[spt-posts-ticker]

క్లోరోక్విన్‌ ఉత్పత్తిలో మనమే కింగ్‌!

  • అందుకే వెంటపడ్డ అమెరికా, ఇతర దేశాలు
  • మన కంపెనీలకు భారీ ఆర్డర్లు

గత వారం అమెరికా.. ఈ వారం బ్రెజిల్‌.. ఇలా పలు దేశాలు ‘‘మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కావాలి.. ఇవ్వండి ప్లీజ్‌’’ అని భారత్‌ను అభ్యర్థిస్తున్నాయి. మలేరియా నివారణకు వాడే ఈ మందు మన దగ్గరే ఎందుకు ఎక్కువగా ఉంది? అసలు ఈ మందు ఎలా పనిచేస్తుంది? ఇతర దేశాలకు ఇచ్చేసిన తర్వాత కూడా సరిపడే నిల్వలు మనకు ఉన్నాయా? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం..

మలేరియా జ్వరానికి విరుగుడుగా దక్షిణ అమెరికాలో సిన్‌చోనా అనే చెట్టు బెరడును వాడతారు. ఈ బెరడు నుంచి తయారుచేసిన మందే క్వినైన్‌. 1930ల నాటికి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మలేరియా వచ్చింది. దీనితో ఈ క్వినైన్‌ను కృత్రిమంగా రసాయనపదార్థాలతో తయారుచేయాల్సి వచ్చింది. అలా తయారుచేసిన మందే క్లోరోక్విన్‌. అయితే ఈ మందు వల్ల కొన్ని దుష్ఫలితాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనితో 1950లలో క్లోరోక్విన్‌ను మరింత శుద్ధి చేసి దాని తయారీ విధానంలో మార్పులు చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తయారుచేశారు. ప్రస్తుతం ఈ మందును మలేరియా, కీళ్లనొప్పులు, లూపస్‌ (ఎస్‌ఎల్‌ఈ)వంటి వ్యాధులకు వాడుతున్నారు. ఈ మందు మన శరీరంలో ప్రవేశించిన వెంటనే మలేరియా పరాన్నజీవి కలిగించే వాపును నివారిస్తుంది. అది ఇతర కణాలకు వ్యాపించకుండా అడ్డుకుంటుంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మలేరియాకు ఈ మందులనే వాడతారు.

మన దేశంలో ఎందుకు ఎక్కువ?

అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో మలేరియా వంటి వ్యాధులు తక్కువ. పైగా ఈ మందు చాలా చవక. దీనిని భారీగా ఉత్పత్తి చేయడం వల్ల ఫార్మా కంపెనీలకు పెద్దగా లాభాలు రావు. దీంతో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలు దీనిని ఉత్పత్తి చేయడం మానేశాయి. దీన్ని అవకాశంగా తీసుకొని భారత్‌, చైనాలు ఈ మందును ఎక్కువ మోతాదుల్లో తయారుచేస్తున్నాయి. మన దేశంలో ఇప్కా లేబొరేటరీస్‌, జైడస్‌ కేడిలా కంపెనీలతో పాటు అనేక స్థానిక కంపెనీలు కూడా దీన్ని ఉత్పత్తి చేస్తున్నాయి.

ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఈ మందులను ఉత్పత్తి చేసేది భారతే! అయితే ఈ మందు తయారీకి అవసరమైన యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియంట్‌ (ఏపీఐ)లో 70 శాతం మనం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. కరోనా వైరస్‌ వ్యాప్తిచెందడం మొదలు పెట్టిన తర్వాత ఈ డ్రగ్‌కు విపరీతంగా గిరాకీ పెరిగింది. ఇప్కా లేబొరేటరీస్‌, జైడస్‌ కేడిలా కంపెనీలకు అమెరికా నుంచి భారీ ఆర్డర్లు లభించాయి. దీంతో ఈ కంపెనీలు తమ ఉత్పత్తిని దాదాపు మూడు రెట్లు పెంచాయి. మరోవైపు.. స్థానికంగా ఉన్న చిన్న ఫార్మా కంపెనీలు కూడా ఈ మందును తయారుచేయడం మొదలుపెట్టాయి. దీంతో ఇతర దేశాలకు ఎగుమతి చేసిన తర్వాత కూడా అవసరమైనన్ని నిల్వలు ఉన్నాయని కేంద్రం మంగళవారం ప్రకటించింది.

అమెరికాలో ఎందుకంత డిమాండ్‌?

అమెరికాలో మలేరియా వంటి వ్యాధులు అతి తక్కువగా వస్తాయి. దీంతో ఆ దేశం వద్ద ఈ మందు నిల్వలు ఎక్కువగా లేవు. కరోనా వైరస్‌ వల్ల వచ్చే కొన్ని లక్షణాలను నివారించడంలో ఈ మందు పనికొస్తుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడయింది. దీంతో అమెరికాలో ఈ మందుకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. కానీ అన్ని నిల్వలు అమెరికా ప్రభుత్వం వద్ద లేవు. ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన ఒక ఫార్మా కంపెనీ అమెరికా ప్రభుత్వానికి మూడు కోట్ల డోస్‌లను విరాళంగా ఇచ్చింది. అయితే రోజు రోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో అమెరికా ప్రభుత్వం మరిన్ని డోస్‌లు అవసరమని గుర్తించి.. ఈ మందును సరఫరా చేయాలని భారత్‌ను కోరింది.

నిజంగానే కరోనాకు విరుగుడా?

ఈ విషయం ఇప్పటి దాకా కచ్చితంగా రుజువు కాలేదు. గత నెల ఒక ఫ్రెంచ్‌ కంపెనీ చేసిన అధ్యయనంలో ప్లేబిసో వంటి వాటి కన్నా ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తోందని తేలింది. అయితే ఈ అధ్యయనం కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ తరహాలోనే చైనా, బ్రిటన్‌ వంటి దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి.            -స్పెషల్‌ డెస్క్‌

క్లోరోక్విన్‌తో దుష్ప్రభావాలు

వాడటం ఆపేసిన స్వీడన్‌ వైద్యులు

కరోనాను తగ్గించే ‘మిరాకిల్‌ డ్రగ్‌’ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు! ఆ మందు కోసం మన దేశాన్ని అర్థిస్తున్నారు. చాలా దేశాలు కూడా ఆ మందు పంపాలని కోరుతున్నాయి. కానీ..స్వీడన్‌లోని కొన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగులకు ‘క్లోరోక్విన్‌’ మందు ఇవ్వగా వారికి మైగ్రేన్‌, గుండె కొట్టుకునే వేగంలో మార్పు రావడం, దృష్టి మందగించడం వంటి సమస్యలు వస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. ఆ మందు వాడిన ప్రతి 100 మందిలో ఒకరికి గుండెపోటు కూడా వస్తున్నట్టు గుర్తించారు. దీంతో వారు కరోనా పేషెంట్లకు ‘క్లోరోక్విన్‌’ మందును సిఫారసు చేయట్లేదు. అయితే, క్లోరోక్విన్‌తో దుష్ప్రభావాలున్నందునే దాన్ని మెరుగుపరచి శాస్త్రజ్ఞులు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ తయారుచేశారు.

భారతదేశం వద్ద తగినన్ని హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ నిల్వలున్నాయా?

కరోనా వైరస్‌ రాకుండా అడ్డుకునే టీకా ఏదీ లేకపోవడంతో.. యాంటీ మలేరియల్‌ ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)కు డిమాండ్‌ బాగా పెరిగింది. ఈ ఔషధం తయారీలో భారత ఔషధ కంపెనీలదే కీలకపాత్ర. ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల్లో 85ు మనదేశంలోనే తయారవుతాయి. కాబట్టి కొరత లేనట్టే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మన కంపెనీలు ఈ మందు ఉత్పత్తిని వేగవంతం చేశాయి.

హెచ్‌సీక్యూనే ఎందుకు?

కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌పై ఈ మందు ప్రభావవంతంగా పనిచేస్తోందని.. యాంటీ వైరల్‌ ప్రభావాన్ని చూపుతోందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కానీ, ఈ మందు కరోనా ఇన్ఫెక్షన్‌ను నయం చేయగలదా లేదా అన్నది ఇంకా నిరూపితం కాలేదు.

ముడిపదార్థం సరఫరాదారులు

హెచ్‌సీక్యూను తయారు చేయడానికి కావాల్సిన ముడిపదార్థం (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్‌) కోసం ఫార్మా కంపెనీలు ఏయే కంపెనీలపై ఆధారపడతాయంటే..

  1. అబ్బాట్‌
  2. ఇండియా
  3. రుసాన్‌ ఫార్మా
  4. మంగళం డ్రగ్స్‌
  5. యూనికెమ్‌
  6. లారస్‌ ల్యాబ్స్‌
  7. విజయశ్రీ ఆర్గానిక్స్‌

మన దేశానికి అవసరమైన హెచ్‌సీక్యూ ఔషధం ఉందా?

ఔషధ ఉత్పత్తిని ఇప్పటికే వేగం చేశారు. కాబట్టి మన అవసరాలకే కాదు విదేశాలకు ఎగుమతి చేయగలిగే సామర్థ్యం మన ఫార్మా కంపెనీలకు ఉంది.

భారత్‌ ఎంత ఉత్పత్తి చేయగలదు?

ప్రస్తుతం మన ఫార్మాకంపెనీలు నెలకు 4 టన్నుల హెచ్‌సీక్యూను ఉత్పత్తి చేస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో మార్చిలో ఉత్పత్తిని 10 టన్నులకు పెంచాయి. ఏప్రిల్‌లో 40 టన్నులకు, మేలో 70 టన్నులకు పెంచే ప్రయత్నంలో ఉన్నాయి.

భారత్‌లో ఎంత మందికి ఎన్ని ట్యాబ్లెట్లు కావాలంటే..

7 కోట్ల మందికి చికిత్సకు 10 కోట్ల ట్యాబ్లెట్లు సరిపోతాయి

ఏప్రిల్‌, మే నెలల్లో మనదేశంలో 110 టన్నుల హెచ్‌సీక్యూ ఉత్పత్తి అవుతుంది. మనకు కావాల్సింది కేవలం 10 టన్నులే. మిగతా 100 టన్నుల ఔషధ డోసులను విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. 100 టన్నులంటే దాదాపు 50 కోట్ల ట్యాబ్లెట్లు (200 మిల్లీగ్రాములు)

ఏయే దేశాలకు కావాలి?

అమెరికా, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, మన పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్‌ వంటివి

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *