[spt-posts-ticker]

కరోనా @ 33

రాష్ట్రంలో మరో ఆరు పాజిటివ్‌ కేసులు

ఐదుగురు విదేశాల నుంచి వచ్చినవారే

మరొక స్థానికుడికి కూడా కరోనా

ఇండోనేసియా మత ప్రచారకులతో

సన్నిహితంగా మెలగిన వ్యక్తికి పాజిటివ్‌

కరీంనగర్‌లో మొదలైన రెండో దశ

రెండు రోజుల్లోనే 12 మందికి నిర్ధారణ

 

హైదరాబాద్‌,: రెండు రోజుల వ్యవధిలో తెలంగాణలో ఏకంగా 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం కొత్తగా మరో ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 33కు పెరిగింది. రెండో దశకు సంబంధించి మరో కేసు కూడా నమోదైంది. ఇండోనేసియా నుంచి వచ్చిన మత ప్రచార బృందంలోని పది మందికి ఇప్పటికే కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. వారితో కలిసి తిరిగిన కరీంనగర్‌లోని కశ్మీర గడ్డకు చెందిన స్థానిక యువకుడి (23)కి తాజాగా కరోనా సోకింది. ఇండోనేసియా బృందంతో నేరుగా సన్నిహితంగా (ప్రైమరీ కాంట్రాక్టులు) మెలగిన 35 మందిని గుర్తించగా, వారిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడు గాంధీలో చికిత్స పొందుతున్నాడు. రెండో దశలో భాగంగా.. ఇటీవలే దుబాయ్‌ వెళ్లి వచ్చిన సికింద్రాబాద్‌ వ్యాపారి, ఆయన భార్యకు కరోనా సోకగా.. వారి కుమారుడికి కూడా పాజిటివ్‌ వచ్చింది. అదే తొలి లోకల్‌ కాంటాక్టుగా నమోదు కాగా.. తాజాగా కరీంనగర్‌లో రెండో కేసు నమోదైంది. దాంతో, అక్కడా కరోనా రెండో దశ ప్రారంభమైనట్లయింది.

 

సోమవారం నమోదైన ఆరు కేసుల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా విదేశాల నుంచి వచ్చినవారే. అంతా హైదరాబాదీలే. వీరిలో బల్కంపేటకు చెందిన యువకుడు (21) ఫ్రాన్స్‌ నుంచి, సైదాబాద్‌ శాంతినగర్‌కు చెందిన యువకుడు (30) లండన్‌ నుంచి, సోమాజిగూడ యువకుడు (20) న్యూయా ర్క్‌ నుంచి, గచ్చిబౌలికి చెందిన యువకుడు (25) లండన్‌ నుంచి, కూకట్‌పల్లికి చెందిన వ్యక్తి (56) శ్రీలంక నుంచి వచ్చారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

 

కొవిడ్‌ కలకలం

కొత్తగూడెం జిల్లాలో పోలీసు అధికారి కుమారుడు ఒకరికి పాజిటివ్‌ రావడం అక్కడ కలకలం రేపుతోంది. ఆ పోలీసు అధికారితో సన్నిహితంగా మెలిగిన  సిబ్బంది, బంధువులు, స్నేహితులను అధికారులు అనుమానితులుగా గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యులను గాంధీకి తరలించి క్వారంటైన్‌లో ఉంచారు. పోలీసు శాఖలో మరో 21 మందిని సోమవారం ప్రత్యేక వాహనంలో గాంధీకి తీసుకొచ్చారు. ఆ విద్యార్థి స్వగ్రామంలో బంధువుల గృహ ప్రవేశానికి కూడా వెళ్లాడని సమాచారం. అలాగే, కరోనా పాజిటివ్‌గా తేలిన కొత్తగూడెం యువకుడి కుటుంబసభ్యులను ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన వ్యక్తి మూడు రోజుల కిందట కలిశాడు. అనంతరం గ్రామానికి వచ్చి 19 మందితో సన్నిహితంగా మెలిగాడు. దాంతో, ఆ 20 మందిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌ జెమినీ కాలనీకి చెందిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగి ఒకరు షికాగో నుంచి ఆదివారం రాత్రి ఢిల్లీ వచ్చారు. అక్కడినుంచి హైదరాబాద్‌కు… విమానాశ్రయం నుంచి నేరుగా ఇంటికి వచ్చాడు.

 

స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు వచ్చి ప్రశ్నించగా హోం క్వారంటైన్‌లో ఉంటానని చెప్పాడు. అయినా, స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో గాంధీకి తరలించారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన నలుగురు అనుమానితులనూ ఆస్పత్రికి తరలించారు. అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు యువకులను క్వారంటైన్‌కు తరలించారు. తాము అమలాపురం వెళ్లిపోతామని చెప్పడంతో అంగీకరించారు. కానీ, వాళ్లు బేగంపేటలోని ఎయిర్‌లైన్స్‌ కాలనీలోని బంధువుల ఇళ్లకు వెళ్లారు. అక్కడ పార్కులో యధేచ్ఛగా తిరుగుతున్నారు. చేతులపై స్టాంపులను చూసి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి క్వారంటైన్‌లోనే ఉండాలని హెచ్చరించారు. సనత్‌నగర్‌ డివిజన్‌లోని సొలిటైర్‌ స్వామి ఓనర్స్‌ రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అపార్టుమెంట్‌లో ఉంటున్న మరో యువకుడు కూడా అమెరికా నుంచి వచ్చి బయట తిరుగుతున్నాడు.

 

దాంతో, అతనికి కూడా పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. హోం క్వారంటైన్‌ ముద్ర ఉన్న నలుగురు తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. శంషాబాద్‌ విమానాశ్రయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు. అమెరికాలోని షికాగో నుంచి శనివారం శంషాబాద్‌ వచ్చారు. వారికి ఏపీ పోలీసులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట, రామారెడ్డి, కామారెడ్డి మండలాలకు చెందిన ముగ్గురిలో కరోనా అనుమానిత లక్షణాలను వైద్యులు గుర్తించారు. వారిని గాంధీకి తరలించారు. ఏపీలో కరోనా కేసులు 7కు చేరాయి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *