[spt-posts-ticker]

ఏడాదికి 10 రోజులు ప్రపంచమంతా లాక్‌డౌన్‌ చేద్దాం

  • కాలుష్యాన్ని తగ్గిద్దాం.. భూమిని కాపాడుకుందాం
  • ట్విట్టర్‌ లైవ్‌లో మంత్రి కేటీఆర్‌ వినూత్న ప్రతిపాదన

హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి): ప్రపంచంలో అనేకదేశాల్లో ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో వాతావరణ కాలుష్యం, భూతాపంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రపంచమంతా ఒప్పుకొంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పదిరోజులపాటు పరిమితస్థాయిలో లాక్‌డౌన్‌ ప్రకటిస్తే బాగుంటుందని వినూత్న ప్రతిపాదన చేశారు. కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, అయితే దీనిపై సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాక దేశాలన్నీ వైద్య,మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఐటీ రంగం తర్వాత లైఫ్‌ సైన్సెస్‌ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9.30 వరకు ట్విట్టర్‌లో ఆస్క్‌కేటీఆర్‌ ట్యాగ్‌లో అందుబాటులోఉన్న ఆయన పలువురి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రస్తుత సంక్షోభం తర్వాత ప్రభుత్వాలు తమ ప్రాధాన్యాలను మార్చుకొని వైద్యరంగానికి మరింత ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. అన్ని ప్రభుత్వాలకు ఇది కనువిప్పు లాంటిదని.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయాన్ని గుర్తించాయని అన్నారు. కరోనా చికిత్సలో ప్రపంచంలో ఎక్కడ మంచివిధానం ఉన్నా.. దానిని రాష్ట్రంలో అమలుచేస్తామని తెలిపారు. వైరస్‌ వ్యాప్తిచెందుతున్న కొన్ని హాట్‌స్పాట్లను గుర్తించామని, అలాంటిచోట్ల సామూహిక కరోనాటెస్టులతో ఫలితం ఉండే అవకాశం ఉన్నదని, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. కరోనా సంక్షోభం వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యం వంటి కీలకమైన అంశాలపై అందరికీ గుణపాఠం నేర్పిందని, దీంతోపాటు అవసరమైన మేరకు వైద్యసదుపాయాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చేలా చేసిందని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి కట్టడికి కృషిచేస్తున్నవారి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం అందరికీ తెలిసిందన్నారు. వైరస్‌ కట్టడి కోసం పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది, పోలీసులు, ఇతరరంగాలకు చెందిన ప్రతిఒక్కరిపై ప్రజలకు ప్రత్యేకంగా గౌరవభావం ఏర్పడిందని తెలిపారు. సంక్షోభం సమయంలో సహాయం ఎంత చిన్నదైనా, ఎలాంటిమార్గంలో అయినా చేయడం మంచిదని , ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకురావాలని కోరారు. అంగన్‌వాడీ వర్కర్లు, టీచర్లు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.

లాక్‌డౌన్‌తో స్వీయక్రమశిక్షణ

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ దొరికేవరకు దేశాల మధ్య రాకపోకలను సంపూర్ణంగా నిషేధించడం సాధ్యం కాకపోవచ్చని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ ద్వారా ప్రజల్లో స్వీయక్రమశిక్షణ ఏర్పడిందని, దీన్ని భవిష్యత్‌లోనూ కొనసాగించాలని కోరారు. విద్యార్థుల పరీక్షలపై ఆందోళన చెందుతున్నారని, అయితే ప్రస్తుతం ఉన్నది అంతకంటే పెద్ద పరీక్షా సమయమని అన్నారు. తల్లిదండ్రులు కొంత ఓపికపట్టాలని.. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులు డిజిటల్‌ తరగతులపై దృష్టిపెట్టాలని సూచించారు. లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత పుట్టినపాపలకు ఇంటివద్దే వ్యాక్సిన్‌ వేసే అంశాన్ని గురువారం ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.

అన్ని రకాల పరిశ్రమలపై ప్రభావం

కరోనా ప్రభావం ఐటీ సహా అన్నిరకాల పరిశ్రమలపై పడుతుందని కేటీఆర్‌ అన్నారు. ఎమ్మెస్‌ఎంఈ పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు తెలిపారు. తన టీంతోపాటు వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. సంక్షోభ సమయంలో సోషల్‌ మీడియా ద్వారా ప్రజలతో కనెక్ట్‌ అయ్యేందుకు అవకాశం కలుగుతున్నదని అన్నారు. ఎక్కువ సమయం సోషల్‌ మీడియాలో అందుబాటులో ఉండటం ద్వారా ఏమైనా ఇబ్బంది ఎదురవుతున్నదా? అని ప్రశ్నించగా.. నిద్రకు సమయం ఉండటంలేదని కేటీఆర్‌ సమాధానమిచ్చారు. లాక్‌డౌన్‌ నాటినుంచి మంత్రి కేటీఆర్‌, ఆయన కార్యాలయం స్పందిస్తున్న తీరుపై పలువురు అభినందనలు తెలిపారు. సినిమాలో నటించాలంటూ ఎవరూ తనను అడగలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్‌ చెప్పారు.

ఈ సమయంలో రాజకీయాలకు అవకాశం లేదు

ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్యోగాన్ని రియలిస్టిక్‌ అప్రోచ్‌లో చేయడం ద్వారానే ఇతరులకు సహాయపడుగలుగుతున్నానని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీవితంతోపాటు రాజకీయంగా తనకున్న పరిమితులేమిటో తెలుసునని.. అయితే ప్రస్తుతం అధికారం వల్ల ఎక్కువమందికి సహాయపడుతున్నానని వివరించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో రాజకీయాలకు అవకాశం లేదని పేర్కొన్నారు. మనసుకు నచ్చిన పనులు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చునని తెలిపారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *