[spt-posts-ticker]

కరోనా సైరన్‌!

  • కొత్త కేసులతో అప్రమత్తమైన కేంద్రం
  • నియంత్రణ చర్యలు ముమ్మరం
  • మరో నాలుగు దేశాలవారికి వీసాలు రద్దు
  • ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష
  • రాజస్థాన్‌లో ఇటలీ దంపతులకు వైరస్‌ నిర్ధారణ

న్యూఢిల్లీ, మార్చి 3: దేశంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో భారత్‌ అప్రమత్తమైంది. నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల నుంచి వచ్చేవారి వీసాలను రద్దు చేసింది. కరోనా పాజిటివ్‌గా తేలిన ఢిల్లీ వ్యక్తికి చెందిన కుటుంబసభ్యులు సహా ఆరుగురిని ప్రత్యేక వైద్య కేంద్రంలో ఉంచింది. ఆయన కుమారుడు విద్యనభ్యసిస్తున్న నోయిడాలోని పాఠశాలతోపాటు మరో పాఠశాలను కూడా మూసివేశారు. మరోవైపు, రాజస్థాన్‌ జైపూర్‌లో ఇటలీ పర్యాటకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. 20 మంది పర్యాటకుల బృందంలో ఒకరైన ఆయనను ఎస్‌ఎమ్‌ఎస్‌ దవాఖానలోని ప్రత్యేక వార్డులో ఉంచినట్లు వెల్లడించారు. ఆయన భార్యకు కూడా  కరోనా వైరస్‌ సోకినట్టు తేలింది. దీంతో ఇప్పటివరకు దేశంలో ఏడు కేసులు నమోదయ్యాయి. సోమవారం ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో, ప్రధాని మోదీ మంగళవారం వైరస్‌ నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కూడా అన్ని విమానాశ్రయ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. నూతన మార్గదర్శకాలను జారీచేసింది. కరోనా అనుమానంతో ఆగ్రా కు చెందిన ఇద్దరు షూ ఎగుమతిదారులతోపాటు వారి కుటుంబానికి చెందిన నలుగురిని మంగళవారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ దవాఖానకు తరలించారు.

అమెరికాలో ఆరుకు చేరిన మృతులు

అమెరికాలో కరోనా బారిన పడి ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ తెలిపారు. వైరస్‌ సోకిన వారి సంఖ్య 90 దాటినట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నతస్థాయి వైద్య అధికారులు, ఫార్మారంగ దిగ్గజాలతో సోమవారం సమీక్ష నిర్వహించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికాకు కరోనా ముప్పు ఇప్పటికీ తక్కువేనని పెన్స్‌ చెప్పారు. వేసవి నాటికి చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదన్నారు. కాగా, కరోనా నియంత్రణకు ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో భారత సంతతికి చెందిన హెల్త్‌ పాలసీ కన్సల్టెంట్‌ సీమా వర్మకు చోటుదక్కింది.

చైనా వెలుపల విజృంభణ

చైనా వెలుపల కరోనా అంతకంతకూ విజృంభిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. చైనా వెలుపల కేసుల నమోదు ఎనిమిది రెట్లు పెరిగినట్లు తెలిపింది. దక్షిణ కొరియాలో కొత్తగా 851 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 5 వేలను దాటింది. మృతుల సంఖ్య 28కి పెరిగింది. మరోవైపు, చైనాలో కరోనా తగ్గుముఖం పట్టింది. మంగళవారం 125 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆ దేశంలో 2,943 మంది ప్రాణాలు కోల్పోగా.. 80 వేల మందికికరోనా సోకింది.

ఇరాన్‌లో మరో 11 మంది బలి

కరోనా వైరస్‌తో ఇరాన్‌లో మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలో మృతుల సంఖ్య 77కు పెరిగింది. కొత్తగా 835 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇరాన్‌లో 2,336 మందికి వైరస్‌ సోకింది.

మాస్కులకు మస్తు డిమాండ్‌

కరోనా కలకలంతో హైదరాబాద్‌లో మాస్కులకు డిమాండ్‌ పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో రోగులు, వారి సహాయకులు, వైద్యసిబ్బంది మాస్కులు ధరిస్తున్నారు. జనసాంద్రతగల ప్రదేశాలు, కళాశాలలు, పాఠశాలలు, జాతర్లలో మాస్కులు ధరిస్తున్నారు.  కరచాలనం వద్దు.. నమస్కారమే శ్రేయస్కరమంటూ అన్ని ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామికసంస్థలు ఉద్యోగులకు, తమ కస్టమర్లకు పోస్టర్లద్వారా అవగాహన కల్పిస్తున్నాయి.

కరోనా బులెటిన్‌..

గాంధీ దవాఖానలో మంగళవారం వరకు 155 మందికి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపారు. వారిలో ఒకరికి పాజిటివ్‌ అని నిర్ధారణ కాగా, 118 మందికి లక్షణాల్లేవని తేలింది. మరో 36 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉన్నది. కొవిడ్‌-19ను ముందస్తుగా గుర్తించే ప్రక్రియలో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 18,224 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది.

15% తగ్గిన విమానయానం

కరోనా వైరస్‌ ప్రభావం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై పడింది. రెండురోజులుగా విమాన ప్రయాణికులు 15% తగ్గినట్టు విమానాశ్రయవర్గాలు తెలిపాయి. విమానాలు రద్దుకాకపోయినా ప్రయాణికులు కొంతవరకు తగ్గారని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి. కాగా, కరోనా కేసు వెలుగుచూడటంతో ఎయిర్‌పోర్ట్‌లోని విదేశీ టర్మినల్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ సెంటర్లను ఒకటి నుంచి నాలుగుకు పెంచారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ తన సిబ్బందిని నెల రోజులు వేతనం లేని సెలవు తీసుకోవాలని కోరింది.

కామారెడ్డిలో కరోనా అనుమానితుడు?

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ సోకిందనే అనుమానంతో కామారెడ్డి నుంచి ఓ వ్యక్తిని గాంధీ దవాఖానకు తరలించారు. ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన అతడు 20రోజులపాటు కామారెడ్డిలోని ఓ దవాఖానలో చికిత్స పొందాడు. అయినా జ్వరం తగ్గకపోవడంతో కరోనా వైరస్‌ సోకిఉండవచ్చనే అనుమానంతో మంగళవారం గాంధీకి వైద్యులు రెఫర్‌ చేశారు. అతడి వివరాలను వైద్యులు గోప్యంగా ఉంచారు. ఈ విషయమై డీఎంహెచ్‌వోను వివరణ కోరగా అలాంటిదేదీ తమదృష్టికి రాలేదని తెలిపారు.

వీసాలు రద్దు..

ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ దేశీయులకు ఈ నెల 3 కంటే ముందు జారీచేసిన వీసాలను రద్దుచేస్తున్నట్లు కేంద్ర వైద్యశాఖ తెలిపింది. ఈ నెల కంటే ముందు జపాన్‌, దక్షిణ కొరియా దేశీయులకు జారీచేసిన వీసా ఆన్‌ అరైవల్స్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

నోయిడాలో రెండు పాఠశాలలు మూసివేత..

ఇటీవల ఇటలీలో పర్యటన నుంచి వచ్చిన ఢిల్లీ మయూర్‌ విహార్‌కు చెందిన వ్యక్తికి కరోనా నిర్ధారణ కావడంతో ఆయనను ఆదివారం రాత్రి సఫ్దర్‌జంగ్‌ దవాఖానకు తరలించినట్లు సమాచారం. ఆయన కుమారుడు చదువుతున్న నోయిడాలోని పాఠశాలను శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. నోయిడాలోని మరో పాఠశాలను శనివారం వరకు మూసివేయనున్నారు. ఢిల్లీ వ్యక్తి తమ కుమారుడి పుట్టినరోజు వేడుకను ఇటీవల నిర్వహించడంతో, ఆ పార్టీకి హాజరైన విద్యార్థులు, బంధువులకు కరోనా సోకి ఉండొచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *