[spt-posts-ticker]

ఆరోగ్య విపత్తు ప్రకటించిన కేరళ

రాష్ట్రంలో మరో వ్యక్తికి సోకిన కరోనా
ఈ వైరస్‌పై అమెరికా భయాన్ని పెంచుతోంది
ప్రయాణాలను నిషేధించడంపై ధ్వజమెత్తిన చైనా
ఒక్క రోజులోనే 57 మంది మృతి

బీజింగ్‌, దిల్లీ, తిరువనంతపురం: కేరళలో మరో వ్యక్తికి కరోనా సోకింది. వుహాన్‌ విశ్వవిద్యాలయం నుంచి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో భారత్‌లో (కేరళలో) మొత్తం ముగ్గురు ఈ వైరస్‌ బారిన పడినట్లయింది. మరికొందరు అనుమానితుల్ని ఆస్పత్రులకు తరలించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ వైరస్‌ వ్యాప్తిని ‘రాష్ట్ర విపత్తు’గా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వుహాన్‌ నుంచి తిరిగి వచ్చిన భారతీయుల్లో దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఐదుగురిని దిల్లీలోని సైనిక ఆస్పత్రిలో చేర్పించారు. చైనాకు ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరోసారి సూచించింది. మరోవైపు చైనాలో మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ వైరస్‌ బారిన పడి ఒక్క ఆదివారమే ఆ దేశంలో 57 మంది మరణించారు.  వీరిలో 56 మంది హుబెయ్‌ ప్రావిన్సుకు చెందినవారే. కొత్త వైరస్‌ వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత ఇంతమంది ఒకరోజులో చనిపోవడం ఇదే ప్రథమం. దీంతో చైనాలో మృతుల సంఖ్య 361కి పెరిగింది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా వాడే మాస్కులకు చైనాలో కొరత ఏర్పడింది. వీటితో పాటు వైద్యపరమైన కొన్ని పరికరాలూ సరిపోవడం లేదు.

ప్రయాణాలపై నిషేధాలు విధించడం, దౌత్య సిబ్బందిని తరలించడం ద్వారా కరోనా కొత్తరకం వైరస్‌ విషయంలో భయాందోళనలను అమెరికా వ్యాపింపజేస్తోందని చైనా ఆరోపించింది. ఈ వైరస్‌ను అదుపు చేయడంలో అమెరికా నుంచి చెప్పుకోదగ్గ సాయమేదీ తమకు అందలేదని విమర్శించింది. వుహాన్‌ నుంచి కాన్సులేట్‌ సిబ్బందిని ఉపసంహరించుకున్న తొలి దేశంగా నిలవడంతో పాటు చైనా పౌరులు అమెరికాకు వెళ్లడంపై ఆంక్షలు విధించి మరింతగా భయాన్ని పెంచిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హుయా చున్‌యింగ్‌ సోమవారం ఆన్‌లైన్‌ విధానంలో తొలిసారిగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పారు.

గబ్బిలాల నుంచి వచ్చిందా?
కరోనా కొత్త వైరస్‌ గబ్బిలాల నుంచి వచ్చి ఉంటుందని రెండు తాజా పరిశోధనలు చెబుతున్నాయి. వీటి సారాంశం సోమవారం ‘నేచర్‌’ జర్నల్‌లో ప్రచురితమయింది. గతంలో చైనాలో గబ్బిలాల ద్వారా వ్యాపించిన సార్స్‌లో ఉన్న వైరస్‌కు ప్రస్తుత వైరస్‌కు 96% మేర పోలికలు ఉన్నాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి. రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో జన్యు క్రమాన్ని విశ్లేషిస్తే ఇది బయటపడిందని పరిశోధకులు తెలిపారు. విమాన ప్రయాణాల ద్వారా ఇది త్వరగా ఇతరులకు వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు.

తప్పుడు సమాచార వ్యాప్తి కట్టడికి..
చైనాలో బయటపడిన కరోనా కొత్త తరహా వైరస్‌ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించేవారికి వాస్తవాలు తెలిసేలా చూసేందుకు గూగుల్‌తో కలిసి డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నిస్తోంది. అవాస్తవాలు, వదంతులు వ్యాప్తి చెందకుండా ట్విటర్‌, ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌ వంటి సామాజిక మాధ్యమాలు కూడా చర్యలు చేపట్టాయని ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ సోమవారం జెనీవాలో చెప్పారు. ఈ సంస్థ కార్యనిర్వాహక మండలి మంగళవారం ప్రత్యేకంగా సాంకేతికపరమైన సదస్సును కరోనాపై నిర్వహించనుంది.


బ్రిటన్‌ విరాళం రూ.185 కోట్లు

ప్రాణాంతక కరోనా వైరస్‌ నుంచి కాపాడే టీకాను ఆరు నుంచి ఎనిమిది వారాల్లో సిద్ధం చేయడానికి బ్రిటన్‌ ప్రభుత్వం 2 కోట్ల పౌండ్లు (సుమారు రూ.185 కోట్లు) విరాళంగా ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల సాయంతో ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.


ఔషధాల అభివృద్ధిపై పని చేస్తున్నాం : డబ్ల్యూహెచ్‌వో

కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా సలహాలను జారీ చేసింది. ముఖ్యాంశాలివీ..
* కరోనా వైరస్‌పై యాంటీబయాటిక్స్‌ పనిచేయవు. ఇవి బ్యాక్టీరియాపైనే పనిచేస్తాయి. అయితే కరోనా సోకి ఆసుపత్రి పాలైన సందర్భంలో యాంటీబయాటిక్స్‌ ఇవ్వవచ్చు. ఈ రోగుల్లో బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణం.
* ప్రస్తుతం కరోనా వైరస్‌ నివారణకు, చికిత్సకు నిర్దిష్టంగా ఎలాంటి ఔషధం లేదు. వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనానికి వైద్య సాయం పొందాలి. చికిత్స మార్గాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి.  పరిశోధనలను వేగవంతం చేసేందుకు భాగస్వామ్య పక్షాలతో కలిసి డబ్లూహెచ్‌వో పనిచేస్తోంది.
* న్యూమోకోకల్‌, హీమోఫిలస్‌ ఇన్‌ఫ్లూయెంజా టైప్‌ బి (హెచ్‌ఐబీ) వంటి న్యుమోనియా సంబంధ టీకాలతో కరోనా వైరస్‌ నుంచి రక్షణ లభించదు. దీనికి ప్రత్యేకంగా మరో టీకా అవసరం.
* అన్ని వయసుల వారికీ కరోనా ముప్పు ఉంది. అయితే వృద్ధులకు, ఆస్థమా, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారికి ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువ.
* పెంపుడు జంతువుల్లోకి కరోనా వ్యాప్తి చెందినట్లు ఇంకా ఎక్కడా ఆధారాలు లభించలేదు.
* పెంపుడు జంతువులను తాకిన సందర్భంలో సబ్బు, నీరుతో చేతులు కడుక్కోవాలి. తద్వారా వాటి నుంచి మానవుల్లోకి వచ్చే ఈకోలీ, సాల్మోనెల్లా వంటి కొన్ని రకాల బ్యాక్టీరియా నుంచి రక్షణ పొందొచ్చు.


కరోనా కొత్త కళ ఇదే!

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వైరస్‌ చిత్రం. అమెరికాలోని ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ దీనిని విడుదల చేసింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *