[spt-posts-ticker]

కేంద్రం మెచ్చిన మన పల్లె

 • కరోనా కట్టడిలో గ్రామాలు ఆదర్శమని ప్రశంస
 • ఊరూరా పక్కాగా లాక్‌డౌన్‌
 • నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా
 • బహిరంగంగా ఉమ్మివేసేవారికి ఫైన్‌
 • మద్యం విక్రయిస్తే, పేకాటాడితే కేసు
 • స్టాండింగ్‌ కమిటీ సభ్యుల పహారా

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి) : ‘రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఎస్‌బీపల్లివాసులు బయటకి వెళ్లిరాగానే కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కొని, శానిటైజర్లు రుద్దుకొని గ్రామంలోకి వెళ్తున్నారు. ఇదే జిల్లా శంకర్‌పల్లి మండల ఎంపీపీ స్వయంగా మాస్కులు కుట్టి కొత్తపల్లి గ్రామస్థులకు పంపిణీచేశారు. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో సాంకేతిక సమస్య తలెత్తగా పలు గ్రామాల్లోని లబ్ధిదారులకు పింఛన్లు ఆలస్యమవుతున్నట్టు గ్రహించిన ఎంపీడీవో నేరుగా వెళ్లి అందజేశారు. ఇది నిజంగా ఆదర్శనీయం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ పల్లెల్లో కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. కరోనాను ఎదుర్కోవడంలో గ్రామాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి’ అంటూ కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నది. ఈ మూడు ఉదాహరణలను ప్రస్తావిస్తూ తెలంగాణలో పల్లెలు ఆదర్శంగా నిలిచాయంటూ బుధవారం కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రశంసించింది. గ్రామపంచాయతీల సేవలు అద్భుతంగా ఉన్నాయంటూ అభినందించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు ఏకతాటిపై నిలుస్తున్న మన పల్లె ప్రజలు.. ఇప్పుడు దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పల్లెప్రగతిలో భాగంగా ఏర్పాటైన లక్షల మంది స్టాండింగ్‌ కమిటీ బృందాలు కలిసికట్టుగా గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో కలిసి వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేస్తున్నారు.  నిబంధనలను ఉల్లంఘించినవారి నుంచి నిర్మొహమాటంగా జరిమానా వసూలుచేస్తున్నారు.

అత్యవసర వాహనాలకే అనుమతి

ఇప్పటికే ఊరి పొలిమేరల్లో కంచె వేసుకొని కొత్తవారిని రాకుండా అడ్డుకుంటున్న గ్రామస్థులు, లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకు ఇదే ఒరవడి కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇతరరాష్ర్టాలు, దేశాలనుంచి వచ్చినవారిని ఇల్లు కదలనివ్వడం లేదు. మద్యం విక్రయించినా, ఖాళీగా ఉన్నామంటూ పేకాట ఆడినా పోలీసులకు అప్పగిస్తున్నారు. పనిలేకుండా బయటకు వచ్చేవారు ఇంట్లోకి వెళ్లేవరకు స్టాండింగ్‌ కమిటీ సభ్యులు పట్టుబడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో కొన్నిప్రాంతాల్లో యువతులు ఈ బాధ్యత తీసుకున్నారు. రేషన్‌ దుకాణాలు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్ల సందర్భంగా, ఉపాధిహామీ పనుల్లోనూ కూలీలు నిర్ణీత దూరం పాటిస్తున్నారు.  ధాన్యం కొనుగోళ్లు, నిత్యావసర వస్తువుల వాహనాలనే గ్రామాల్లోకి అనుమతిస్తున్నారు.

కేంద్రం ప్రశంసలు

కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను కేంద్రం ప్రశంసించింది. వైరస్‌ నియంత్రణకు దేశంలోని రాష్ర్టాలు తీసుకుంటున్న చర్యలను పరిశీలించిన కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అంశాలను ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపింది. ఇప్పటికే ప్రధాని మోదీ కూడా తెలంగాణను అభినందించారు. తాజాగా బుధవారం గ్రామాలవారీగా కరోనా నియంత్రణపై చేపట్టిన చర్యలను ఉటంకిస్తూ ఆయా రాష్ర్టాలకు సూచనలుచేసింది. పలుగ్రామాల్లో అమలుచేస్తున్న చర్యలను ప్రస్తావిస్తూ అభినందించింది. తెలంగాణ మాదిరిగా దేశవ్యాప్తంగా అనుసరించాలంటూ సూచించింది.

గీత దాటితే జరిమానే..

గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లాక్‌డౌన్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యులు, వార్డుసభ్యులు కాపలా ఉంటున్నారు. యువత, స్టాండింగ్‌కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా పర్యవేక్షిస్తున్నారు. నిబంధనులు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటున్నారు.

 • ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాలో నిబంధన ఉల్లంఘించి గ్రామందాటిన వ్యక్తికి రూ. వెయ్యి జరిమానా వేశారు.
 • జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాలలో ఒకేరోజు మూడుసార్లు బయటకు వచ్చినందుకు రూ.వెయ్యి ఫైన్‌ వేశారు.
 • నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం ఏర్గట్లలో దుకాణం తెరిచినందుకు రూ.2 వేలు జరిమానా విధించారు.
 • వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం ఊరుగొండ చెక్‌పోస్ట్‌ వద్ద బహిరంగంగా ఉమ్మి వేసిన వ్యక్తిపై కేసు పెట్టారు.
 • మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం, శివారులో ద్విచక్ర వాహనాలపై జంటలుగా వెళ్లడంతో ఎనిమిది మందిపై కేసు నమోదైంది.
 • నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 16 మందిని గుర్తించి జరినామా విధించారు.
 • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో సిగరెట్లు,మత్తుపదార్థాలు సేవిస్తున్న 15మందిని పోలీసులకు పట్టిచ్చారు.
 • యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, వంగపల్లిలో మద్యం అక్రమ నిల్వలను గుర్తించి పోలీసులకు అప్పగించారు.
 • జోగుళాంబ గద్వాల, వరంగల్‌, మంచిర్యాల జిల్లాల్లో పేకాట ఆడుతున్నవారిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *