[spt-posts-ticker]

జాగ్రత్త సుమా! మహా విపత్తిది

మేధ, శాస్త్రసాంకేతికంగా ఎంతో ఎత్తుకు ఎదిగినా… ప్రకృతి ప్రకోపించినపుడు మనిషి నిస్సహాయుడే అని నిరూపిస్తోంది కరోనా మహమ్మారి! దీన్ని కేవలం ఒక అంటువ్యాధిగా చూడలేం! ఒకవైపు నివారణకు మందు, వ్యాక్సిన్‌ కనుగునే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో వైపు చాపకింద నీరల్లె వైరస్‌ విస్తరిస్తోంది. సర్వశక్తులొడ్డి వ్యాప్తి నియంత్రించే ప్రయత్నాలు అత్యున్నత స్థాయిలో జరుగుతున్నాయి. అత్యధిక జనాభాగల చైనా నుంచి క్రమంగా ప్రపంచంలోని దాదాపు మూడో వంతు (60) దేశాలకు వైరస్‌ విస్తరించింది. ఎక్కడికక్కడ కల్లోలం రేపుతోంది. ఇది కేవలం వైద్యారోగ్య సమస్యగా పరిమితం కాలేదు. సమర్థ చైనా సమస్త మనుగడనే శాసిస్తోంది. ప్రతికూల ప్రభావం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. విశ్వ విపణి, తుఫానులో చిగు రుటాకులా అల్లాడుతోంది.

ఇప్పటికే తిష్టవేసిన ఆర్థికమాంద్యాన్ని తాజా స్థితి మరింత మందగింప  జేస్తోంది. ‘తదుపరి ఏంటి..?’ అనేదొక పెద్ద ప్రశ్నగా మానవ సమాజాన్ని భయపెడుతోంది. తమ దేశంలో వ్యాధి నిర్ధారణ అయతే, ప్రబలితే, వ్యాప్తిస్తే… పరిస్థితి ఏమిటి? అని ప్రపంచ దేశాలు బేరీజు వేసుకుంటున్నాయి. భారత్‌లోనూ తాజాగా మరో రెండు పాజిటివ్‌ కేసుల్ని గుర్తించినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో, మరోటి తెలంగాణ రాజధాని హైదరా బాద్‌లో! ఒకరు ఇటలీ నుంచి, మరొకరు దుబాయ్‌ నుంచి ఈ వైరస్‌తో దేశంలోకి వచ్చారు. వైరస్‌ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి 3,000 మంది మృత్యువాత పడగా దాదాపు 90 వేల కేసులు నమోద య్యాయి. చైనాలోనే 80 వేలు! బయట అత్యధికంగా దక్షిణ కొరియాలో 4,335 మందికి ఈ వైరస్‌ సోకింది. ఇరాన్‌లో (66 మరణాలు) 1,501 కేసులు, ఇటలీలో (34 మరణాలు) 1,694 కేసులు నమోద య్యాయి.

ప్రభావితులైన పలు దేశాలే కాక ఐరోపా సమాజం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఐక్య రాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ… ఇలా ఎవరికి వారు అప్రమత్తమై ముందు జాగ్రత్తలు తీసు కుంటున్నారు. చైనాతో, ఇతర ప్రభావిత దేశాలతో రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. అటునుంచి వస్తున్న వారిపై నిఘావేసి, వైద్యపరీక్షలు జరుపుతున్నారు. ప్రతి పరిణామాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉపశమన చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వాలు, వైద్య సంస్థలు, పౌరులు విధిగా పాటించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేస్తున్నారు. ప్రపంచ ప్రభుత్వాలకు, పౌరసమాజాలకు ఇప్పుడిదొక ముఖ్య ఎజెండా, అంతకు మించి సవాల్‌!

చైనా ఎంత వెలుగో అంత చీకటి! ఎంతటి ఉక్కుపాదమో అంతటి కార్యదక్షత! ఉత్పత్తి, మౌలికసదుపాయాల పరంగా విప్లవాత్మక ప్రగతితో ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తున్న చైనా సమాచార పరంగా ప్రజల్ని చీకటిలో ఉంచే పాలనా ఉక్కుపాదం. కరోనా వైరస్, వ్యాధి లక్షణాల గురించి మొదట హెచ్చరిక చేసిన డా‘‘ లీ వెల్నియాంగ్‌ని చైనా పాలకులు తప్పుబట్టారు. అదీ, వైరస్‌ పుట్టిన వుహాన్‌లో! ఆయన చెప్పేది తప్పని, సమాజ క్రమత చెడగొట్టే యత్నమని నిందించారు. వ్యాధి సోకి డా‘‘ లీ తానే స్వయంగా బలి అయితే గాని నమ్మలేదు. ఆయన చెప్పిందే నిజమని తర్వాత నిర్ధారణ అయింది. వ్యాధి ప్రబలుతున్న ఆరంభంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పక్షం రోజులకుపైగా కనబడ కుండా పోవడం ఇప్పటికీ గొప్యమే! ఏ మాటకామాట… వ్యాధి ప్రమాదకరంగా ప్రబలుతోందని తేలిన తర్వాత చైనా చేపట్టిన చర్యలు అసాధారణం! వేగం అనితర సాధ్యం! ప్రపంచంలో మరే దేశ మైనా ఇంతటి కఠిన నిర్బంధాన్ని అమలు చేయగలదా? అని సందేహించే స్థాయిలో చైనా కష్టపడు తోంది.

వైరస్‌ వ్యాప్తిని కఠినంగా కట్టడి చేస్తోంది. ప్రమాణాల ప్రకారం ఏం చేయాలో అక్షరం పొల్లు పోకుండా అదే చేస్తోంది. కోటికిపైగా జనాభా ఉన్న ఒక నగరాన్నే ఏకంగా ఇతర ప్రపంచంతో సంబంధాలు లేకుండా దిగ్బంధనం చేసింది. పట్టుమని పదిరోజుల్లో వేయి పడకల ఆస్పత్రి కట్టింది. వస్తోత్పత్తి పుట్టిళ్లు చైనాలోనే ఇప్పుడు మాస్క్‌ల కొరత వేదిస్తోంది. అది చైనా సమస్య! చైనా నుంచి బయటి సమాజానికి మొత్తం సరఫరా శృంకలం నిలిచిపోయింది, ఇది ప్రపంచ సమస్య! ఆపిల్, ఆడిడాస్‌… ఇలా ఒక్కటేమిటి లెక్కలేనన్ని కంపెనీలు, కడకు ఐరోపా, అమెరికాతో సహా ప్రపంచమే చేష్టలుడిగి దిక్కులు చూస్తోంది. ఇంతటి కీలక స్థానంలోని చైనా నేడొక ధీనావస్థ! విమానాలు ఎగ రటం లేదు. రైళ్లు పరుగెత్తడం లేదు. ఉత్పత్తి, రవాణా నిలిచిపోయింది. జనజీవనం స్తంభించింది. స్తబ్దత రాజ్యమేలుతోంది. ఎంతలో ఎంత తేడా? ఉరుకు–పరుగుల పరవళ్ల చైనాది నేడు నిస్తేజ స్థితి! కర్మాగారాలు పనిచేయట్లేదు, కాలుష్యమూ లేదు. పర్యావరణాన్ని చిన్నచూపు చూసేవారందరికీ ఒక హెచ్చరికలాంటి వాతావరణం ఈ రోజు చైనాలో నెలకొంది. దీన్నుంచి మిగతా ప్రపంచం ఏం పాఠం నేర్చుకుంటుందో చూడాలి. ఎవరి సంగతెలా ఉన్నా, భారత్‌ సత్వరం అప్రమత్తం కావాలి. రాగల ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేసి నివారణ చర్యలకు నడుం కట్టాలి.

కేవలం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని పౌర సమాజం చేతులు కట్టుకు నిలబడితే తీరని అన్యాయమే! కొవిడ్‌–19ని ఒక వ్యాధిగా కాకుండా ఉపద్రవంగా చూడాలి. ఎందుకంటే, మన దేశంలో అరకొర వైద్య సదుపా యాలు, చాలీచాలని వ్యాధినివారణా వ్యవస్థలు, నిబంధనలంటే భయంలేని జనాలు.. వ్యాధి వ్యాప్తిని నిలువరించడంలో అవరోధంగా మారుతాయి. చైనా లాగా కఠిన నియంత్రణ ఇక్కడ కనీసం ఊహించలేము. వైరస్‌ మనిషికి సోకిన తర్వాత రెండు వారాలు లోలోపల ఉండి, అంతర్గత రోగ నిరోధక వ్యవస్థను చిద్రం చేసిన తర్వాత గాని వ్యాధి లక్షణాలు బయటపడవు. ముందే ప్రతివారూ తమ సహజ రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల్ని, నిబంధనల్ని విధిగా పాటించాలి. వైద్య వ్యవస్థకు సహకరించాలి. వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే పరిస్థితుల్ని అధిగమిం చాలి. వ్యక్తులుగా, సమూహాలుగా, పౌర సమాజంగా అన్ని స్థాయిలో స్పందించి, తగు నివారణ చర్యలు చేపడితేనే ఈ విపత్తు నుంచి మనం, మన దేశం బయటపడి బాగుంటాయి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *