[spt-posts-ticker]

ఆహారం.. అనారోగ్యం

ఖమ్మం (ఆరోగ్యజ్యోతి) ఖమ్మం నగరంలో ఓ ప్రముఖ భోజనం హోటల్‌లో నాసిరకం వంట నూనె వాడుతున్నారని ఫిర్యాదులు అందడంతో పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపారు. పరీక్షల్లో నిరూపణ కావడంతో జిల్లాస్థాయి కోర్టులో శిక్ష ఖరారయ్యింది. సదరు యజమాని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కేసు కొనసాగుతూనే ఉంది.


కొంతమంది యువకులు ఖమ్మం స్టేషన్‌రోడ్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లి చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేశారు. దానిని తీసుకొచ్చిన అనంతరం వారికి అనుమానం రావడంతో ఆహార తనిఖీ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయనతోపాటు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య అధికారులు అక్కడికి చేరుకొని అపరిశుభ్ర వాతావరణంలో వంటకాలు చేస్తున్నారని గుర్తించి రూ.10వేలు జరిమానా విధించారు.

ల్తీ ఆహారం ప్రజారోగ్యాన్ని కకావికలం చేస్తోంది. రెస్టారెంట్లు, హోటళ్లలో నాసిరకం తిండి వినియోగదారుల్ని నానా అవస్థలకు గురి చేస్తుంది. నియంత్రించాల్సిన తనిఖీ అధికారుల్లో నిస్తేజం అలముకొంది. నాణ్యత లోపాలపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా.. చర్యలు నామమాత్రమే అవుతున్నాయి. వారు సకాలంలో రాకపోవడం, వచ్చినా మొక్కుబడి తనిఖీలు, నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపినా నివేదికల్లో జాప్యం, సిబ్బంది కొరత అక్రమార్కులకు వరంగా పరిణమించగా వినియోగదారులకు పెనుముప్పుగా మారింది.

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని పలు పట్టణాల్లో హోటళ్ల నిర్వహణ లోపాలపై బాధితులు ఎవరో ఒకరు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేగానీ అధికారులు స్పందించని దుస్థితి నెలకొంది. ఆహార తనిఖీ శాఖలో సిబ్బంది కొరత పట్టిపీడిస్తుండటంతో కొందరు హోటళ్ల నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలకు పాతరేస్తున్నారు. నాసిరకం నిత్యావసరాలు, కాలం చెల్లిన ఆహార పదార్థాలతో వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

నిబంధనలు తూచ్‌

ప్రతి రెస్టారెంట్‌, హోటళ్ల దగ్గర ఆహార తనిఖీ అధికారి ఫోన్‌ నంబరు అందుబాటులో ఉండాలి. అది కన్పించదు. ఫోన్‌ చేసిన వెంటనే ఉన్న ఒక్క ఆహార తనిఖీ అధికారి వచ్చే అవకాశం లేదు. ఇది ఆహార తనిఖీశాఖ దయనీయ స్థితి. ఖమ్మం నగరపాలక ప్రజారోగ్య విభాగంలోనూ ఆహార తనిఖీ అధికారి కార్యాలయంలో సిబ్బందిని వెతుక్కోవాల్సిందే. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా ఆ తర్వాత పెద్దగా పట్టించుకోవడంలేదు. దీంతో నాసిరకం నూనెలు, నిత్యావసర వస్తువులతో ఆహారం పదార్థాలు తయారు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. మురుగు గుంతల పక్కనే ఆహార పదార్థాలను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. ఇది ప్రజారోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు పేర్కొంటున్నారు.

పరీక్షలు లేకుండానే జీవాల కోతలు

ఖమ్మం నగరపాలకంలో సుమారు 120వరకు మాంసపు దుకాణాలు ఉన్నాయి. వీటిలో ప్రతిరోజు 100 నుంచి 500 వరకు జీవాలను కోస్తుంటారు. పరీక్షలు చేసిన అనంతరం పశువైద్యుని అనుమతితో వాటిని కోసి మాంసం అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. కాని అలాంటి చర్యలేవి తీసుకున్న దాఖలాలు లేవు. ప్రధానంగా నగరపాలకంలో అటువంటి వ్యవస్థేది లేదంటే ఆశ్చర్యపోకతప్పదు. ఇప్పటి వరకు ఆధునిక కబేళా నిర్మాణాన్ని చేపట్టేందుకు, మాంసాహార మార్కెట్‌ ఏర్పాటుచేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం నగరపాలకసంస్థ పాలకవర్గ పనితీరును స్పష్టంచేస్తోంది. ఇక మాంసం దుకాణాల వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే అమ్మకాలు చేస్తున్నా చూస్తు ఊరుకోవడం మినహా ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

జిల్లాకు ఒక్కరే అధికారి

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒక్కో ఆహార తనిఖీ అధికారి మాత్రమే ఉన్నారు. ప్రతి జిల్లాకు ఇద్దరేసి ఉండాలి. ప్రతి నెలా వీరు 12 నమూనాలను సేకరించాల్సి ఉంటుంది. వాటిని హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపిన అనంతరం అక్కడ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేసులు నమోదు చేస్తారు. అయితే సిబ్బంది కొరత కారణంగా లక్ష్యాల మేరకు నమూనాలు సేకరించడం, ఒకటి రెండు కేసులు నమోదైతే వాటికి న్యాయస్థానాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం వరకే పరిమితమవుతోంది. ఎక్కడైనా ఆహార కల్తీ జరిగినట్టు ఫిర్యాదు వస్తే వెంటనే అక్కడికి వెళ్లి వాటి నమూనాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.

నకిలీ నూనెలను స్వాధీనం చేసుకుంటున్న ఆహార తనిఖీ సిబ్బంది (దాచినచిత్రం)

రూ. కోట్లల్లో వ్యాపారం

ఉమ్మడి జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు కలిపి 530కుపైగా ఉన్నప్పటికీ కేవలం వందకు మించి ఆహార తనిఖీశాఖ నుంచి లైసెన్స్‌లు పొందలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్ఛు హోటళ్లు, రెస్టారెంట్లు శుభ్రమైన, నాణ్యమైన పదార్థాలను ప్రజలకు అందించాలి. జనం రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉన్న హోటళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. రూ.కోట్లల్లో వ్యాపారం జరుగుతున్నా ఆయా పుర, నగరపాలకాల ప్రజారోగ్య విభాగం, ఆహార తనిఖీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

అయిదు కేసులు నమోదు: కిరణ్‌కుమార్‌, ఖమ్మం జిల్లా ఆహార తనిఖీ అధికారి

ప్రతినెల ఆరు నమూనాలు సేకరిస్తాం. గతేడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌కు రసాయన పరీక్షల నిమిత్తం పంపిన అనంతరం వచ్చిన నివేదికల ఆధారంగా అయిదు కేసులు నమోదు చేశాం.

నివేదికలు రావాలి: వేణుగోపాల్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆహార తనిఖీ అధికారి

భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 15 నమూనాలు సేకరించాం. నివేదికలను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపాం. నివేదికలు వచ్చిన అనంతరం కేసులు నమోదు చేస్తాం.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *