[spt-posts-ticker]

కరోనా కల్లోలం.. ఇది చైనా పనేనంటున్న సాక్ష్యాలు..

 

న్యూఢిల్లీ: మూడు నెలలు గడిచేలోపే కరోనా వైరస్ చైనాను దాటుకుని 170 దేశాల్లోకి వ్యాప్తిచెందింది. భారత దేశంలో కూడా కల్లోలం రేపుతోంది. హాంగ్ కాంగ్ వైద్య నిపుణుడు ప్రొఫెసర్ గాబ్రియేల్ తెంగ్ కథనం ప్రకారం.. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతే ప్రపంచ జనాభాలో 60% మంది ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం  ఉంది. దీని కారణంగా 4.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోవచ్చు. ఈ ప్రాణాంతక మహమ్మారిపై ప్రారంభంలోనే ప్రపంచానికి చెప్పకుండా దాచిపెట్టి, నిర్లక్ష్యంగా వ్యవహరించడం… తప్పుడు సమాచారం చెప్పడం ద్వారా ఇప్పుడు చైనా మొత్తం ప్రపంచ మానవాళినే ప్రమాదంలోకి నెట్టిందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆ దేశం వెలగబెట్టిన పలు నిర్వాకాలను సాక్ష్యాలుగా చూపెడుతూ… తాజా ఉత్పాతంపై విశ్లేషకులు చైనాని ఎండగడుతున్నారు. గత డెబ్బై ఏళ్లుగా చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) చేజేతులా తన దేశాన్ని అనేక విషాదాల కిందికి నెట్టిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు. 1959 నుంచి 1961 మధ్య లక్షలాది మందిని బలితీసుకున్న మహా కరువుతో పాటు… సాంస్కృతిక విప్లవం, టియానన్మెన్ స్క్వేర్ విషాదం, ఫనున్ గాంగ్ హింస, టిబెట్‌, జింజియాంగ్, హాంకాంగ్‌‌ సహా పలు ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలు.. ఇలాంటి పలు దారుణాలు ఇందులో ప్రధానమైనవి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా సీసీపీ చెప్పేవన్నీ పచ్చి మోసాలు, అబద్దాలేనని పలుమార్లు రుజువైంది.

గతంతో సీసీపీ చెప్పిన అబద్దాలు, చేసిన మోసాల చిట్టా పెద్దగానే ఉంది..

1976లో తంగ్సాన్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించబోతున్నదంటూ శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినప్పటికీ రాజకీయ కారణాలతో ఈ విషయాన్ని తొక్కిపెట్టారు. దీంతో 7.8 తీవ్రతతో భూకంపం రావడంతో 2.4 లక్షల మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారు. 2003లో సార్స్ వ్యాధి పడగవిప్పినప్పుడు, 2008లో సిచుయాన్ భూకంపం సమయంలోనూ చైనా ప్రభుత్వం ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించింది. ప్రత్యేకించి ఫలున్ గాంగ్ హింస జరిగినప్పుడు చైనా మరింత అమానవీయంగా వ్యవహరించింది. వాస్తవానికి ఆరోగ్య పరంగా గానీ, ఆథ్యాత్మిక పరంగా గానీ ఫలున్ గాంగ్ జీవన విధానం విశేష ప్రఖ్యాతి చెందింది. దీంతో 1999 నాటికి 7 కోట్ల మంది దీన్ని అనుసరించడం మొదలు పెట్టారు. అప్పట్లో సీసీపీ సభ్యుల సంఖ్య 6 కోట్లే. అంటే ఫలున్‌ గాంగ్‌ను అనుసరించే వారి సంఖ్య సీసీపీ కంటే కోటికి పైగానే ఉండేది. ఫలున్ గాంగ్ శాంతియుత విధానాన్నే పాటిస్తున్నప్పటికీ.. ఇది తమ సార్వభౌమత్వానికి ప్రమాదకరమంటూ 1999 జులై 20న నాటి  చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ నిషేధం విధించారు. అది మొదలు నేటి వరకు ఫలున్ గాంగ్‌పై చైనా ప్రభుత్వం అణిచివేత కొనసాగుతూనే ఉంది.

కరోనా వైరస్ కేసుల సంఖ్యను చైనా దాచిపెట్టిందా?

మార్చి 19 నాటికి చైనాలో 81 వేల మందికి కరోనా వైరస్ సోకిందనీ… దీని కారణంగా 3200 మంది చనిపోయారనీ చైనా అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతానికి చైనాలో పరిస్థితి అదుపులోనే ఉందనీ… వైరస్ బాధితులు కొద్ది మంది మాత్రమే ఉన్నారని చైనా న్యూస్ ఏజెన్సీ జెన్హువా ప్రకటించింది. అయితే చైనా చెప్పిన అధికారిక సమాచారాన్ని ఎంత వరకు నమ్మొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా చెప్పినదానికంటే అక్కడ మరణించిన వారి సంఖ్య పది రెట్లు కంటే ఎక్కువగానే ఉంటుందని అనేక మంది నిపుణులు చెబుతున్నారు. వుహాన్ శ్మశాన వాటికకు చెందిన ఓ అధికారితో ఎపోక్ టైమ్స్‌ నిర్వహించిన రహస్య ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. జనవరి 22 నుంచి శ్మశానానికి వస్తున్న మృతదేహాల సంఖ్య ఆకాశాన్ని తాకిందనీ.. సాధారణంగా నిర్వహించే దహనాల కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా దహన కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చిందని ఆయన చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వుహాన్ నుంచి తనకు అందిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 50 వేలకు పైగా ఉంటుందని ప్రవాసంలో ఉన్న చైనా బిలియనీర్ గువో వెంగుయ్ ఆరోపించారు. మృతుల సంఖ్య గురించి మాత్రమే కాదు.. ఎంత మందికి కరోనా వైరస్ సోకిందన్న దానిపైనా చైనా ఇప్పటికీ సరైన సమాచారం ఇవ్వడం లేదు. వైద్య సిబ్బంది నుంచి సమాచారం పొక్కకుండా చూసేందుకు ఫోన్ కాల్స్, టెక్ట్స్ మెసేజ్, ఈమెల్స్, బ్లాగింగ్‌పై నిషేధం విధించడంతో పాటు కరోనా గురించి మాట్లాడకూడదని కూడా ఆదేశించింది. కరోనా గురించి ఏదైనా సమాచారం లీక్ చేస్తే మూడు నుండి ఏడేళ్ల పాటు జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరించింది.

ప్రారంభ దశలోనే అబద్ధాలు… అందుకే ఈ ఘోర దుస్థితి..

2019 డిసెంబర్ 8న కరోనా వైరస్ తొలిసారి వెలుగు చూసినప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ విషయం బయటికి పొక్కకుండా  తొక్కిపెట్టేసింది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు పరిస్థితి చేయిదాటిపోతుండడంతో… జనవరి 23న వుహాన్‌ ప్రజలందర్నీ ఏకాంతంలో పెట్టి  హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అప్పటికే వైరస్ వేలాది మందిని కబళించింది. 2019 డిసెంబర్ 30న వుహాన్‌ కంటి వైద్యుడు లీ వెన్‌లియాంగ్… సార్స్ లాంటి కొత్త వైరస్ గురించి హెచ్చరిస్తూ తన మెడికల్ స్కూల్ గ్రూప్‌లో ఓ సందేశం పెట్టారు. అయితే ‘‘పుకార్లు’’ సృష్టిస్తున్నారంటూ డాక్టర్ లీతో పాటు మరో ఏడుగురు వైద్యులను చైనా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. తర్వాత ఇదే వైరస్ కారణంగా డాక్టర్ లీ చనిపోయారు.

కాగా జనవరి 19న వుహాన్‌లోని బైబూటింగ్ నైబర్‌వుడ్‌లో జరిగిన ఓ కొత్త సంవత్సర వేడుకలో 40 వేలకు పైగా కుటుంబాలు హాజరయ్యాయి. ఈ కార్యక్రమం సందర్భంగా నగరానికి చెందిన అధికార యంత్రాంగం కరోనా వైరస్‌‌ను తక్కువ చేస్తూ ప్రకటనలు చేసింది. కరోనా వైరస్ అంటువ్యాధి కాదనీ.. ఇది మనిషి నుంచి మనిషికి చాలా తక్కువగా సోకుతుందని అధికారులు మీడియాతో పేర్కొన్నారు. అయితే ఆ తెల్లారే.. అంటే జనవరి 20 నుంచి కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. మరో మూడు రోజులకే.. అంటే జనవరి 23న నగరం మొత్తాన్ని లాక్‌డౌన్ చేస్తున్నట్టు వుహాన్ ప్రభుత్వం ప్రకటించింది. మరో రెండు రోజుల్లో హుబేయ్ ప్రావిన్స్‌లోని మరో 15 నగరాలు లాక్‌డౌన్ అయ్యాయి. సమాచారం వెల్లడించడంలో జరిగిన జాప్యం కారణంగా ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి వైరస్ శరవేగంగా విస్తరించింది. జనవరి 25న హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆరోగ్య శాస్త్రవేత్త ఎరిక్ ఫీగల్-డింగ్ ట్విటర్లో కరోనా గురించి స్పందిస్తూ.. ‘‘ఇది థర్మోన్యూక్లియర్ మహమ్మారి కంటే ప్రమాదకరమైనది. నేను చెప్పేదాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు..’’ అని వ్యాఖ్యానించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *