[spt-posts-ticker]

ఈ వైద్యులు గుళ్లకు జీవంపోస్తున్నారు

గుడి గంటలు మోగిన వేళ…

ఆలయం… ఓ నిర్మాణం కాదు. ఓ సంస్కృతి… ఓ సనాతన భావజాలం. దానిని పరిరక్షించుకోవడం జాతి ధర్మం. సాధారణంగా ఈ ధర్మాన్ని ఏ మఠాలో, మఠాధిపతులో నిర్వర్తించడం మనం చూసేదే! కానీ ఓ ఇద్దరు వైద్యులు ఆ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు.  తమదైన శైలిలో ఆలయాలకు ప్రాణం పోస్తున్నారు…
వరంగల్‌కు చెందిన వైద్యురాలు శ్రీనాగి బి.రావ్‌, నిజామాబాద్‌ వాసి శశిరెడ్డి (రోష్ని కౌన్సెలింగ్‌ సెంటర్‌ నిర్వాహకురాలు) ఇద్దరూ మంచి స్నేహితులు. ఆధ్యాత్మిక భావాలున్నవారు. తీరిక లేని వృత్తి జీవితాల్లో ఏ కాస్త విరామం లభించినా దేవాలయాలను దర్శించి వస్తుంటారు. ఓ సందర్భంలో శ్రీనాగి బెంగళూరులో ‘గుడియ సంభ్రమ’ కార్యక్రమాన్ని చూశారు. ఆలయాన్ని నేపథ్యంగా చేసుకుని.. ఆ ఆవరణలోనే ఎంచుకున్న భారతీయ కళారూపాన్ని ప్రదర్శించడమే ఈ కార్యక్రమం. అది ఆమెకు చాలా నచ్చి, శశిరెడ్డితో తన ఆనందాన్ని పంచుకున్నారు. అది శశికీ నచ్చింది. తెలుగునేలపై ఇలాంటి కార్యక్రమాన్ని మనమూ చేస్తే బాగుంటుందని ఆమె శ్రీనాగికి సలహా ఇచ్చారు. ‘కళలు ఆలయాల్లోనే పుట్టాయి. ఆంధ్ర, తెలంగాణలో ఎన్నో గుళ్లున్నాయి. ఆలయాల్లో పుట్టిన వాటిని మళ్లీ ఆలయాల్లోకి తీసుకెళ్తే చాలా బాగుంటుంది’ అన్న మిత్రురాలి మాటలు శ్రీనాగికి సబబుగా అనిపించాయి. అలా వారి ఆలోచనల్లోంచి 2016లో ‘పరంపర ఫౌండేషన్‌’ పురుడు పోసుకుంది. ఈ సంస్థ ద్వారా ప్రాచీన దేవాలయాలను గుర్తించి, వాటి ఆవరణల్లో నాట్య, సంగీత, నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు ఇద్దరు మిత్రులు. దీని ద్వారా ఆయా ఆలయాలకు పూర్వ వైభవాన్ని తేవడమే కాకుండా జాతి సాంస్కృతిక ఔన్నత్యాన్ని ఈతరానికి తెలియజేస్తున్నారు.

 

పాత గుడికి కొత్త గుర్తింపు…
పరంపర ఫౌండేషన్‌ మొదటగా క్రీ.శ.13వ శతాబ్దం నాటి శ్రీరామచంద్ర స్వామి ఆలయాన్ని ఎంచుకుంది. ఇది హైదరాబాద్‌ నగర శివార్లలోని శంషాబాద్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో అమ్మపల్లిలో ఉంది. వేంగి రాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం ఘనత స్థానికులకూ అంతగా తెలియదు. ‘పరంపర’ సంస్థ అక్కడ కూచిపూడి నృత్య ప్రదర్శనతో పాటు ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో ఆ గుడి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో అక్కడి దేవాలయ ఆదాయం నాలుగు వేల రూపాయల్లోపే ఉండేది. సీతారామ కల్యాణం నాడు కూడా భక్తుల సంఖ్య మామూలుగానే ఉండేది. ‘పరంపర’ కార్యక్రమం తర్వాత హైదరాబాద్‌ నగరవాసులూ ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఇక్కడే పిల్లల పెళ్లిళ్లు, ఇతర వేడుకలు చేసుకుంటున్నారు. అలా ఆ ఆలయానికి భక్తుల తాకిడితోపాటు ఆదాయమూ నాలుగు లక్షల రూపాయలకు పెరిగింది.

 

ఏటా ఈ గుడి సంబరాలను సంక్రాంతి, శివరాత్రి పర్వదినాల మధ్య కాలంలోనే నిర్వహించడం ‘పరంపర’ ఆనవాయితీ. కార్యక్రమాలన్నీ గుడి ఆవరణల్లో, ఆరుబయట జరుగుతాయి కాబట్టి ఈ సమయమే అనుకూలమైందన్నది నిర్వాహకుల ఆలోచన. చారిత్రకంగా ప్రసిద్ధమైన ఆలయాలను ఎంచుకుని.. వాటి నిర్వాహకులకు తమ సంస్థ ఉద్దేశాలను వివరించి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ ప్రదర్శనలకు స్థానికులతోపాటు సమీప పట్టణ ప్రాంతాల నుంచీ వీక్షకులు ఎక్కువగానే వస్తుంటారు.  ఇప్పటివరకు అలా చేసిన మొత్తం కార్యక్రమాలను సంస్థ సొంత ఖర్చుతోనే నిర్వహించింది. మనసుకు నచ్చిన విషయం కాబట్టి దానికోసం సమయాన్ని, డబ్బుని వెచ్చిస్తున్నాం అంటారు శ్రీనాగి, శశిరెడ్డి. ‘‘రకరకాల పోకడల మధ్య మరుగున పడిపోతున్న మన సంప్రదాయ కళల్ని మనం కాపాడుకోవాలి. జాతి వారసత్వ సంపదలైన ఆలయాలనూ రక్షించుకోవాలి. మా సంస్థ ద్వారా ఆ బాధ్యతను నిర్వర్తించడం చాలా తృప్తి కలిగిస్తోంది’’ అనే ఈ మిత్రురాళ్ల ఆలోచన, ఆచరణ రెండూ ప్రత్యేకమైనవే కదూ!
– శాంతి జలసూత్రం


ఈ నాలుగేళ్లలో ‘పరంపర’ సంస్థ మియాపూర్‌ ధర్మపురి క్షేత్రం, మంచిరేవుల వీరభద్ర స్వామి దేవాలయం, నిజామాబాద్‌ ఖిల్లా రామాలయం, వరంగల్‌ భద్రకాళి ఆలయం, వేయిస్తంభాల గుడి, మహబూబాబాద్‌, విజయవాడ,  బాపట్ల, నెల్లూరు.. ఇలా అనేక ప్రాంతాల్లోన్ని విశిష్ట ఆలయాల్లో ఈ సంబరాలను నిర్వహించింది. తెలుగింటి కూచిపూడితో పాటు కథక్‌, భరతనాట్యం, ఒడిస్సీ, చావ్‌, మహిర్బంచ్‌, కూడి ఎట్టం వంటి నృత్య సంప్రదాయాల్ని ప్రదర్శింపజేసింది. త్వరలో మళ్లీ మియాపూర్‌ ధర్మపురి క్షేత్రంలో కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *