంతానోత్పత్తి విజ్ఞానం మహాభారత కాలం నుంచీ లేదని ఈ పరిశోధనలే తేటతెల్లం చేస్తున్నాయి. సంతానలేమికి దంపతులిద్దరిలోనూ కారణాలున్నప్పటికీ మహిళలనే ఎక్కువగా అందుకు భాగస్వామిని చేసి సామాజికంగా, కుటుంబపరంగా వేధింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల్లో వచ్చే సంతానలేమికి కారణాలు, వాటికి చికిత్సలు, ఏ విధంగా వైద్య విజ్ఞానం సాయంతో సంతానసాఫల్యాన్ని సుసాధ్యం చేసుకోవచ్చో తదితర విశేషాలు ఈ వారం ‘డాక్టర్‌ స్పెషలిస్‌’్టలో తెలుసుకుందాం!
వివాహం జరిగిన తర్వాత సంతానం కోసం ఎదురుచూడడం అనివార్యమౌతోంది. కొంతమంది సంతానాన్ని కనే విషయాన్ని వాయిదా వేస్తున్నప్పటికీ ఇతర కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు ఈ విషయంపై ఆసక్తినీ, ఒత్తిడినీ కలిగిస్తుంటారు. సకాలంలో సంతానం కలగలేదంటే ఆ దంపతులు సంతానలేమి సమస్యతో ఉన్నట్టే గుర్తించాలి. దీనికి రకరకాల కారణాలున్నాయి. కొన్నిసార్లు దంపతులిద్దరిలోనూ ఈ సమస్య ఉండొచ్చు. ఇలాంటి జంటలో 55 శాతం కారణాలు పురుషుడిలో, 54 శాతం కారణాలు మహిళల్లో కన్పిస్తాయి.
మహిళల్లో సంతానోత్పత్తికి ప్రతిబంధకాలు
మహిళల్లో సంతానలేమికి గల కారణాల్లో ముఖ్యమైనవి.
– బీజవాహికలు దెబ్బతినడం.
– రుతుచక్రం సక్రమంగా లేకపోవడం.
– శారీరక ఆరోగ్య సమస్యలు.
– ఆలస్యంగా వివాహం జరగడం.
ఎండోమెట్రియాసిస్‌
శారీరక ఆరోగ్యసమస్యలను పరిశీలిస్తే మహిళల్లో ఎండోమెట్రియాసిస్‌ ముఖ్యమైనది.
గర్భాశయ కణాల్లాంటివి గర్భాశయంలో కాకుండా దాని వెలుపల అసాధారణ రీతిలో వృద్ధి చెందడాన్ని ఎండోమెట్రియాసిస్‌ అంటారు. సాధారణంగా గర్భాశయం లోపలి కణాలు ప్రతినెలా రుతుస్రావంలో బయటపడతాయి. వెలుపల ఉండే కణాలు మాత్రం కణజాలానికి అతుక్కొని ఉంటాయి. అండాశయం పైన, బీజవాహికల వద్ద, గర్భాశయం లేదా పేగు వెలుపలి భాగాల వద్ద ఈ కణాలుంటాయి. వాటి సమీప అవయవాల్లోనూ ఈ కణాలుండే అవకాశముంది. వజీనా, సెర్విక్స్‌, బ్లాడర్‌ పైభాగాల్లోనూ ఉండే వీలుంది. ఇవి క్యాన్సర్‌ కారకాలు కానప్పటికీ ఇతరత్రా సమస్యలను కలిగిస్తాయి. ఈ సమస్య ఉన్న వారిలో ప్రత్యేకంగా ఎలాంటి లక్షణాలు బయటపడవు. సంతానలేమికి చికిత్స పొందేవారిలో 20-50 శాతం దాకా ఈ సమస్యతో బాధపడుతున్నవారే. సాధారణంగా 25 -35 ఏళ్ళ వయస్సులో మహిళలు ఈ సమస్యతో సతమతమవుతున్నారు. పొడవుగా, సన్నగా, పొడవుకు తగ్గ బరువు లేనివారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌, కొన్ని భాగాల్లో ఏర్పడే నొప్పి లాంటి వాటితో ఈ సమస్యను గుర్తించవచ్చు. లాప్రోస్కోపీతో దీన్ని నిర్ధారించవచ్చు.
నెలసరి సమస్యలు
మహిళల్లో సంతానలేమికి సంబంధించిన సమస్యల్లో 20 శాతం దాకా నెలసరి సక్రమంగా లేకపోవడం అనేది ఒక కారణంగా ఉంది. రుతుచక్రం సక్రమంగా లేకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. వాటి లక్షణాలు బయటపడే సందర్భాల్లో గుర్తించి, వాటికి చికిత్స చేయించాలి. ఈ కారణాల్లో కొన్నింటిని మందులతో, మరికొన్నింటిని జీవనశైలిలో మార్పులతో చక్కబర్చుకోవచ్చు. మరికొన్ని సమస్యలను మాత్రం సరిదిద్దుకోలేం. ఇలాంటి సందర్భాల్లో ఎగ్‌ డోనార్‌ సాయంతో గర్భధారణకు ప్రయత్నించవచ్చు.
గర్భాశయ సమస్యలు
గర్భాశయ సమస్యల్లో ముఖ్యమైనవి ఫైబ్రాయిడ్స్‌. ఇవి గర్భాశయం లోపల, వెలుపల పెరిగే, క్యాన్సర్‌ కారకం కాని ఒక విధమైన కంతుల్లాంటివి. ఫైబ్రాయిడ్స్‌కి తగిన చికిత్స క్రమం తప్పకుండా చేయించాలి.
హైపొథాల్మిక్‌ అన్‌ఒవ్యులేషన్‌
వ్యాయామం, ఒత్తిళ్లు, బరువు తగ్గడంలాంటి వాటివల్ల హైపొథాల్మిక్‌ అన్‌ఒవ్యులేషన్‌ అనే సమస్య ఏర్పడుతుంది.
హైపర్‌ ప్రొల్టానేమియా
పిట్యూటరీ గ్రంథి విడుదల చేసే ప్రొలాక్టిన్‌ స్థాయి అధికం కావడమూ గర్భధారణ సమస్యలకు కారణమవుతోంది.
పోలీసిస్టిక్‌ ఓవేరియన్‌ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌)
మహిళల్లో ఋతుచక్రాన్ని, పిల్లలను కనే శక్తిని, హార్మోన్లను, గుండెను, రక్త నాళాలను ప్రభావితం చేసే సమస్యని పీసీఓఎస్‌ అంటారు.ఈ సమస్య ఉన్న వారిలో ఆండ్రోజెన్‌ (మేల్‌ హార్మోన్స్‌) స్థాయిలు అధికంగా ఉంటాయి. ఆండ్రోజెన్‌ అండాల అభివృద్ధిని, విడుదలను దెబ్బతీస్తుంది. ఋతుచక్రం క్రమబద్ధంగా ఉండదు. అండాశయాల్లో ద్రవంతో నిండిన కంతుల్లాంటివి ఉంటాయి. కొంతమందిలో సెర్వికల్‌ స్రావాలు చిక్కగామారి, వీర్యకణాలు ఈదుతూ బీజవాహికల్లోకి ప్రవేశించడాన్ని అడ్డుకుంటాయి.
ప్రతి పదిమంది మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. మరికొందరిలో పిట్యూటరీ గ్రంథి లేదా హైపొథాలమస్‌ (మెదడులోని ఓ భాగం) పనితీరు సరిగా లేక పరిపక్వ అండాల ఉత్పత్తిలో వైఫల్యం కలుగుతుంది. ఈ సమస్యలకు ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత.
స్కార్డ్‌ ఓవరీస్‌
సర్జరీలు లేదా రేడియేషన్‌ చికిత్స సందర్భాల్లో అండాశయానికి వాటిల్లే నష్టం వల్ల స్కార్డ్‌ ఓవరీస్‌ సమస్య ఉత్సన్నమవుతుంది.
ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌
కొంతమంది మహిళల్లో 40 ఏళ్ళ కంటే ముందుగానే రుతుచక్రం ఆగిపోవడాన్ని ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌ అంటారు. ఇటువంటివారిలో గర్భధారణ జరగడం కష్టం.
ఫోలిసియెల్‌ సమస్యలు
కుహరంలో అండం ఉత్పత్తి అయినప్పటికీ బయటకు రాకపోవడం లాంటి సమస్యలని ఫోలిసియెల్‌ సమస్యలంటారు.
బీజవాహికల సమస్యలు
మహిళల సంతానలేమి సమస్యల్లో 20 శాతం దాకా బీజవాహికలు సరిగా పని చేయకపోవడం వల్ల వస్తున్నాయి. క్షయ వంటి ఇన్‌ఫెక్షన్లు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్‌టిడి) లాంటి హైడ్రోసాల్పిన్‌ఎక్స్‌ (బీజవాహిక మూసుకుపోవడం, లోపల ద్రవం నిండిపోవడం), ట్యూబో-ఓవేరియన్‌ మాసెస్‌కు కారణమవుతాయి.
పొత్తికడుపు వ్యాధులు
అపెండిసైటిస్‌, కొలిటిస్‌ (పేగువాపు లాంటిది) లాంటివి పొత్తికడుపు కేవిటీని ఉబ్బిపోయేలా చేస్తాయి. ఇది బీజవాహికలపై ప్రభావాన్ని కనబరుస్తుంది. అవి మూసుకుపోయే అవకాశం ఉంటుంది.
గతంలో జరిగిన సర్జరీలు
తొడ, పొత్తి కడుపు భాగంలో గతంలో ఎప్పుడైనా, ఏవైనా సర్జరీలు జరిగి.. బీజవాహికలు మూసుకుపోయి, అండాలు వాటి గుండా ప్రయాణించలేకపోవడం వంటి సమస్యలు గర్భధారణ శక్తిని దెబ్బతీస్తాయి.
ఎక్టోపిక్‌ ప్రెగన్సీ
పిండం గర్భాశయంలో గాకుండా గర్భాశయం వెలుపల బీజవాహికలోనే పెరగడాన్ని ఎక్టోపిక్‌ ప్రెగన్సీ అంటారు. దీనివల్ల బీజవాహికలు దెబ్బతినడమే గాకుండా తల్లికి ప్రాణాపాయం ఉంటుంది.
కాంజెనిటల్‌ లోపాలు, బీజవాహికలు వాయడం వంటి కారణాలూ సంతాన సాఫల్యాన్ని దెబ్బతీస్తాయి.
సంతాన సాఫల్యం కోసం
మహిళల్లో సంతానలేమి ఉన్నట్టు నిర్ధారణైతే, దానికోసం వివిధ రకాలుగా చికిత్స అందించాలి.
– మొదట ఆ జంటకు కౌన్సెలింగ్‌ చేసి, ఆ తరువాత జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులను గురించి వివరించాలి.
– పోషకాహారం ఆవశ్యకతను వివరించడంతో పాటు అధికంగా బరువు ఉంటే బరువు తగ్గాల్సిందిగా సూచించాలి.
– ఆ తరువాత సైకోసెక్సువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి.
– అవసరాన్ని బట్టి ఎండోమెట్రియోసిస్‌, ఫైబ్రాయిడ్స్‌ (గర్భాశయ కంతులు) లాంటి పరీక్షలు జరిపించాలి.
– థైరాయిడ్‌ సమస్యలు, హైపర్‌ప్రొలాక్టినేమియా, పీసీఓఎస్‌ లాంటి ఎండోక్రానికల్‌ సమస్యలకు చికిత్స చేయాలి.
– ఒవులేషన్‌ ఇండక్షన్‌ (ఒక ఋతుచక్రంలో పలు అండాలు విడుదల అయ్యేందుకు దోహదం చేసే మందుల వాడకం) సరైన సమయంలో దంపతులు సంగమించడంపై సూచనలు ఇవ్వాలి.
– ఒవులేషన్‌ ఇండక్షన్‌ తర్వాత ఐయూఐ (కృత్రిమంగా వీర్య కణాలను రిప్రొడక్టివ్‌ ట్రాక్‌లోకి ప్రవేశపెట్టడం) ప్రక్రియ చేపట్టడం.
– కంట్రోల్డ్‌ ఓవరియన్‌ హైపర్‌స్టిమ్యులేషన్‌, అనంతరం ఐవీఎఫ్‌, ఐసీఎస్‌ఐ వంటి ప్రక్రియలు నిర్వహించడం.
– ఇన్విట్రో మెచ్యురేషన్‌ (ఐవీఎం)- డ్రగ్‌ ఫ్రీ ఐవీఎం, లేజర్‌ అసిస్టెడ్‌ హేచింగ్‌, ఊసైట్‌ విట్రిఫికేషన్‌
ఎంబ్రోయొ విట్రిఫికేషన్‌ వంటి విధానాలతో సంతానసాఫల్య చికిత్స నిర్వహిస్తారు.. జీవనశైలికి సంబంధించి దంపతులు చేసుకోవాల్సిన మార్పులను వైద్యులు సూచిస్తారు. గర్భధారణ సంబంధిత అంశాలపై అపోహలను తొలగిస్తారు. సహజ, కృత్రిమ గర్భధారణ రెండింటిలోనూ జీవనశైలి ఎంతో కీలకపాత్ర వహిస్తుంది.
కొత్త ఆశలు కల్పించే ఐవీఎఫ్‌
సంతానలేమితో నిరాశానిస్పృహలతో ఉన్నవారిలో కొత్త ఆశలు రేకెత్తించి వారిని సంతానసాఫల్యం కలిగించడంలో ఐవీఎఫ్‌ విధానం మెరుగైన ఫలితాలను అందిస్తోంది. శరీరం వెలుపల అండాలు వీర్యకణాలతో ఫలదీకరణం చెందడాన్ని ఐవీఎఫ్‌గా వ్యవహరిస్తారు. సంతాన లేమి చికిత్సలో దీన్ని మేజర్‌ ట్రీట్‌మెంట్‌ అనే చెప్పొచ్చు. అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ విధానాలు విఫలమైన సందర్భాల్లో ఈ ప్రక్రియను అనుసరిస్తారు. ఈ ప్రక్రియలో ఒవులేషన్‌ ప్రక్రియను హార్మోన్ల ద్వారా నియంత్రించడం, అండాశయాల నుంచి అండాలు తీసి ఫ్లూయిడ్‌ మీడియంలో వీర్యకణాలచే ఫలదీకరింపజేయడం ఉంటాయి. ఫలదీకరణం చెందిన అండాన్ని (సంయుక్త బీజాన్ని) మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. విట్రో అంటే లాటిన్‌ భాషలో గాజు అని అర్థం. ఈ ప్రక్రియను చేపట్టిన తొలిదశలో ఈ ప్రయోగాలు గాజు బీకర్లు, టెస్ట్‌ట్యూబ్‌లలో జరిగేవి. ప్రస్తుతం విట్రో అనే పదాన్ని శరీర కణజాలం వెలుపల జరిగే అన్ని ప్రక్రియలకు ఉపయోగిస్తున్నారు. నేడు విట్రో ఫెర్టిలైజేషన్‌ను శాలోవర్‌ కంటైనర్లలో చేస్తున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *