[spt-posts-ticker]

తెలంగాణాలో గురువారం కొత్తగా 27

రాష్ట్రంలో 154కు పెరిగిన బాధితులు

మర్కజ్‌కు వెళ్లొచ్చిన 900 మంది గుర్తింపు

రెండు రోజుల్లో 800 మందికి పరీక్షలు

ఇంకా జాడ తెలియని 130 మంది

మర్కజ్‌ వెళ్లొచ్చిన వారికి క్వారంటైన్‌ ముద్ర

 

హైదరాబాద్‌,  (ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో 57 మందికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. గురువారం కొత్తగా 27 మందికి వైరస్‌ ఉన్నట్టు తేలిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 154కు పెరిగింది. ఇందులో 14 మంది ఇప్పటికే కోలుకుని ఇంటికెళ్లిపోగా, గురువారం మరో ముగ్గురిని డిశ్చార్జ్‌ చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఇంకో 128 మంది గాంధీ, కింగ్‌ కోఠి, చెస్ట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 9 మంది మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం కరోనా కేసుల వివరాలను వైద్యారోగ్య శాఖ, సీఎం కార్యాలయం ప్రకటించగా, గురువారం మంత్రి ఈటల వెల్లడించారు. ఓ తెల్ల కాగితంపై లెక్క రాసి మీడియాకు విడుదల చేశారు. కొత్తగా వైరస్‌ బారిన పడ్డవారు ఎవరన్నది మంత్రి స్పష్టం చేయలేదు. వాళ్లు ఏ జిల్లా వాళ్లన్నది కూడా ప్రకటించలేదు. అయితే, మహబూబ్‌నగర్‌, ములుగు, జనగాం, సంగారెడ్డి, వరంగల్‌, మహబూబాబాద్‌, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాల్లో కరోనా కేసులు నమోదైనట్టు ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు గురువారం ప్రకటనలు విడుదల చేశారు. కాగా, ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 900 మందిని ప్రభుత్వం గుర్తించింది. రెండు రోజుల్లో వారిలోని 800 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారంతా స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. మరో 130మంది కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. తెలంగాణ నుంచి 1,030 మంది మర్కజ్‌కు వెళ్లివచ్చినట్లు అధికారులు లెక్క తేల్చిన సంగతి తెలిసిందే. వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేసింది.

 

ఇప్పటివరకు రంగారెడ్డి, హైదరాబాద్‌, సూర్యాపేట, ములుగు, సంగారెడ్డి, వరంగల్‌ అర్బన్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన వారికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇప్పటికే రంగంలోకి దిగి కరోనా పాజిటివ్‌ వ్యక్తులు ఏ ప్రాంతాల్లో తిరిగారు, ఎంత మందిని కలిశారో ఆరా తీస్తున్నారు. వారందరినీ జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాల్లో క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఉదాహరణకు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతడి ఇంటి చుట్టుపక్కల 499 ఇళ్లున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ఇళ్లలోని 1,986 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సేకరించిన నమూనాల ఫలితాలు వచ్చాయి. ఒకటి రెండు రోజుల్లో మర్కజ్‌కు వెళ్లిన అన్ని జిల్లాలకు చెందిన వారి నమూనాల ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. మర్కజ్‌ యాత్రికులతో పాటు వారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు క్వారంటైన్‌ ముద్ర వేశారు. ఇప్పటి దాకా విదేశీ ప్రయాణికులకు మాత్రమే క్వారంటైన్‌ ముద్ర వేయగా తాజాగా మర్కజ్‌తో సంబంధం ఉన్నవారందరికీ వేస్తున్నారు. మర్కజ్‌కు వెళ్లిన వారు, వారి కుటుంబ సభ్యులను వైద్య ఆరోగ్య శాఖ పరీక్షలకు, క్వారంటైన్‌ కేంద్రాలకు తీసుకొచ్చింది. కొందరు స్వచ్ఛందంగా వచ్చారు. మరికొందరు మొండికేశారు. దాంతో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకున్నారు. పాత బస్తీలో కొందరు సహాయ నిరాకరణ చేయడంతో ఎంఐఎం ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఆస్పత్రులకు పంపారు.

 

భయపడి బయటకు…

మర్కజ్‌ వెళ్లిన వారిలో ఎక్కువ మంది కరోనా బారిన పడుతుండటంతో మిగిలిన వారందరిలోనూ భయం పెరిగింది. దాంతో ఒక్కసారిగా గాంధీ ఆస్పత్రికి క్యూ కట్టారు. గ్రేటర్‌ పరిధిలో 603 మంది మర్కజ్‌కు వెళ్లారు. ఇప్పుడు వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా ఉన్నవారంతా పరీక్షలకోసం పరుగులు పెడుతున్నారు. బుధవారం 300, గురువారం  500 మంది నమూనాలను గాంధీలో సేకరించారు. బుఽధవారం సేకరించిన 300 నమూనాల్లో 30 పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గురువారం సేకరించిన వాటిలో కొన్ని పాజిటివ్‌ వచ్చాయని, మిగిలిన వాటి ఫలితాలు రావాల్సి వుందని అధికారులు చెబుతున్నారు. కాగా, మిస్సయిన 130 మంది గురించి ఆందోళన లేకపోలేదు.

 

నిండిపోతున్న ఆస్పత్రులు

మర్కజ్‌ బాధితులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ బెడ్స్‌ ఇప్పటికే నిండిపోయాయి. అక్కడ ప్రస్తుతం 135 మంది ఉన్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 70 మందికిపైగా రోగులు, 300 మందికిపైగా అనుమానితులు ఉన్నారు.  చెస్ట్‌ ఆస్పత్రికి గురువారం 14 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇప్పటికే అక్కడ 8 మంది చికిత్స పొందుతున్నారు. అనుమానితులు 31 మంది ఉన్నారు. కింగ్‌కోఠి ఆస్పత్రిలో 30 మందికి చికిత్స చేస్తున్నారు. అక్కడ మొత్తం 350 పడకలు అందుబాటులో ఉన్నాయి. చార్మినార్‌ నిజామియా జనరల్‌ ఆస్పత్రిలో 200 ఐసోలేషన్‌ పడకలు ఏర్పాటు చేశారు. అక్కడ 122 మంది అనునుమానితులు ఉన్నారు. జనగాం, ములుగు, సిద్దిపేట, నిజామాబాద్‌, గద్వాల్‌, కరీంనగర్‌ సహా పలు జిల్లాల్లో వందల మందిని క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *