[spt-posts-ticker]

ఈఎస్‌ఐ ఆసుపత్రిలో నిలిచిన సేవలు

వారం రోజులుగా అందుబాటులో లేని వైద్యులు

జ్యోతినగర్‌: కార్మిక రాజ్య బీమా(ఈఎస్‌ఐ) ఉద్యోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఈ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మందుల కుంభకోణం జరిగిన దరిమిలా సాధారణ చికిత్స కూడా అందని పరిస్థితి నెలకొంది. కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించడానికి పరిశ్రమల యాజమాన్యాలు ప్రతి నెలా వారి వేతనాల నుంచి భాగస్వామ్య రుసుము కింద కోత విధించి ఈఎస్‌ఐకి జమ చేస్తున్నాయి. దీంతో అందులో సభ్యత్వం ఉన్న కార్మికులు, వారి కుటుంబాలు చికిత్స పొందుతున్నాయి. కాగా కొద్ది రోజులుగా వైద్యులు లేక కార్మిక వైద్యం వెలవెలబోతోంది.

రామగుండం ఎన్టీపీసీ టీటీఎస్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఏడేళ్లుగా ఈ ప్రాంతానికి చెందిన ఒప్పంద కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేవలం కేశోరాం పరిశ్రమ ఆవరణలోనే డిస్పెన్సరీ ఉంది. దీనికి తోడు ఎన్టీపీసీ టీటీఎస్‌లో ఆస్పత్రి ఉంది. వైద్యం కోసం వచ్చే వారికి చికిత్స చేస్తూ అవసరమైన మందులు అందిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఈఎస్‌ఐ రాష్ట్ర శాఖలో ఏర్పడిన అవినీతితో రావాల్సిన ఔషధాలు ఆస్పత్రులకు చేరడం లేదు. దీంతో వైద్యుల సూచనల మేరకు అందుబాటులో ఉన్న మందులు అందజేశారు. కాగా ఇందులో మధుమేహం, హృద్రోగం ఇతర వ్యాధులకు సంబంధించి అత్యవసర మందులు సరఫరా కాకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాలు బయట కొనుగోలు చేసుకోవాల్సి వచ్చేది.

ఉన్నతాధికారులు లేక  పర్యవేక్షణ కరవు
ఎన్టీపీసీ టీటీఎస్‌ ఆస్పత్రిలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైద్యులను రాష్ట్ర ఈఎస్‌ఐ సంస్థ ఈ నెల 13 నుంచి వారి పాత స్థానాలకు పంపించింది. దీంతో వారం రోజులుగా రోగులను పరీక్షించే వారు లేక వైద్యం అందడం లేదు. ఆస్పత్రికి వచ్చే రోగులను చూసే వారు లేక, ఎవరూ మందులు ఇవ్వడం లేదు. వైద్య సేవలతో పాటు అత్యవసర వైద్యం కోసం పెద్ద ఆస్పత్రులకు రెఫర్‌ చేయలేకపోతున్నారు. మెడికల్‌, లీవ్‌ బెనిఫిట్లు, ల్యాబ్‌ పరీక్షలు కూడా జరగడం లేదు. విధుల్లో ఉన్న ఆరుగురు సిబ్బందికి ఉన్నతాధికారులు(వైద్యులు) లేకపోవడంతో విధులు కూడా నిర్వర్తించలేని పరిస్థితి నెలకొంది. పై అధికారులు లేక ఎలాంటి విధులు చేయలేకపోతున్నామని ఆస్పత్రి జూనియర్‌ అసిస్టెంట్‌ మమత వివరణ ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యులు, బాధ్యులను వెంటనే నియమించి సేవలు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

ఈ ఆసుపత్రిలో సేవలు ఎవరెవరికి?
సింగరేణి అనుబంధ పరిశ్రమలు, ఎన్టీపీసీ, రామగుండం ఎరువుల పరిశ్రమ, కేశోరాం సిమెంట్‌ పరిశ్రమ, ప్రైవేటు విద్యా సంస్థలు, రాజీవ్‌ రహదారి నిర్వహణ సంస్థ(హెచ్‌కేఆర్‌), సినిమాహాళ్లు, ఇతర ప్రైవేటు సంస్థల కార్మికులకు రామగుండంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రి సేవలు అందించాల్సి ఉంది.

సభ్యత్వం తీసుకున్నా అందని వైద్యం: చిలుక శంకర్‌, కార్మిక నాయకుడు
ఈఎస్‌ఐకి ఎన్టీపీసీ ప్రాంతం నుంచి ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా సభ్యత్వం వెళ్తుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ ప్రాంతంలోనే ఎక్కువ మంది ఒప్పంద కార్మికులున్నారు. ఉన్న వైద్యులను ఇతర ప్రాంతాలకు పంపించటంతో ఇక్కడ చికిత్స చేసే వారు లేరు. మందులు ఇచ్చే అధికారం ఎవరికీ లేదు. సభ్యత్వం తీసుకున్నప్పుడు వైద్యం అందించి సరైన మందులు ఇవ్వాలి. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

రోజూ వచ్చి నిరాశగా వెళ్తున్నా: మల్లయ్య, ఎన్టీపీసీ ఒప్పంద కార్మికుడు
నెల రోజులుగా అనారోగ్య కారణంపై సెలవులో ఉన్నా. మూడు రోజులుగా ఇక్కడికి వస్తున్నా. డాక్టర్లు లేరని చెబుతున్నారు. రోజూ వచ్చి వెళ్తున్నా. సమాధానం చెప్పే వారు కూడా లేరు. రోగం వస్తే చూసే దిక్కు లేదు. కార్మికులను ఆదుకొనే వారే కనిపించడం లేదు. కార్మికులకు వైద్యం, ఇతర సౌకర్యాలు అందించే ఏర్పాట్లు చేయాలి. పెద్ద ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇస్తున్న నాయకులు ఇప్పడైనా స్పందించాలి.

ప్రజాప్రతినిధులు స్పందించాలి: మద్దెల దినేష్‌, సీపీఐ నాయకులు
ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వైద్యుల కొరతపై ప్రజాప్రతినిధులు స్పందించాలి. ఎంపీ, ఎమ్మెల్యేలు వెంటనే ఈఎస్‌ఐ సేవలను కొనసాగించేలా దృష్టి పెట్టాలి. ఈ ప్రాంతంలో 15 వేల మంది సేవలు పొందుతున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక వైద్యం కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రికి వస్తుంటారు. ఇక్కడికొస్తే చూసే వారు లేరు, మందులు ఇచ్చే దిక్కు లేదు. ఇక్కడికి రావటం కన్నా ప్రైవేటుగా వైద్యం పొందటం మేలని భావిస్తున్నారు. ఈ అపోహను తొలగించాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే వైద్యులను నియమించేలా చర్యలు తీసుకోవాలి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *